జీవో 271 ఉపసంహరించకపోతే ఉద్యమం | withdra demand for Go 271 | Sakshi
Sakshi News home page

జీవో 271 ఉపసంహరించకపోతే ఉద్యమం

Published Thu, Aug 4 2016 7:35 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

జీవో 271 ఉపసంహరించకపోతే ఉద్యమం

జీవో 271 ఉపసంహరించకపోతే ఉద్యమం

  •   అఖిలపక్ష రైతు సంఘాల ధర్నా 
  •  నాదెండ్ల ( గుంటూరు): రైతులు తిరగబడక ముందే ప్రభుత్వం జారీ చేసిన 271 జివోను వెంటనే ఉపసంహరించుకోవాలని నల్లమడ రైతు సంఘం నాయకులు డాక్టర్‌ కొల్లా రాజమోహనరావు డిమాండ్‌ చేశారు. అఖిలపక్ష రైతు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. భూ యాజమాన్య హక్కులను హరింపచేసే 255, 271 జీవోలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్టాప్‌ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి రాజమోహనరావు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల చేతిలో ఉన్న భూములను బడా పారిశ్రామికవేత్తలకు అప్పజెప్పేందుకే ఈ ప్రయత్నం జరుగుతోందన్నారు.  ఈ జీవోతో రైతుల్లో అశాంతి, అలజడి, ఆందోళన ప్రారంభమయ్యాయని, జీవో ఉపసంహరించుకునేంతవరకూ ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. రెవెన్యూ రికార్డులు 1బీలో ఉన్న తప్పులను పూర్తి స్థాయిలో సవరించేంత వరకూ జీవోను నిలుపుదల చేయాలన్నారు. ఆర్‌వోఆర్‌ కాపీ, అడంగల్‌ కాపీలను పంచాయతీ కార్యాలయాల్లో వీఆర్వో వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. గ్రామస్థాయిలో జరిగే సాధికారిక సర్వేలో 1బి తదితర అంశాలను పూర్తి స్థాయిలో సవరించాలన్నారు. భూ యాజమాన్య హక్కు పత్రం ఆధారంగానే రిజిస్ట్రేషన్లు జరిగేలా ఉండాలన్నారు. కంప్యూటర్లో ఉన్న 1బి, అడంగల్‌లో 70 శాతం తప్పులతో ఉన్నాయని, 30 శాతం మాత్రమే స్పష్టంగా ఉన్నాయని, నూరుశాతం రెవెన్యూ రికార్డులు సవరించేంత వరకూ జీవోను నిలుపుదల చేయాలన్నారు. రెవెన్యూ రికార్డుల్లో తప్పులు సవరించకుండానే పాసుపుస్తకాలు, టైటిల్‌డీడ్‌ను రద్దు చేయటం అన్యాయమని, దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
    రైతుల వెన్నుముక విరిచే యత్నం
     
     ఏపీ రైతు సంఘం సహాయ కార్యదర్శి బొల్లు శంకరరావు మాట్లాడుతూ రైతులే దేశానికి వెన్నుముక అని చెప్పే నేటి పాలకులు రైతుల వెన్నుముకను విరిచే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఏపీ రైతు సంఘం నాయకుడు తాళ్లూరి బాబూరావు మాట్లాడుతూ ఇటీవలే ఉప ముఖ్యమంత్రి చినరాజప్పను కలిసి పాసుపుస్తకాలను రద్దు చేయొద్దని విన్నవిస్తే ఆయన దాటవేత ధోరణిలో వ్యవహరించారన్నారు. తహశీల్దార్‌ మేడూరి శిరీష అందుబాటులో లేకపోవటంతో ఆర్‌ఐ వేణుగోపాలరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో భారత్‌కిసాన్‌ సంఘ్‌ నాయకులు శేఖర్, నల్లమోతు సుబ్బారావు, పెంట్యాల దివాకర్‌బాబు, నల్లమోతు సత్యనారాయణ, బ్రహ్మం, ఐద్వా నాయకురాలు సీహెచ్‌ అమరమ్మ, జగన్నాధమ్మ తదితరులు పాల్గొన్నారు.
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement