పద్మ, రామమోహన్‌రావు కలిసి తీయించుకున్న ఫొటో
యువతి ఆత్మహత్య
పీఎంపాలెం(విశాఖపట్నం): ప్రేమించి వివాహం చేసుకున్న వ్యక్తి నమ్మక ద్రోహం చేయడంతో ఓ యువతి ఉరి వేసుకుని తనువు చాలించింది. ఈ సంఘటన మారికవవలస రాజీవ్ గృహకల్పలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి మృతురాలి బంధువులు, పీఎంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా రాజాం వస్త్రపురి కాలనీకి చెందిన జామి ఆదినారారయణకు ముగ్గురు కుమార్తెలు. చిన్నకుమార్తె పద్మ (25), వారి ఇంటి సమీపంలోనే నివశిస్తున్న కె.రామ మోహన్‌రావు సుమారు మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు.
ఈ క్రమంలో గత సంవత్సరం జూలై నెలలో ఇరు కుటుంబాలకు తెలియజేయకుండా రహస్యంగా వివాహం చేసుకున్నారు. రామమోహన్‌రావు ఆర్మీ ఉద్యోగి కావడంతో వివాహం చేసుకున్న తర్వాత ఉద్యోగానికి వెళ్లిపోయాడు. అనంతరం మారికవలస రాజీవ్ గృహకల్ప ప్లాట్ నంబరు 61లో నివసిస్తున్న రెండో అక్క రమ వద్దకు పద్మ వచ్చి ఉంటోంది.
పైడిభీమవరంలోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రమ తన చెల్లి పద్మను స్థానికంగా ఉన్న కుట్టు మిషన్ శిక్షణ కేంద్రంలో చేర్పించింది. పెళ్లి గురించి పెద్దలకు చెప్పకపోయినా ఫోనులో మాత్రం రోజూ రామమోహన్‌రావుతో పద్మ మాట్లాడుతుండేది. తాము ఇద్దరం భార్యా భర్తలమే అన్న నమ్మకంతో పద్మ ఆనందంగా ఉండేది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి స్వస్థలం వచ్చిన రామమోహన్‌రావు కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ఇంటికి తీసుకెళ్లలేనని స్పష్టం చేశాడు. దీంతో తన పెళ్లి విషయాన్ని తల్లిదండ్రులు, పెద్దలకు చెప్పుకుని పద్మ విలపించింది. పెద్దలు రంగంలోకి దిగి ఇరు కుటుంబాల వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినప్పటికీ రామమోహన్‌రావు అంగీకరించలేదు. మరో పెళ్లి చేసుకోడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు.
ఈ క్రమంలో తాను మోసపోయానని గ్రహించిన పద్మ ఆదివారం మధ్యాహ్నం అక్క ఇంట్లో లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎప్పుడూ చలాకీగా కుటుంబ సభ్యులతో కలివిడిగా ఉండే పద్మ ఆత్మహత్య చేసుకుందని తెలుసుకున్న బంధువులు రాజాం నుంచి తరలివచ్చారు. విగత జీవిగా ఉన్న పద్మను చూసి కుటుంబ సభ్యులు రోదించిన తీరు అక్కడ ఉన్న వారిని కలిచివేసింది. రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో విషాదం నెలకొంది. ప్రేమించి, పెళ్లి చేసకుని, తర్వాత ముఖం చాటేసిన ఆర్మీ ఉద్యోగి రామ మోహన్‌రావుని కఠినంగా శిక్షించాలని మృతురాలి అక్క రమ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సీఐ కె.లక్ష్మణరావు పర్యవేక్షణలో ఎస్‌ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.