మహిళ మెదడులోని కణితి తొలగింపు
మహిళ మెదడులోని కణితి తొలగింపు
Published Tue, Aug 9 2016 8:07 PM | Last Updated on Thu, May 3 2018 3:20 PM
విశాఖ మెడికల్: అరుదైన రక్తనాళాల వాపు (ఎన్యురిజమ్) శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు ఇండస్ ఆస్పత్రి న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ టి.సురేష్ మంగళవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. అరుదైన శస్త్రచికిత్స వివరాలను ఆయన తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం వన్నాడ గ్రామానికి చెందిన జగన్నాథమ్మ (45) నియంత్రణలో లేని రక్తపోటు, వాంతులు, తీవ్రమైన తలనొప్పితో వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిందన్నారు. ఆమెను పరీక్షించగా మెదడు మధ్య భాగంలో ఉన్న రక్తనాళంలో అసాధారణ వాపు ఏర్పడి అది కణితి రూపంలో గడ్డకట్టినట్లు గుర్తించామన్నారు. ఈ కణితి చుట్టూ ఉన్న చిన్నపాటి రక్తనాళాలు మెదడులోని ముఖ్యమైన శరీర భాగాలకు రక్తం సరఫరా చేస్తాయి. వీటికి ఎటువంటి ముప్పు జరగకుండా స్కల్ బేస్, సెరిబ్రోవాస్కులర్ ప్రక్రియ ద్వారా అత్యంత చాకచక్యంగా కణితిని తొలగించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో పుర్రె భాగం పక్కనుండి రంద్రంచేసి రక్తనాళ కణితిని, పక్కన ఉన్న చిన్న చిన్న రక్తనాళాలను జాగ్రత్తగా విడదీసి క్లిప్పింగ్ చేసి రక్తపోటును నియంత్రించి రక్తస్రావం జరగకుండా తొలగించామన్నారు. 8 గంటల పాటు నిర్వహించిన ఇటువంటి ఎన్యురిజమ్ సర్జరీలు గతంలో ముంబాయి, మద్రాసు వంటి నగరాలకు చికిత్సకు తరలించేవారని, ఇప్పుడు ఈ తరహా శస్త్రచికిత్సలు ఇండస్‌లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ శస్త్రచికిత్సకు న్యూరో మత్తు వైద్యుడు శ్రీనివాస్ సహకరించారన్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుందన్నారు. త్వరలో డిశ్చార్జి చేయనున్నామన్నారు.
Advertisement
Advertisement