సృష్టికి మూలం మహిళ
సృష్టికి మూలం మహిళ
Published Thu, Nov 17 2016 9:59 PM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM
– సేవ్ గర్ల్ చైల్డ్ పేరుతో ఎస్పీ గానం
– రెండు నిమిషాల 50 సెకన్ల నిడివితో పాట
– ఎస్పీ సతీమణి చేతుల మీదుగా సీడీ, వీడియోలు ఆవిష్కరణ
కర్నూలు: ఆడపిల్ల పట్ల వివక్షతను విడనాడాలని ఎస్పీ ఆకే రవికృష్ణ పిలుపునిచ్చారు. బేటీ బచావో.. బేటీ పడావో (ఆడపిల్లలను రక్షించండి.. ఆడపిల్లలను చదివించండి) అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్ఫూర్తితో 'సేవ్ గర్ల్ చైల్డ్' అనే పాటను స్వీయ రచనతో ఎస్పీ పాడారు. గురువారం కర్నూలు నగరం పాతబస్తీలోని జమ్మిచెట్టు దగ్గర గల వైకుంఠ క్షేత్రం(శ్మశాన వాటిక)కు వెళ్లి గతంలో చెత్తకుప్పల్లో, ముళ్లకంపల్లో వదిలిపెట్టి పోయిన ఆడపిల్లల సమాధుల దగ్గర పూజలతో శ్రద్ధాంజలి ఘటించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి కలగాలని, మున్ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా 'సేవ్ గర్ల్ చైల్డ్' అనే పాట ఆడియో, వీడియోల రూపంలో సీడీలను ఎస్పీ సతీమణి ఆకే పార్వతి దేవి చేతుల మీదుగా విడుదల చేశారు. 'చెత్తకుప్పలో నువ్వే... ముళ్లకంపలో నువ్వే... మురికి కాల్వలో నువ్వే... ఆడపిల్లగా కడుపున పడటమే నువ్వు చేసిన నేరమా... సేవ్ గర్ల్ చైల్డ్' అనే ఈ పాటను యూ ట్యూబ్, ఫేస్‌బుక్‌లలో పొందుపరిచారు. ఎక్కడ కూడా ఆడ పిల్లలను రోడ్డుపై వేయకూడదని, ఆడపిల్లను పెంచలేమని అనుకుంటే దగ్గర్లోని పోలీస్‌స్టేషన్, ఐసీడీఎస్, చైల్డ్ లైన్ 1098కి సమాచారం అందించాలన్నారు. ఆడపిల్లలకు మెరుగైన జీవితం ఇవ్వడానికి పోలీసు శాఖ కృషి చేస్తుందన్నారు. ఎస్పీ కుమార్తె ఆకే దీక్షిత, కర్నూలు స్టూడియోస్ డైరెక్టర్, ఎడిటర్ డి.ఎన్.శశిధర్‌రెడ్డి, రికార్డింగ్ స్టూడియో ఫయూమ్, సెవెన్ స్టార్ స్టూడియో, సంగీత దర్శకులు ఫయూమ్, మోసిస్, సంగీత పర్యవేక్షణ సండ శ్రీనివాస్, కెమెరామెన్ వి.ఎస్.రాఘవేంద్ర, కర్నూలు స్టూడియో టీమ్ జుబేర్ అన్సారీ, కలీమ్ షేక్, శరణ్ తదితరులు సేవ్ గర్ల్ చైల్డ్ పాట రూపకల్పనలో శ్రమించారని, వారందరికీ ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, ఎస్‌బీ డీఎస్పీ బాబూప్రసాద్, సీఐలు డేగల ప్రభాకర్, కృష్ణయ్య, తానా సభ్యుడు పొట్లూరు రవి, ఎస్‌ఐ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
Advertisement