ఆ ‘మాట’లన్నీ నీటిమూటలేనా!?
ఉద్యోగులకు ఎన్నికల్లో హామీలు గుప్పించిన టీడీపీ
అధికారంలోకి వచ్చాక ఊసెత్తని సీఎం చంద్రబాబు
పదో పీఆర్‌సీ అమలు ఉద్యోగులు, పెన్షనర్ల నిరీక్షణ
హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఉద్యోగ వర్గాలకు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విస్మరిం చింది. అధికారం చేపట్టి మూడు నెలలు కావస్తున్నప్పటికీ కేవలం ఉద్యోగుల వయోపరిమితిని పెంచి చేతులు దులుపుకుంది. పైగా ఆ పెంపు కూడా అయోమయంగానే ఉంది. ఏపీలో రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టుల ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంపు వర్తింపుపై గందరగోళం నెలకొంది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు వల్ల పదవీ విరమణకు దగ్గరగా ఉన్న అతి స్వల్ప ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం కలిగింది. మెజారిటీ ఉద్యోగులకు ఈ పెంపు వల్ల ప్రయోజనం కలగకపోగా పదోన్నతుల కోసం అదనంగా రెండేళ్లపాటు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని ఉద్యోగ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఉద్యోగుల పదో వేతన సవరణ కమిషన్ (పీఆర్‌సీ) సిఫారసుల అమలు గురించి గానీ, ఐదు రోజుల పని దినాల గురించి గానీ, ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ గురించి గానీ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ గురించి గానీ చంద్రబాబు సర్కారు అసలు పట్టించుకోవడం లేదని.. ఆ హామీలన్నిటినీ విస్మరిస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పీఆర్‌సీ నివేదికను చూశారా..?
పీఆర్‌సీసిఫారసులను కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే యథాతథంగా అమలు చేస్తామని టీడీపీ ఎన్నికల హామీల్లో స్పష్టం చేసింది. అయితే రాష్ట్రం విడిపోకముందే రాష్ట్రపతి పాలనలోనే గవర్నర్ నరసింహన్‌కు పీఆర్‌సీ తన నివేదికను సమర్పించింది. అనంతరం రాష్ట్రం విడిపోయి రెండు రాష్ట్రాలు ఏర్పడగానే రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు పీఆర్‌సీ నివేదికలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు లక్షల మంది ఉద్యోగులు, 3.60 లక్షల మంది పెన్షనర్లు కలిపి మొత్తం 7.60 లక్షల మంది పీఆర్‌సీ నివేదిక అమలు కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ సర్కారు అధికారం చేపట్టి మూడు నెలలు కావస్తోంది.. కానీ ఇంతవరకూ పీఆర్‌సీ నివేదికను సర్కారు విప్పి చూసింది లేదు. దీనిపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గత ఏడాది జూలై నుంచి పీఆర్‌సీ సిఫారసుల అమలును వర్తింపజేయాల్సి ఉంది. గత ప్రభుత్వం పీఆర్‌సీ నివేదిక రాకముందే ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చింది. దానితోనే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తోందని, పీఆర్‌సీ నివేదిక అమలును విస్మరిస్తోందని ఉద్యోగ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
5 రోజుల పని దినాల హామీ ఊసేదీ?
ఇక ఉద్యోగులకు ఐదు రోజుల పని దినాల విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ.. అధికారం లోకి వచ్చాక ఇంతవరకూ ఆ ఊసే ఎత్తడం లేదని ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి. ఉద్యోగుల ఇంటి అద్దె భత్యం పెంపును కూడా రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని పేర్కొం టున్నాయి. మరోపక్క ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తామని ఎన్నికల హామీ ల్లో పేర్కొన్న టీడీపీ.. సర్కారు పగ్గాలు చేపట్టాక ఆ హామీ అమలు దిశగా ఎటువంటి చర్యలూ చేపట్టడం లేదని ఉద్యోగ వర్గాలు తప్పుపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1.45 లక్షల ప్రభుత్వ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తేల్చారు.
కాంట్రాక్టు క్రమబద్ధీకరణ మాటేది?
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని టీడీపీ ఎన్నికల్లో హామీ ఇచ్చిం ది. మొత్తం నాలుగు లక్షల మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు క్రమబద్ధీకరణ హామీ అమలైతే జీవితాలు కొంతైనా మెరుగుపడతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు.
క్రమబద్ధీకరణ మాట అటుంచి ఉపాధి హామీ పథకంలోని 2,900 మంది క్షేత్రస్థాయి సహాయకులను ఉద్యోగాల నుంచి తొలగించడానికి బాబు సర్కారు ఆదేశాలిచ్చింది. దీంతో కాంట్రాక్టు, ఔట్ సో ర్సింగ్ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.