GO 271
-
జీఓ 271తో వినాశనమే
ఆమదాలవలస: రైతు యాజమాన్య హక్కును హరించే జీఓ నంబర్ 271తో రైతు బతుకు నాశనమవుతుందని, ఆ జీఓను రద్దు చేయాలని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర హై పవర్ కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్‌కుమార్‌లతో పాటు మరికొందరు వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి వెళ్లి తహశీల్దారుకు జీవో రద్దు చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ పట్టాదారు పాస్‌పుస్తకాలు రద్దు చేయడం వల్ల రైతులకు ఆధారం పోతుందని అన్నారు. ఒకరి భూములు వేరొకరు క్రయవిక్రయాలు చేసే ప్రమాదం ఉందన్నారు. దీనివల్ల భూ తగాదాలు పెరుగుతాయని తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కొత్త సర్వే నిర్వహించి, గ్రామసభలు పెట్టి రైతులకు అన్ని వివరాలు చెప్పి, ఆన్లైన్ చేసినప్పటికీ మ్యాన్యువల్‌గా కూడా పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్లకు గుర్తింపు ఉంచే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తమ్మినేని శ్రీరామమూర్తి, మున్సిపల్ వైస్ ఫ్లోర్ లీడర్ అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, నాయకులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, సైలాడ దాసునాయుడు, గురుగుబెల్లి చలపతిరావు, బొడ్డేపల్లి జోగారావు, బత్తుల లక్ష్మణరావు(బుజ్జి), పొన్నాడ నాగు, రాకీ, పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. -
జీవో 271 ఉపసంహరించకపోతే ఉద్యమం
అఖిలపక్ష రైతు సంఘాల ధర్నా నాదెండ్ల ( గుంటూరు): రైతులు తిరగబడక ముందే ప్రభుత్వం జారీ చేసిన 271 జివోను వెంటనే ఉపసంహరించుకోవాలని నల్లమడ రైతు సంఘం నాయకులు డాక్టర్ కొల్లా రాజమోహనరావు డిమాండ్ చేశారు. అఖిలపక్ష రైతు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. భూ యాజమాన్య హక్కులను హరింపచేసే 255, 271 జీవోలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్టాప్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి రాజమోహనరావు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల చేతిలో ఉన్న భూములను బడా పారిశ్రామికవేత్తలకు అప్పజెప్పేందుకే ఈ ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ జీవోతో రైతుల్లో అశాంతి, అలజడి, ఆందోళన ప్రారంభమయ్యాయని, జీవో ఉపసంహరించుకునేంతవరకూ ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. రెవెన్యూ రికార్డులు 1బీలో ఉన్న తప్పులను పూర్తి స్థాయిలో సవరించేంత వరకూ జీవోను నిలుపుదల చేయాలన్నారు. ఆర్వోఆర్ కాపీ, అడంగల్ కాపీలను పంచాయతీ కార్యాలయాల్లో వీఆర్వో వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. గ్రామస్థాయిలో జరిగే సాధికారిక సర్వేలో 1బి తదితర అంశాలను పూర్తి స్థాయిలో సవరించాలన్నారు. భూ యాజమాన్య హక్కు పత్రం ఆధారంగానే రిజిస్ట్రేషన్లు జరిగేలా ఉండాలన్నారు. కంప్యూటర్లో ఉన్న 1బి, అడంగల్‌లో 70 శాతం తప్పులతో ఉన్నాయని, 30 శాతం మాత్రమే స్పష్టంగా ఉన్నాయని, నూరుశాతం రెవెన్యూ రికార్డులు సవరించేంత వరకూ జీవోను నిలుపుదల చేయాలన్నారు. రెవెన్యూ రికార్డుల్లో తప్పులు సవరించకుండానే పాసుపుస్తకాలు, టైటిల్‌డీడ్‌ను రద్దు చేయటం అన్యాయమని, దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రైతుల వెన్నుముక విరిచే యత్నం ఏపీ రైతు సంఘం సహాయ కార్యదర్శి బొల్లు శంకరరావు మాట్లాడుతూ రైతులే దేశానికి వెన్నుముక అని చెప్పే నేటి పాలకులు రైతుల వెన్నుముకను విరిచే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఏపీ రైతు సంఘం నాయకుడు తాళ్లూరి బాబూరావు మాట్లాడుతూ ఇటీవలే ఉప ముఖ్యమంత్రి చినరాజప్పను కలిసి పాసుపుస్తకాలను రద్దు చేయొద్దని విన్నవిస్తే ఆయన దాటవేత ధోరణిలో వ్యవహరించారన్నారు. తహశీల్దార్ మేడూరి శిరీష అందుబాటులో లేకపోవటంతో ఆర్ఐ వేణుగోపాలరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో భారత్‌కిసాన్ సంఘ్ నాయకులు శేఖర్, నల్లమోతు సుబ్బారావు, పెంట్యాల దివాకర్‌బాబు, నల్లమోతు సత్యనారాయణ, బ్రహ్మం, ఐద్వా నాయకురాలు సీహెచ్ అమరమ్మ, జగన్నాధమ్మ తదితరులు పాల్గొన్నారు. -
271 జీవో రైతుల ప్రయోజనాలకు హానికరం
వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి సాక్షి, హైదరాబాద్: జీవో 271 రైతుల ప్రయోజనాలకు హానికరంగా పరిణమించిందని వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. జీవో 271 వల్ల ఉత్పన్నమవుతున్న దుష్ఫలితాలను, రైతుల్లో నెలకొన్న ఆందోళనను వివరించారు. ఈ జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించాలని కోరుతూ ఈ నెల 23న విజయవాడ గాంధీనగర్‌లోని రైస్‌మిల్లర్స్ హాలులో నిర్వహించే అఖిలపక్ష రైతు సంఘాల సమావేశానికి వైఎస్సార్సీపీ నేతలను పంపాలని ఆయన జగన్‌కు విజ్ఞప్తి చేశారు. పార్టీ నుంచి ఇద్దరు ముఖ్యనేతలను పంపుతానని జగన్ ఆయనకు హామీ ఇచ్చారు.