పంట కాల్వలో పడి యువతి మృతి | women dead | Sakshi
Sakshi News home page

పంట కాల్వలో పడి యువతి మృతి

Published Mon, Aug 15 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM

పంట కాల్వలో పడి యువతి మృతి

పంట కాల్వలో పడి యువతి మృతి

  • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు 
  • నల్లూరు (కపిలేశ్వరపురం) :
    ఓ పక్క స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న వేళ కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామంలో విషాదం అలముకుంది. గ్రామానికి చెందిన యువతి కాకి సుబ్బలక్ష్మి (19) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తోడబుట్టిన సోదరుడే పంట కాల్వలోకి తోసేయడంతో ఆమె చనిపోయిందంటూ మరో సోదరుడు ఫిర్యాదు చేయడంతో సోమవారం అంగర పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఎస్సై కె.దుర్గాప్రసాద్, కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం... సుబ్బలక్ష్మి మండపేటలోని ఓ ఇంట్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. హైదరాబాద్‌లో ఉంటున్న ఆమె సోదరుడు కాకి రాంబాబు వేలిముద్రల ఫీడింగ్‌ నిమిత్తం ఇటీవల నల్లూరు వచ్చాడు. మరో సొదరుడు కాకి సత్యనారాయణ ఆలమూరు మండలం చింతలూరులో నివాసం ఉంటున్నాడు. రాంబాబు అక్కడకు వెళ్లి ఆర్థిక వ్యవహారాలను చర్చిస్తూ తగవు పడ్డాడు. సోదరి సుబ్బలక్ష్మికి పెళ్లి చేయాల్సి ఉన్నందున బాధ్యతగా ఉండాలని రాంబాబును అన్న సత్యనారాయణ మందలించాడు. ఇదిలా ఉండగా ఈ నెల 14వ తేదీ సాయంత్రం సుబ్బలక్ష్మి మండపేట నుంచి చింతలూరులోని సోదరుడు ఇంటికి వచ్చింది. రాంబాబు తనను తరచూ కొడుతున్నాడని చెప్పగా ధైర్యం చెప్పి నల్లూరులోని తల్లి వద్దకు వెళ్లమని పంపించాడు. విషయం తెలుసుకున్న రాంబాబు చింతలూరులో ఆటో కోసం ఎదురుచూస్తున్న సోదరి సుబ్బలక్ష్మితో గొడవ పడ్డాడు. ఇద్దరూ నల్లూరు వెళ్లేందుకు ఆటో ఎక్కి వెదురుమూడిలో దిగారు. వంతెన వద్దకు వచ్చే సరికి రాత్రి సమయంలో సుబ్బలక్ష్మి పంట కాల్వలో పడింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా కాలేరు గ్రామ శివారులో సోమవారం మృతదేహం లభ్యమైంది. ఎస్సై కె.దుర్గాప్రసాద్‌ శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సోమవారం ఉదయం ఆచూకీ కనిపించడం లేదంటూ కేసు నమోదు చేసిన పోలీసులు సోదరుడు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు రాత్రి అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. చిన్న వయస్సులోనే ఇళ్లల్లో పనిచేసుకుంటూ తమకు చేదోడు వాదోడుగా ఉంటున్న సుబ్బలక్ష్మి మృతిని ఆమె తల్లి తట్టుకోలేకపోతూ రోధిస్తున్న తీరు చూపరులను కంట తడిపెట్టించింది.  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement