వైద్యుడు పొలిమేర దాటొద్దన్నాడని..
కోరుట్ల/కథలాపూర్ : మూఢనమ్మకం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. పాముకాటుకు మందు వేసిన నాటువైద్యుడు చేసిన హెచ్చరిక మేరకు ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడంతో ఓ మహిళ మృత్యువాత పడిన ఉదంతమిది.
కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండల కేంద్రానికి చెందిన తెడ్డు శిరీష(30) బుధవారం రాత్రి పాముకాటుకు గురైంది. భర్త అంజయ్య వెంటనే దుంపెట గ్రామానికి చెందిన ఓ నాటువైద్యుడి వద్దకు శిరీషను తీసుకెళ్లాడు. ఆమెకు చికిత్స చేసిన నాటువైద్యుడు.. మూడు రోజులపాటు ఊరి పొలిమేర దాటొద్దని.. దాటితే మందు పనిచేయదని చెప్పాడు.
దానినే గుడ్డిగా నమ్మిన శిరీష కుటుంబసభ్యులు నాటువైద్యుని ఇంటి సమీపంలో ఉన్న ఓ కొట్టంలోనే ఉన్నారు. పాము కాటు వేసిన కాలు వాపు వచ్చి.. పరిస్థితి విషమించిందినా.. ఆస్పత్రికి తీసుకెళ్లకుండా అక్కడే ఉంచారు. చివరికి శనివారం శిరీష పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో మెట్‌పల్లిలోని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే శిరీష చనిపోయింది.