PM Palem
-
పీఎం పాలెం: రియల్టర్ కిడ్నాప్ కలకలం.. 12 లక్షలు డిమాండ్!
సాక్షి, విశాఖపట్నం: పీఎం పాలెంలో రియల్టర్ కిడ్నాప్ కలకలం సృష్టించింది. ప్లాట్ అమ్మకం విషయంలో రియల్టర్ మధుసూదన్ రావుకు రౌడీ షీటర్ హేమంత్ కుమార్‌కు మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో మధుసూదన్ రావును కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. ప్లాట్ అమ్మకాల్లో వివాదం కారణంగా రౌడీ షీటర్ 12 లక్షలు డిమాండ్ చేశాడు. ఇది కుదరకపోవడంతో రియల్టర్ మధుసూదన్‌ను రౌడీ షీటర్ హేమంత్ కిడ్నాప్ చేశారు. దీంతో, బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసు కమిషనర్ శ్రీకాంత్‌ను ఆశ్రయించారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాప్ కేసుపై దర్యాప్తు చేపట్టారు. పద్మనాభం అనే వ్యక్తి వద్ద మధుసూదన్ ఉన్నట్టు గుర్తించారు. దీంతో, రియల్టర్ మధుసూదన్ సురక్షితంగా ఉన్నట్టు పేర్కొన్నారు. కాగా, రౌడీ షీటర్ హేమంత్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. హేమంత్ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇక, మధుసూదన్ కిడ్నాప్‌కు సహకరించిన ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు చెప్పారు. -
Sagubadi: చక్కనింట.. మిద్దె పంట .. ఆదాయం.. ఆరోగ్యం
ఆమె అందరిలా కాలక్షేపం చేయలేదు. తన అభిరుచిని ఆచరణలో పెట్టింది. రోజుకు రెండు గంటల పాటు శ్రమించి తక్కువ స్థలంలోనే మినీ క్షేత్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ క్షేత్రానికి తన ఇంటి మేడతో పాటు ఆవరణను ఎంచుకుంది. వివిధ రకాల పాదు జాతులతో పాటు, కూరగాయలు, ఆకు కూరలు, మినీ ప్లాంట్, ఫల వృక్షాలు విజయవంతంగా సాగు చేసి ఔరా అని పించుకుంటున్నారు.. పీఎంపాలేనికి చెందిన రాధారాణి అగర్వాల్. - పీఎంపాలెం/విశాఖపట్నం రసాయనం...కాదు సేంద్రియం స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలోని రాధారాణి ఇంటి మేడతో పాటు పెరట్లో రసాయన ఎరువుల జోలికి వెళ్లకుండా కూరగాయలు సాగుచేసి తమ కుటుంబ అవసరాలకు సరిపడా దిగుబడులు సాధిస్తున్నారు. చుట్టు పక్కల వారికి, బంధువులకు మిగులు కూరగాయలు పంచి వారి ఆదరాభిమానాలు చూరగొంటున్నారు. కూరలు...మనసు తీరా... టమాటా,బీరకాయ,నేతి బీరకాయ, దొండకాయ, దోసకాయ, పొట్లకాయ, ఆలీవ్ బీన్స్, క్యాబేజీ, నీలం క్యాబేజీ, చిలగడ, కంద మొదలైన దుంప జాతులు సాగు చేస్తున్నారు. మంచిదిగుబడులు సాధిస్తున్నారు. కనుల ‘పండు’వ.. జామ, బొప్పాయి,దానిమ్మ, స్టార్ ఫ్రూట్, డ్రాగాన్ ఫ్రూట్, అంజీరా, అరటి,స్వీట్ లెమన్,సీతాఫలం, సపోటా వంటి పండ్లజాతి మొక్కలు ఆహ్లాదంగా కనిపిస్తాయి. ఆకు కూరలు మెంతికూర, తోట కూర,పాలకూర, బచ్చలి కూర, గోంగూర, పుదీనా, కొత్తి మీర , కరివేపాకు సాగు చేస్తున్నారు. పూల గుబాలింపు అలాగే సువాసన వెదజల్లే మల్లె ,సన్నజాజి, చామంతి, విరజాజి, మాలతీ, గులాబీ తదితర పూల మొక్కలు కూడా పెంచుతున్నారు. స్థలం తక్కువగా ఉండడంతో చిన్న చిన్న కుండీల్లోనే ఇన్ని రకాలు సాగు చేసి ఔరా అనిపించుకుంటున్నారు. వీటి పెంపకం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని.. ఆశించిన దాని కంటే ఎక్కువ దిగుబడులు సాధిస్తున్నామని చెబుతున్నారు. ఎలాంటి రసాయనాలు వాడమన్నారు. ఖర్చు తక్కువని ఊహించని ఫలితం ఉంటుందని చెప్పారు. ఆదాయం..ఆరోగ్యం ప్రస్తుత పరిస్థితుల్లో మధ్య తరగతి వారు రోజు వారీ కూరగాయల ఖర్చుల నుంచి బయటపడాలంటే ఉన్న పెరడు.. డాబాలపై కూరగాయలు సాగు చేయాలి. దీని వల్ల తాజా కూరగాయాలు లభించడంతో పాటు డబ్బులు మిగులుతాయి. తాజా కూరగాయాలతో చేసే ఆహారం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. చిన్నపాటి శ్రమ కృషి ఉంటే పెరటి కూరగాయల పెంపకం అంత కష్టం ఏమీ కాదు. అవసరాలకు మించి పండిన కూరగాయలు, ఆకుకూరలు స్నేహితులకు. బంధువులకు ఇస్తాం. ఇందులో మంచి సంతృప్తి ఉంది. – రాధారాణి అగర్వాల్, పీఎంపాలెం. -
కొట్టుకుని కేసులు పెట్టుకున్న సీఐలు
పీఎం పాలెం (భీమిలి): ఏదైనా గొడవ జరిగితే సామాన్యులు వెళ్లి పోలీసులను ఆశ్రయిస్తారు. అటువంటిది.. ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్లు గొడవ పడటమేగాక కొట్టుకున్నారు. ఇద్దరూ గాయపడ్డారు. పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. విశాఖపట్నంలో జరిగిన ఈ సంఘటన చర్చనీయాంశమైంది. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ రవికుమార్ తెలిపిన వివరాల మేరకు.. జీవీఎంసీ ఆరో వార్డులోని పీఎంపాలెం ఆఖరు బస్టాప్ సమీపంలోగల షిప్‌యార్డు కాలనీలోని శ్రీనిలయం అపార్టుమెంట్లో ఏసీబీలో సీఐగా పనిచేస్తున్న ప్రేమ్‌కుమార్, వీఆర్‌లో ఉన్న సీఐ రాజులనాయుడు కుటుంబాలతో నివసిస్తున్నారు. వీరిద్దరు సెల్లార్‌లోని కారు పార్కింగ్ విషయంలో కొంతకాలంగా ఘర్షణ పడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం సీఐలతో పాటు వారి కుటుంబసభ్యుల మధ్య మరోమారు వివాదం తలెత్తింది. కొట్లాటకు దారితీసింది. సీఐలు పరస్పరం దాడి చేసుకున్నారు. ఇద్దరూ స్వల్పంగా గాయపడ్డారు. సీఐ ప్రేమ్‌కుమార్ 100కు డయల్ చేసి సమాచారం అందించడంతో పీఎం పాలెం పోలీసులు అక్కడకు వెళ్లి ఘర్షణపై వివరాలు సేకరించారు. మంగళవారం సీఐలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. (క్లిక్: ఔను.. ఆయనకు ఉద్యోగం వచ్చింది) -
కారూ లేదు.. షెడ్డూ లేదు.. ఓ కథ మాత్రం ఉంది..
పీఎంపాలెం(భీమిలి): వాల్తేరు.. వైజాగ్.. విశాఖపట్నం.. ఇలా ముచ్చటైన పేర్లతో అలరారుతున్న విశాఖ మహా నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తీర ప్రాంతంలో విస్తరించిన సుందర నగరం.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. విశాఖ పేరు చెప్పగానే ఠక్కున గుర్తుకు ప్రాంతం జగదాంబ ఎలాగో.. పీఎంపాలెం మధురవాడ ప్రాంత వాసులకు కారుషెడ్ అలాగ.! ఈ ప్రాంతవాసుల మాటల్లో తరచూ వినిపించే పేరు కార్‌షెడ్. నేను కార్‌షెడ్ దగ్గర ఉన్నాను.. కార్‌షెడ్‌కు దగ్గరకు వస్తావా? కార్‌షెడ్ వద్ద ఉండు.. ఇలా సాగుతుంటుంది. కొత్తగా ఈ ప్రాంతానికి వచ్చే వారైతే కార్‌షెడ్.. ఎక్కడ? అంటూ ప్రశ్నిస్తారు. ఇక్కడ కారూ లేదు.. షెడ్డూ లేదు. దీనికి ఓ కథ మాత్రం ఉంది. చెన్నై– కోల్‌కతాకు వెళ్లే 16వ నంబర్ జాతీయ రహదారిలో విశాఖ శివారులో ఈ కూడలి ఉంది. ఈ కూడలి పేరే కార్‌షెడ్. చదవండి: ఏపీలో ‘రేషన్ డోర్ డెలివరీ’ పై కర్ణాటక అధ్యయనం ఆ పేరు ఎలా వచ్చిందంటే.? పోతిన వారి కుటుంబానికి చెందిన నర్సింనాయుడు 1960 ప్రాంతంలో తన హోదాకు తగ్గట్టుగా కారు కొనుక్కున్నారు. అప్పట్లో విశాఖ నుంచి ఆనందపురం, తగరపువలస మీదుగా విజయనగరం, శ్రీకాకుకుళం తదితర ప్రాంతాలకు వెళ్లడానికి చిన్న తారురోడ్డు ఉండేది. అదే ప్రధాన రహదారి. నర్సింనాయుడు కారయితే కొన్నారు గానీ.. కారుపై నేరుగా ఇంటికి వెళ్లడానికి అనుకూలమైన కనీస రహదారి లేదు. ప్రధాన రహదారి వద్ద కారు దిగి ఇంటికి నడిచి వెళ్లేవారు. ఈ క్రమంలో ఆయన తన కారును పార్కింగ్ చేయడానికి రహదారికి సమీపంలో షెడ్ నిర్మించారు. అప్పట్లో రోడ్డు మీద అడపాదడపా ప్రయాణించే ప్రైవేట్ బస్సులు తప్పితే.. మరో మోటారు వాహనం కనిపించేది కాదట. ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో సొంత కారున్న వ్యక్తి నర్సింనాయుడు ఒక్కరే అని నిన్నటితరం పెద్దలు చెబుతారు. కారు కోసం నిర్మించిన షెడ్‌కు సమీపంలో చిన్న చిన్న దుకాణాలు, టీ కొట్లు వెలిశాయి. దీంతో అదో సెంటర్ అయిపోయింది. అలా కార్‌షెడ్ సెంటర్‌గా మారింది. ఈ ప్రాంతం మహా విశాఖలో విలీనం చేయడం, తారురోడ్డును జాతీయ రహదారిగా అభివృద్ధి చేయడంతో ఈ ప్రాంతం తక్కువ సమయంలోనే విశేషంగా అభివృద్ధి చెందింది. వ్యవసాయ భూములన్నీ ఇళ్ల స్థలాలుగా మారిపోయాయి. అపార్టుమెంట్లు వెలిశాయి. 50 ఏళ్ల కిందట ఈ ప్రాంతం మొత్తానికి ఒకే కారు ఉంటే.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎదురెదురు వాహనాలు తప్పుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. అప్పటి కారు ఇప్పుడు లేదు, ఆ కారు పార్కింగ్ కోసం నిర్మించిన షెడ్డూ లేదు. ప్రజల నాలుక మీద నడియాడిన కార్‌షెడ్ పేరు మాత్రం చిరస్థాయిగా ఉండిపోయింది. జాతీయ రహదారి నుంచి పీఎంపాలెం–పాత పీఎంపాలెం వుడా రోడ్డుకు వెళ్లేందుకు, కొమ్మాది, చంద్రంపాలెం సర్వీసు రోడ్లకు వెళ్లడానికి వీలుగా నిర్మించిన కూడలిలో ట్రాఫిక్ పోలీసులు సిగ్నల్ పాయింట్ ఏర్పాటు చేశారు. బయట వ్యక్తులు కారుషెడ్ సెంటర్ అంటే.. స్థానికులు మాత్రం కార్òÙడ్ అని పిలుస్తుంటారు. ఇదండీ కార్‌షెడ్ కథాకమామీషు! -
సీక్రెట్ గా పెళ్లి చేసుకుని కాదన్నాడని...
యువతి ఆత్మహత్య పీఎంపాలెం(విశాఖపట్నం): ప్రేమించి వివాహం చేసుకున్న వ్యక్తి నమ్మక ద్రోహం చేయడంతో ఓ యువతి ఉరి వేసుకుని తనువు చాలించింది. ఈ సంఘటన మారికవవలస రాజీవ్ గృహకల్పలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి మృతురాలి బంధువులు, పీఎంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా రాజాం వస్త్రపురి కాలనీకి చెందిన జామి ఆదినారారయణకు ముగ్గురు కుమార్తెలు. చిన్నకుమార్తె పద్మ (25), వారి ఇంటి సమీపంలోనే నివశిస్తున్న కె.రామ మోహన్‌రావు సుమారు మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో గత సంవత్సరం జూలై నెలలో ఇరు కుటుంబాలకు తెలియజేయకుండా రహస్యంగా వివాహం చేసుకున్నారు. రామమోహన్‌రావు ఆర్మీ ఉద్యోగి కావడంతో వివాహం చేసుకున్న తర్వాత ఉద్యోగానికి వెళ్లిపోయాడు. అనంతరం మారికవలస రాజీవ్ గృహకల్ప ప్లాట్ నంబరు 61లో నివసిస్తున్న రెండో అక్క రమ వద్దకు పద్మ వచ్చి ఉంటోంది. పైడిభీమవరంలోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రమ తన చెల్లి పద్మను స్థానికంగా ఉన్న కుట్టు మిషన్ శిక్షణ కేంద్రంలో చేర్పించింది. పెళ్లి గురించి పెద్దలకు చెప్పకపోయినా ఫోనులో మాత్రం రోజూ రామమోహన్‌రావుతో పద్మ మాట్లాడుతుండేది. తాము ఇద్దరం భార్యా భర్తలమే అన్న నమ్మకంతో పద్మ ఆనందంగా ఉండేది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి స్వస్థలం వచ్చిన రామమోహన్‌రావు కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ఇంటికి తీసుకెళ్లలేనని స్పష్టం చేశాడు. దీంతో తన పెళ్లి విషయాన్ని తల్లిదండ్రులు, పెద్దలకు చెప్పుకుని పద్మ విలపించింది. పెద్దలు రంగంలోకి దిగి ఇరు కుటుంబాల వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినప్పటికీ రామమోహన్‌రావు అంగీకరించలేదు. మరో పెళ్లి చేసుకోడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ క్రమంలో తాను మోసపోయానని గ్రహించిన పద్మ ఆదివారం మధ్యాహ్నం అక్క ఇంట్లో లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎప్పుడూ చలాకీగా కుటుంబ సభ్యులతో కలివిడిగా ఉండే పద్మ ఆత్మహత్య చేసుకుందని తెలుసుకున్న బంధువులు రాజాం నుంచి తరలివచ్చారు. విగత జీవిగా ఉన్న పద్మను చూసి కుటుంబ సభ్యులు రోదించిన తీరు అక్కడ ఉన్న వారిని కలిచివేసింది. రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో విషాదం నెలకొంది. ప్రేమించి, పెళ్లి చేసకుని, తర్వాత ముఖం చాటేసిన ఆర్మీ ఉద్యోగి రామ మోహన్రావుని కఠినంగా శిక్షించాలని మృతురాలి అక్క రమ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సీఐ కె.లక్ష్మణరావు పర్యవేక్షణలో ఎస్ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ పై కట్నం కేసు
విశాఖపట్నం: అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై విశాఖపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. అదనంగా 25 లక్షల రూపాయల కట్నం తేవాలని తన భర్త అనిల్‌కుమార్ వేధిస్తున్నారని అతడి భార్య దివ్యలక్ష్మి నగరంలోని పీఎంపాలెం పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కట్నం కోసం కాల్చుకు తింటున్నాడని ఫిర్యాదులో వాపోయింది. అనిల్‌కుమార్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. దివ్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనిల్‌కుమార్ కు విచారించేందుకు సిద్దమవుతున్నారు.