- మృతురాలి కుమార్తె సమాచారంతో విషయం వెలుగులోకి
మహిళ అనుమానాస్పద మృతి
Published Sat, Dec 3 2016 10:43 PM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM
పెద్దాపురం :
సాధారణ మరణంగా భావించి ఖననం చేసిన ఓ మహిళ మృత దేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం శనివారం వెలికితీశారు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన సంగటాల మహాలక్ష్మి, నర్సయ్యమ్మలు తమ కుమార్తె సంగటాల వరలక్షి్మని 2006లో అమలాపురానికి చెందిన అమలదాసు రాజ్‌కుమార్‌కు ఇచ్చి వివాహం చేశారు. అడ్డతీగల అటవీ రేంజ్ చవిటిదిబ్బల ఫారెస్ట్ గార్డుగా పనిచేస్తున్న రాజ్‌కుమార్ అక్కడే భార్యతో కలసి జీవిస్తున్నాడు. వీరికి నాలుగేళ్ల పాప ఉంది. ఈ క్రమంలో ఈ ఏడాది నవంబర్ 24న వరలక్ష్మి అనారోగ్యంతో మృతి చెందిందంటూ రాజ్‌కుమార్ భార్య మృత దేహాన్ని అత్తవారింటికి పంపే శాడు. కుమార్తె మృతి చెందిందన్న శోకంలో ఉన్న తల్లిదండ్రులు, బంధు వులు తదుపరి కర్మకాండలు పూర్తి చేశారు. రెండు రోజుల తరువాత అమ్మ ఎలా చనిపోయిందని వరలక్ష్మి కుమార్తెను పెద్దలు అడగ్గా నాన్న కొట్టాడని ఆ చిన్నారి సమాధానం ఇచ్చింది. దీంతో వరలక్ష్మి తల్లిదండ్రులు, బంధువులు అడ్డతీగల పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై యర్రంశెట్టి గణేష్‌కుమార్ అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా శనివారం పెద్దాపురం తహసీల్దార్ గోగుల వరహాలయ్య, ఎస్సై గణేష్‌కుమార్, హెచ్‌సీ సత్యనారాయణ ఆధ్వర్యంలో వరలక్ష్మి మృత దేహాన్ని స్థానిక బంగారమ్మ గుడి వీధికి చెందిన శ్మశాన వాటిక నుంచి వెలికితీయగా, వైద్యులు విజయ్‌మోహన్, ప్రశాంతి శవ పంచనామా చేశారు.
Advertisement