
ఆటోబోల్తా..మహిళ మృతి
పార్వతీపురం/కురుపాం : మితిమీరిన ప్రయాణికులతో వెళ్తున్న ఆటో బోల్తాపడిన సంఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్రగాయాలైన సంఘటన కురుపాం మండలం పెదగొత్తిలి పంచాయతీ పరిధిలోని వెంపటాపురంలో మంగళవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి బాధితుల కుటుంబీకులు, ఏరియా ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసులు అందించిన వివరాలిలాఉన్నాయి. కురుపాం మండలం వెంపటాపురానికి చెందిన 15 మంది గిరిజనులు ఆటోలో మంగళవారం ఉదయం గుమ్మలక్ష్మీపురంలోని బ్యాంకుకు పెదగొత్తిలికి చెందిన తేజ ఆటోలో వెళ్తున్నారు.
ఈ సందర్భంలో గ్రామ సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభానికి డ్రైవర్ తేజ నిర్లక్ష్యంతో అధిక లోడ్‌తోఉన్న ఆటోను స్పీడ్‌గా వెళ్లి ఢీకొట్టాడు. ఈ సంఘటనలో డ్రైవర్ పక్కనే కూర్చొన్న మండంగి చామంతి (35) అక్కడికక్కడే మృతిచెందగా ఆ గ్రామానికి చెందిన హిమరిక జయమ్మ, హిమరిక హిరణి, మండంగి దుర్గారావు, హిమరిక చిన్నారావులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే క్షతగాత్రులను పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మృతురాలు మండంగి చామంతికి నలుగురు పిల్లలున్నారు. భర్త రామారావు కూలిపనులు చేస్తున్నాడు. మహిళా సంఘం నాయకురాలిగా చా మంతి భర్తకు చేదోడు వాడోడుగా ఇంటికి ఆదారంగా ఉండేది. ఇప్పుడు అమె చనిపోవడంతో పిల్లలు అనాధలయ్యారని గ్రామస్థులు వాపోతున్నారు.
మృతదేహాన్ని అడ్డుకున్న గ్రామస్థులు..
ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న నీలకంఠాపురం పోలీసులు కేసు నమోదు చేసి శవ పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం చేసేందుకు పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించేందుకు చర్యలు చేపట్టగా గ్రామస్థులు పోస్టుమార్టం వద్దని తమకు అప్పగించాలని అడ్డుకున్నారు. కానీ ఎస్సై ప్రయోగమూర్తి బాధితులకు సూచించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.