ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ దుర్మరణం
బుచ్చిరెడ్డిపాళెం : ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ దుర్మరణం చెందిన సంఘటన స్థానిక కనిగిరి రిజర్వాయర్ సమీపంలో శనివారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... పప్పులవీధికి చెందిన పుట్టుబోయిన పద్మ (39), ఆమె కుమారుడు కార్తీక్ (19)తో కలిసి బైక్‌పై ఈ నెల 25వ తేదీన ఏఎస్‌పేట మండలం గంగవారిపల్లిలోని బంధువుల వివాహానికి వెళ్లారు. అక్కడి నుంచి శుక్రవారం ఆత్మకూరు మండలం నల్లరాజుపాళెంలోని బంధువుల ఇంట్లో ఉండి శనివారం ఉదయం నెల్లూరుకు బయల్దేరారు. కనిగిరి రిజర్వాయర్ సమీపంలోని ఫిష్ సెంటర్ వద్ద ఉన్న కల్వర్టు వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో పద్మ, కార్తీక్‌కు గాయాలయ్యాయి. ఇరువురిని 108 సిబ్బంది బుచ్చిరెడ్డిపాళెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి పద్మ మృతి చెందిదని నిర్ధారించారు. కార్తీక్‌కు స్వల్పగాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నారు. కార్తీక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.