మద్యం దుకాణం వద్దంటూ ఆందోళన | woman protest against wine shops | Sakshi

మద్యం దుకాణం వద్దంటూ ఆందోళన

Jul 6 2017 9:45 PM | Updated on Mar 28 2019 6:27 PM

మద్యం దుకాణం వద్దంటూ ఆందోళన - Sakshi

మద్యం దుకాణం వద్దంటూ ఆందోళన

జనావాసాల నడుమ మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దని డిమాండ్‌ చేస్తూ గురువారం నల్లమాడ, కదిరిలో విద్యార్థులు, మహిళలు ధర్నాకు దిగారు.

నల్లమాడ / కదిరి : జనావాసాల నడుమ మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దని డిమాండ్‌ చేస్తూ గురువారం నల్లమాడ, కదిరిలో విద్యార్థులు, మహిళలు ధర్నాకు దిగారు. నల్లమాడలో  గంగా థియేటర్‌ కూడలిలో విద్యార్థులు, మహిళలు రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దాదాపు గంటపాటు నిరసన తెలిపి అనంతరం ఎక్సైజ్‌ సీఐ భీమలింగప్పకు వినతిపత్రం ఇచ్చారు. ఎట్టిపరిస్థితుల్లో జనావాసాల నడుమ​దుకాణం ఏర్పాటు చేయకూడదని డిమాండ్‌ చేశారు. దీంతో సీఐ నల్లమాడకు వచ్చి దుకాణం ఏర్పాటు చేయనున్న అద్దె భవనాన్ని పరిశీలించారు. సమీపంలోని చర్చి, శివాలయం నుంచి అద్దె భవనం ఎన్ని మీటర్ల దూరంలో ఉందో కొలతలు వేస్తుండగా స్థానికులు మరోసారి అడ్డుకున్నారు.

సీపీఐ మండల కార్యదర్శి చంద్ర ఆధ్వర్యంలో పాత బాలాజీ ప్రైవేట్‌ పాఠశాల విద్యార్థులు వీరికి మద్దతు పలికారు. దీంతో తిరిగి ఆందోళన చేపట్టగా ట్రాఫిక్‌ స్తంభించింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ ఏఎస్‌ఏ బాషా, ఎక్సైజ్‌ సీఐ భీమలింగప్ప వారికి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. అలాగే కదిరిలో ఇళ్లమధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయడంపై మహిళలు కన్నెర్ర జేశారు. పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోయే సరికి ఇక లాభం లేదని వారే రంగంలోకి దిగారు. మద్యం దుకాణంలోకి దూరి మద్యం సీసాలను బయటకు తెచ్చి అక్కడే పగులగొట్టారు.

పక్కనే ఉన్న మద్యం సిట్టింగ్‌ రూంలోని ఫర్నీచర్‌ మొత్తాన్ని బయటకు విసిరేశారు. అనంతరం నేరుగా ఆర్‌డీఓ కార్యాలయం వద్దకు చేరుకుని గంటపాటు నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి మహిళలపై మండిపడ్డారు. మద్యం దుకాణం «ధ్వంసం చేసిన మహిళలందరిపై కేసులు నమోదు చేస్తామని బెదిరించారు. అనంతరం అందరి పేర్లను నమోదు చేసుకుని వారితో సంతకాలు తీసుకుని సొంతపూచీ కత్తుపై వదిలేశారు. స్థానిక సీపీఎం నాయకులు నరసింహులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కుమార్‌ నాయుడు మరికొందరు మహిళలకు మద్దతుగా నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Video

View all
Advertisement