
ఓటు వేసిన పాపానికి కొంపలు కూలుస్తారా?
– కూరగాయల కొట్టు తొలగించారని మహిళ ఆత్మహత్యాయత్నం
ధర్మవరం : టీడీపీకి ఓట్లు వేసిన పాపానికి మా కొంపలే కూలుస్తారా.. అంటూ ఓ మహిళ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పట్టణంలోని పాండురంగ సర్కిల్‌లో ఆదివారం సాయంత్రం మున్సిపల్ అధికారులు, అధికార పార్టీ నేతలు జేసీబీతో కాలువలను శుభ్రం చేస్తున్నారు. రాములమ్మ అనే కూరగాయల కొట్టు నిర్వాహకురాలు కాలువకు అడ్డు లేకుండా దుకాణాన్ని వెనక్కి జరుపుకుంది. అయితే మున్సిపల్ అధికారులు, నాయకులు దుకాణం స్థలం మున్సిపాలిటీదేనని తొలగించే ప్రయత్నం చేశారు.
దీంతో ఆగ్రహించిన రాములమ్మ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ‘మేము ఆలయ స్థలంలో ఉంటున్నాం.. మున్సిపల్ స్థలం కాదది.. ఈస్థలం మాకే చెందుతుంది.. అయినా మున్సిపల్ అధికారులు, అధికార పార్టీ నేతలు దౌర్జన్యంగా వచ్చి మా దుకాణాన్ని తొలగించాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో మున్సిపల్ అధికారులు, అధికారపార్టీ నేతలు వెనక్కి తగ్గి అక్కడి నుంచి జేసీబీని వెనక్కి పంపించారు.