- వైఎస్సార్ సీపీ ఎస్సీ నేతలు
ఎస్సీలకు ఏం చేశారని చంద్రబాబుకు సన్మానం
Published Fri, Nov 18 2016 9:26 PM | Last Updated on Fri, Sep 28 2018 7:36 PM
మామిడికుదురు :
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను తుంగలో తొక్కి దళితుల ప్రయోజనాలను విస్మరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎందుకు సన్మానం చేస్తున్నారో వివరణ ఇవ్వాలని వైఎస్సార్ సీపీకి చెందిన ఎస్సీ నాయకులు ప్రశ్నించారు. స్థానిక అంబేడ్కర్ సామాజిక భవనంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆ పార్టీ రాజోలు కో–ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్రంలో 38 లక్షల మంది నిరుద్యోగులు ఉండగా వారిలో 14 లక్షల మంది ఎస్సీలు ఉన్నారన్నారు. అధికారం చేపట్టిన రెండున్నరేళ్లలో వీరిలో ఏ ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారాని ప్రశ్నించారు. లక్ష కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో ఎస్సీలకు ఏడాదికి రూ.20 కోట్లు నిధులు కేటాయించాల్సి ఉండగా, నామమాత్రంగా నిధులు కేటాయిస్తున్నారని ధ్వజమెత్తారు. రెండున్నరేళ్లలో ఎస్సీలకు రూ.16 కోట్లు కేటాయించినప్పటికీ వాటిలో కేవలం రూ.8 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నా రు. ఎస్సీలను కోటీశ్వరులను చేస్తానన్న చంద్రబాబు రాష్ట్రంలో ఎంత మందిని కోటీశ్వరులను చేశారో చెప్పాలని పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి ప్రశ్నించారు. దళిత వ్యతిరేకి అయిన చంద్రబాబు కులాల మధ్య కుమ్ములాటలు పెడుతున్నారని జిల్లా పరిషత్ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజించి పాలించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని ముమ్మిడివరం నగర పంచాయతీ ఫ్లోర్ లీడర్ కాశిన మునికుమారి వ్యాఖ్యానించారు. నీతి పూడి చంద్రరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పి.గన్నవ రం కో–ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, ఎస్సీ నాయకులు గెడ్డం కృష్ణమూర్తి, భూపతి వెంకటపతి, జిల్లెళ్ల బెన్నీసుభాకర్, యల్లమెల్లి సుబ్బారావు, కొనుకు నాగరాజు, పోతుల కృష్ణ పాల్గొన్నారు.
Advertisement
Advertisement