సాక్షి, హైదరాబాద్: తనకు వివాహేతర సంబంధం అంటగడుతూ భర్త నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడని ఓ వివాహిత పోలీసులను ఆశ్రయించింది. భర్తతోపాటు అత్తామామలు, ఆదపడుచులందరు కలిసి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని పోలీసుల ఎదుట వాపోయింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి ముందు పోరాటానికి కూర్చుంది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియపూర్‌లో నివాసముంటున్న రవళిని(21) కాప్రా శ్రీరాం నగర్‌కు చెందిన వెంకటేష్(38) అనే వ్యక్తికి ఇచ్చి 2017 జూన్ 14న పెద్దలు వివాహం జరిపించారు. వివాహ సమయంలో కట్నం కింద 8లక్షల నగదు, 20 తులాల బంగారు ఆభరణాలు పెట్టారు.
చదవండి: హైదరాబాద్ మొదటి పేరు భాగ్యనగర్ కాదు.. అసలు పేరు ఏంటంటే!
అయితే వెంకటేష్‌కు అంతకుముందే వివాహం జరిగి విడాకులు కూడా అయి రవళిని వివాహం చేసుకోవడం గమనార్హం. వీరికి నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. వివాహం జరిగిన ఏడాది వరకు కాపురం బాగానే కొనసాగింది. తరువాత భర్త, అత్తామామలు, ఆడపడుచులు అందరూ కలిసి మానసికంగా, శారీరకంగా, సూటిపోటి మాటలతో దాడులకు దిగుతూ వేధింపులకు గురి చేస్తున్నారని రవళి ఆరోపించింది.
చదవండి: అప్పుల బాధలు: గతంలో భర్త, చిన్నకుమారుడు, అల్లుడు.. ఇప్పుడేమో
అదనపు కట్నం తీసుకురమ్మని, ఎవరితోనో వివాహేతర సంబంధముందని నిరాధార ఆరోపణలు చేస్తూ నిత్యం వేధిస్తున్నారని రవళి ఆవేదన వ్యక్తం చేసింది. భర్త వెంకటేష్ చెడు తిరుగుళ్లు తిరుగుతూ ఇతర మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను గ్యాస్ లీక్ చేసి చంపాలని కూడా ప్రయత్నించినట్లు ఆరోపించింది. ప్రభుత్వం, పోలీసులు, మీడియా అందరూ కలిపి తనకు తగిన న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, మహిళా సంఘాలతో కలిసి భర్త ఇంటి ముందు నిరసన వ్యక్తం చేసింది.తనకు న్యాయం జరిగే వరకు ధర్నా ఆపేది లేదని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment