ఆర్టీసీకి బాబు యాక్సిడెంట్ | rtc accident workers loss by babu | Sakshi
Sakshi News home page

ఆర్టీసీకి బాబు యాక్సిడెంట్

Published Thu, May 1 2014 1:08 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

ఆర్టీసీకి బాబు యాక్సిడెంట్ - Sakshi

ఆర్టీసీకి బాబు యాక్సిడెంట్

కార్మికుల కడుపు కొట్టాడు

ఆర్థిక సంస్కరణల పేరుతో ఆర్టీసీని  ప్రైవేటీకరించేందుకు అర్రులు చాచారు. కార్మికుల పొట్ట కొట్టేందుకు చూశారు. కడుపు కాలి నోరెత్తితే జీతం కట్‌చేసి కేసులు పెట్టారు. ఆందోళనకు దిగితే జైలుపాలు చేశారు. లక్షకుపైగా కార్మికులను రోడ్డుపాలు చేసేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపై చూపించిన రాక్షసత్వం ఇదంతా. లోపభూయిష్ట విధానాలతో ఆర్టీసీని అధోగతి పాలుచేసి చార్జీల పెంపుతో ప్రయూణికుల నడ్డి విరవడమే కాదు.. కార్మికులను రోడ్డెక్కేలా చేశారు. తొమ్మిదేళ్ల పాలనలో ఆరుసార్లు బస్సు చార్జీలు పెంచి ప్రయాణికుల ను ఉక్కిరిబిక్కిరి చేసిన బాబు నిర్వాకంపై ప్రత్యేక కథనం.

 
 షేక్ పోలుకల్ యూసుఫ్, కర్నూలు, ‘వద్దు బాబోయ్.. ఆ కష్టాల పాలన మళ్లీ మాకొద్దు.. ఆ తొమ్మిదేళ్లు అర్ధాకలితో అలమటించాం.. సంస్థ అభివృద్ధికి రెక్కలు ముక్కలయ్యేలా పనిచేసినా ఇల్లు గడిచేది కాదు. క్యాజువల్ పేరుతో ఉద్యోగులను తీసుకుని సక్రమంగా పనిచేయట్లేదని ఇంటికి పంపారు. న్యాయం కోసం ఆందోళన చేస్తే జైలుకు పంపారు. రెగ్యులర్ చేయాలని కోరితే నిలుపుదల చేస్తూ జీవోలిచ్చారు. వద్దు బాబోయ్ వద్దు.. చంద్రబాబు పాలన మాకొద్దు..’ అంటున్నారు ఆర్టీసీ కార్మికులు. ప్రైవేటీకరణ కోసం ఆర్టీసీని ముక్కలు చేయాలనుకున్న బాబు పాలన గుర్తుచేసుకుని భయపడిపోతున్నారు. జీతం పెంచమని 24 రోజులు సమ్మెచేస్తే జైలులో పెట్టించిన ఘటనలను వారు ఇప్పటికీ మరచిపోలేకపోతున్నారు.
 
కార్మికులపై కాటు వేసిన కాంగ్రెస్
ఆర్టీసీని ప్రైవేటీకరించాలని చూసిన బాబు ఆలోచనల్ని అనుసరిం చాలని వైఎస్ మరణం తర్వాత అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఆర్టీసీని నాలుగు ముక్కలు చేయాలనే ఆలో చనకు కూడా వచ్చింది. దీంతో మళ్లీ కార్మికుల్లో అభద్రతాభావం ఏర్పడింది. ప్రైవేటు బస్సులు అద్దె ప్రతిపాదికన పెద్ద ఎత్తున తీసుకోవడం, రిజర్వేషన్, గుడ్‌విల్ కేంద్రాలతోపాటు గ్రౌండ్ బుకింగ్ కేంద్రాల ప్రైవేటీకరణకు టెండర్లు పిలవడం వంటి వాటితో పాటు డిస్ ఎంగేజ్ పేరుతో కార్మికులను ఇంటికి కూడా పంపింది.

 సత్తా ఉన్న నేతకే ఓటు
 రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్టీసీ కూడా రెండు ముక్కలైంది. ఈ నేపథ్యంలో కష్టాలు తప్పవని భావించిన కార్మికులు, ఉద్యోగులు చంద్రబాబు వస్తే అవి అధికమై సంస్థ ప్రైవేటుపరం అవుతుందని భయాందోళనకు గురవుతున్నారు. వైఎస్ ఆశయ సాధన కోసం పనిచేసే నాయకుడిని గెలిపించుకోవాలని నిర్ణయించుకున్నారు.
 
బాబు హయాంలో...

- తొమ్మిదేళ్లలో ఆరుసార్లు చార్జీలు పెంచారు.
- నష్టాల సాకుతో ప్రైవేటీకరించాలనుకున్నారు.
- రూ.480కోట్ల మేర భారం వేశారు.
- 1995లో అరకొర డ్రైవర్లు, కండక్టర్లను క్యాజువల్ పద్ధతిలో తీసుకుని ఆ తరువాత ఉద్యోగుల భర్తీకి బ్రేక్ వేశారు. క్యాజువల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయరాదని యాక్ట్-2ను జారీ చేశారు.
- వేతనాలు పెంచాలంటూ 24 రోజులు నిరవధికంగా సమ్మెచేసిన కార్మికులపై చంద్రబాబు ఉక్కుపాదం మోపారు. వారిపై కేసులు పెట్టించారు. ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో 9.5 శాతం పెంచి చేతులు దులుపుకొన్నారు.
- పదివేల మంది కార్మికులను ఇంటికి పంపారు.
- ఔట్ సోర్సింగ్ ఆన్ కాంట్రాక్ట్ సిస్టమ్, హైర్ బసెస్ వంటి ప్రపంచ బ్యాంకు విధానాలను ఆర్టీసీలో ప్రవేశపెట్టడమే కాకుండా ఉద్యోగులను తగ్గించి, ప్రైవేటుకు దారి సుగమం చేశారు.
 
పెరిగిన చార్జీలు
- 1994లో ఆర్డినరీ బస్సులో ప్రయాణించే వారి నుంచి కిలోమీటరుకు 17 పైసలు వసూలు చేస్తే, 2003 నాటికి 35 పైసలు చేశారు.
- కిలోమీటరుకు 21 పైసలు ఉన్న ఎక్స్‌ప్రెస్ బస్సు చార్జీని 40 పైసలు పెంచారు.
- సెమీ లగ్జరీ చార్జీని 45 పైసలు చేశారు.
- 1995లో రూ.120కోట్లు, 1996లో 30 కోట్లు, 1997లో 60కోట్లు, 1999లో 150 కోట్లు, 2000లో 60 కోట్లు, 2003లో 60 కోట్ల చొప్పున ప్రయాణికులపై భారం వేశారు.
 
వైఎస్ హయాంలో లాభాల బాట
- మహానేత వైఎస్ పాలనలో రూ.117 కోట్ల లాభాలను ఆర్టీసీ ఆర్జించింది.
- ఆర్టీసీని ప్రైవేటీకరిస్తానని చంద్రబాబు చెప్పడంతో కార్మికుల్లో ఏర్పడిన అభద్రతా భావాన్ని వైఎస్ తొలగించారు.
- 2007, 2008, 2009లో కండక్టర్, డ్రైవర్ల పోస్టులు భర్తీ చేశారు.
- బాబు చేసిన చట్టం-2ను ఎత్తేసి 240 రోజుల సర్వీసు పూర్తిచేసిన 12వేల మంది కాంట్రాక్టు - కార్మికులను రెగ్యులర్ చేయించారు.
- వేతనాలు పెంచి ఉద్యోగుల మన్ననలు పొందారు.
- రాజన్న తన పాలనలో ఆర్టీసీ చార్జీలు పెంచలేదు.
- ఆర్టీసీ నష్టాల నివారణకు బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించారు. ఐఏఎం నివేదిక ప్రకారం రూ.600కోట్లు మంజూరు చేశారు.
- పన్ను భారాన్ని రెగ్యులర్ సర్వీసులపై 12.5 నుంచి 7 శాతం, సిటీ సర్వీసులపై 10 నుంచి ఐదు శాతానికి తగ్గించి ఆర్టీసీకి రూ.250 కోట్ల ఆర్థిక సహాయం అందించారు.
- పల్లెవెలుగు సర్వీసులు ప్రవేశపెట్టి గ్రామీణులకు మేలు చేశారు.
 
రోశయ్య, కిరణ్ హయాంలో ధరాభారం
- రోశయ్య అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోపే బస్ చార్జీలు పెంచారు. ఆ తరువాత బాధ్యతలు స్వీకరించిన కిరణ్‌కుమార్‌రెడ్డి మూడేళ్లలో మూడుసార్లు పెంచారు. అంతటితో ఆగకుండా డెవలప్‌మెంట్ సెస్ పేరుతో మరో చార్జీ వేశారు.
- నెలవారీ సీజన్ టికెట్, జెట్, జూబ్లీ హైటెక్ టికెట్లు, కపుల్ గిఫ్ట్ కార్డుల ద్వారా టోల్‌ప్లాజా చార్జీలను రూ.3 నుంచి రూ.5కు, ఇంద్ర, వెన్నెల, గరుడ, వెన్నెల ప్లస్ తదితర సర్వీసుల టోల్‌ప్లాజా చార్జీని రూ.3 నుంచి రూ.6కు పెంచారు.
- పల్లె వెలుగు కనీస చార్జీ రూ.3 నుంచి రూ.5 చేశారు.
- 2009లో లగ్జరీ బస్సుకు కిలోమీటరుకు 57 పైసల చొప్పున వసూలుచేస్తే, ఇప్పుడు ఆర్డినరీ బస్సుకే 59 పైసలు తీసుకుంటున్నారు.
- వీరి హయాంలో ఆర్టీసీకి రూ.650 కోట్ల నష్టం వచ్చింది.
 
కార్మికుల డిమాండ్లు ఇవీ..
- ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలి.
- అధికారుల వేధింపులు అరికట్టడంతోపాటు పనిభారాన్ని తగ్గించేందుకు ఖాళీలు భర్తీ చేయాలి.
- ప్రతి కార్మికుడు, ఉద్యోగికి స్థలం ఇచ్చి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలి.
- పభుత్వాస్పత్రులతో పాటు అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందించాలి.
- పిల్లలకు మెరుగైన, ఉన్నత విద్య కోసం చేయూతనివ్వాలి.
పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో పింఛన్ ఇవ్వడంతోపాటు సమస్యలు పరిష్కరించాలి. వైద్య సేవలు మెరుగుపరచా లి. బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలి.
 
చంద్రబాబు కార్మికద్రోహి
చంద్రబాబు ఆర్టీసీతో ఆటలాడుకున్నారు. చాలా మండలాల్లో బస్టాపులకు దూరంగా బస్‌స్టేషన్లు నిర్మించారు. అన్ని రాజకీయ పార్టీలు, ఆర్టీసీ యూనియన్లు కలిసి 24 రోజులు సమ్మెచేస్తే కేవలం 2.5 శాతం టాక్స్ తగ్గించిన పిసినారి బాబు. తాను జారీచేసిన రాయితీల జీవోలకు ఒక్క పైసా కూడా విదల్చకుండా కుట్రలు పన్నారు. కండక్టర్లు, డ్రైవర్లను పర్మినెంట్ చేయకుండా క్యాజువల్‌గానే ఉంచిన కార్మికద్రోహి. ప్రస్తుతం ఉన్న రూ.5వేల కోట్ల అప్పులకు చంద్రబాబే బాధ్యుడు. వైఎస్ నిర్ణయాలు, చేయూతతో సంస్థకు రూ.5వేల కోట్ల మేలు చేకూరింది. కార్మికులు చేసిన సమ్మె కాలానికి జీతాలు చెల్లించి మన్ననలు పొందారు.
 - ఎ.రాజారెడ్డి, వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్
 యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement