వెంకాయమ్మ (ఫైల్)
వినుకొండ టౌన్/ ఈపూరు: వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. బంధువుల కథనం మేరకు... ఈపూరు మండలం ఉప్పరపాలెంకు చెందిన నిండు గర్భిణి వెంకాయమ్మ (21)కు జ్వరం రావడంతో ఈ నెల 22వ తేదీన పట్టణంలోని నిమ్స్ 24 ప్రైవేటు వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేర్పించారు. డెలివరీ కూడా తమ ఆస్పత్రిలోనే చేస్తామని చెప్పడంతో వెంకాయమ్మ భర్త, తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రిలోనే ఉంచారు. ఈ నెల 26వ తేదీన ఆపరేషన్ నిర్వహించి కాన్పు చేశారు. కానీ ఆపరేషన్ సక్రమంగా చేయకపోవడంతో వెంకాయమ్మకు తీవ్ర రక్తస్రావమైంది. కంగారుపడిన వైద్యులు బాధితురాలికి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించాలని సూచించారు. అంబులెన్స్‌లో గుంటూరు తరలిస్తుండగా మార్గమద్యంలోనే వెంకాయమ్మ పరిస్థితి ఆందోళనకరస్థితికి చేరుకోవటంతో నరసరావుపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. వైద్యులు చికిత్స నిర్వహిస్తుండగా వెంకాయమ్మ మృతి చెందింది.
బంధువుల ఆగ్రహం..
బంధువులు వినుకొండలోని ఆస్పత్రి వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై వినుకొండ నిమ్స్ 24 వైద్యశాల వైద్యురాలు కాసుల పార్వతిని వివరణ కోరగా వెంకాయమ్మకు శస్త్రచికిత్స నిర్వహించిన తర్వాత ఆయాసం అధికమైందన్నారు. గుంటూరు తీసుకెళ్లాలని చెప్పామని, ఆ తర్వాత ఏం జరిగిందో తమకు తెలియదన్నారు. గుంటూరుకు తరలించారు. అటుపైన ఎం జరిగిందో తమకు తెలియదని తెలిపారు. పుట్టిన బిడ్డకు తల్లిలేని లోటు పూడ్చలేనిదని స్థానికులు కళ్లనీరుకుక్కుకుంటున్నారు. సంఘటన తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో మృతురాలి ఇంటికి చేరుకుని పాల కోసం గుక్కపెట్టి ఏడుస్తున్న చిన్నారిని గుండెలకు హత్తుకుని విలపిస్తున్న తీరు చూపరులను తీవ్ర మానసిక వేదనకు గురిచేసింది. ఒక వైపు బాలింత మృతితో బంధువుల రోదనలు, మరోవైపు ఆకలితో చిన్నారి ఆక్రందనలు చూపరులను కంటతడి పెట్టించింది.