తల్లిని కోల్పోయిన మూడు నెలల చిన్నారి
కూతురితోసహా ఆత్మహత్యాయత్నం
Published Tue, Jul 11 2017 9:56 PM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM
- చికిత్స పొందుతూ తల్లి మృతి
- కోలుకుంటున్న చిన్నారి
కొలిమిగుండ్ల: కుటుంబ కలహాలు తాళలేక ఓ మహిళ తన మూడేళ్ల చిన్నారితో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మూడు నెలల క్రితమే జన్మించిన పసిబాలుడిని సైతం కాదని అఘాయిత్యానికి పాల్పడింది. చివరకు చికిత్స పొందుతూ తల్లి మరణించగా కూతురు కోలుకుంటోంది. ఈ ఘటన మండల పరిధిలోని చింతలాయపల్లెలో మంగళవారం చోటు చేసుకుంది. బంధువులు, పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వడ్డె హరికృష్ణకు అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఇల్లూరుకు చెందిన అనిత(24)తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కూతురు వైష్ణవి ఉంది. మూడు నెలల క్రితమే రెండవ కాన్పులో మగబిడ్డ పుట్టాడు. పురుడు పోసుకునేందుకు పుట్టినింటికి వెళ్లిన అనిత కొడుకుకు మూడు నెలలు పడటంతో నాలుగు రోజుల క్రితమే అత్తారింటికి వచ్చింది.
మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్న భర్త హరికృష్ణ రెండు రోజుల క్రితం గొడవ పడింది. దీంతో మనస్థాపం చెందిన అనిత తన మూడేళ్ల కూతురు వైష్ణవికి వాస్మోల్ తాపి తాను సేవించింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న తల్లికూతుళ్లను చికిత్స నిమిత్తం తాడిపత్రికి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ అనిత మృతిచెందింది. వైష్ణవిని మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. ఎస్‌ఐ బీటీ వెంకటసుబ్బయ్య తాడిపత్రి ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Advertisement
Advertisement