karimnager district
-
కాంగ్రెస్ టికెట్లకు కొత్త మెలిక
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ నేతల్లో కలకలం రేపుతున్నాయి. 2019లో అధికారం లక్ష్యం అంటూ ముందుకు సాగుతున్న పార్టీ నాయకత్వం చేపడుతున్న సంస్కరణలు టికెట్ ఆశించే వారికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే.. ఒక్కో స్థానం నుంచి ముగ్గురి నుంచి ఎనిమిది మంది వరకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటికే కరీంనగర్ నుంచి వయా హైదరాబాద్, ఢిల్లీ వరకు ఎవరి దారిలో వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే.. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండటం.. తెలంగాణపై కూడా ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో కీలకమైన కరీంనగర్ జిల్లాలో ఈసారి టిక్కెట్ల కేటాయింపు అంత ఆషామాషీగా ఉండదన్న ప్రచారం తెరమీదకు వచ్చింది. ఇదే సమయంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రామచంద్ర కుంతియాతో రాహుల్‌గాంధీ భేటీ అయిన అనంతరం తెలంగాణలోనూ ‘రాజస్థాన్ ఫార్ములా’ను అమలు చేయాలన్న నిర్ణయాన్ని జిల్లా కమిటీలకు సమాచారం అందించారు. ‘జననేత’లుగా ఉన్నవారికే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు కూడా ప్రకటించిన నేపథ్యంలో ఏ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తారన్న సరికొత్త ఆందోళన కాంగ్రెస్ పార్టీ ఆశావహుల్లో మొదలైంది. కాంగ్రెస్‌లో పెరుగుతున్న ఆశావహులు.. పోటాపోటీగా ప్రయత్నాలు.. జగిత్యాల, మంథని, ధర్మపురి, మానకొండూరు మినహా మిగతా స్థానాల్లో అశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆ నాలుగు స్థానాల నుంచి టి.జీవన్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, లక్ష్మణ్‌కుమార్, ఆరెపల్లి మోహన్‌లే మళ్లీ పోటీ చేయనున్నారని చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో చల్మెడ లక్ష్మీనర్సింహారావు కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోగా, ఆ స్థానం కోసం ఆయనతోపాటు ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం, నేరేళ్ల శారద తదితరులు ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా కొత్త జైపాల్‌రెడ్డి పేరు వినిపిస్తోంది. కోరుట్ల నుంచి కొమిరెడ్డి రాములుతో పాటు డాక్టర్ జేఎన్ వెంకట్, బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన డాక్టర్ రఘు ప్రయత్నం చేస్తున్నారు. రామగుండం నుంచి టికెట్ రేసులో మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ పేరు వినిపిస్తోంది. సిరిసిల్ల నుంచి అధిష్టానంతో సన్నిహితంగా ఉండే కేకే మహేందర్‌రెడ్డి పేరు వినిపిస్తుండగా, ఇక్కడి నుంచి కటకం మృత్యుంజయం, కేసీఆర్ మేనల్లుడు చీటి ఉమేష్‌రావు, దరువు ఎల్లయ్య కూడా ఆశిస్తున్నారు. వేములవాడ నుంచి బొమ్మ వెంకటేశ్వర్‌తోపాటు ఏనుగు రవీందర్‌రెడ్డి టికెట్ ఆశిస్తుండగా, ఇటీవలే పార్టీలో చేరిన ఆది శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. హుజూరా బాద్ నియోజకవర్గం నుంచి పార్టీ సీనియర్ నేతలు పరిపాటి రవీందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, స్వర్గం రవి పేర్లు ఉన్నాయి. అదేవిధంగా చొప్పదండి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సుద్దాల దేవయ్య, గజ్జెల కాంతంతో పాటు మేడిపల్లి సత్యం ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. మేడిపల్లి సత్యం పేరు ప్రముఖం గా వినిపిస్తోంది. పెద్దపల్లి నుంచి గొట్టి్టముక్కుల సురేష్‌రెడ్డి, సీహెచ్ విజయరమణారావు, మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి కోడలు డాక్టర్ గీట్ల సవిత టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హుస్నాబాద్ అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పేరే ప్రధానంగా ఉం డగా, బొమ్మ వెంకటేశ్వర్, ఆయన కుమారుడు బొమ్మ శ్రీరాం కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. జూన్, జూలైలలో దరఖాస్తుల స్వీకరణ.. ఆశావహులకు అధిష్టానం సంకేతాలు.. వచ్చే నెల నుంచి టిక్కెట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆశావహులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సంకేతాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాది గడువున్నప్పటికీ రోజురోజుకూ మారుతున్న సమీకరణలు ఇప్పుడే ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అయితే.. ఈసారి రాజస్థాన్‌లో చేపడుతున్న ప్రక్రియను తెలంగాణలో అనుసరించనుండడం పలువురికి సంకటంగా మారనుందన్న చర్చ మొదలైంది. ఆ ఫార్ములా ప్రకారం ఒక నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించే అభ్యర్థి.. తెల్ల కాగితంపై తన పేరు, బయోడేటాతోపాటు సదరు నియోజకవర్గంలోని ప్రతీ బూత్ నుంచి 10 మంది ఓటర్ల పేర్లు, ఓటరు జాబితాలో వారి సంఖ్య, వారి ల్యాండ్ లేదా మొబైల్ నంబర్లను జతపరచాల్సి ఉంటుంది. ఆ నియోజకవర్గంలో ఎన్ని బూత్‌లు ఉంటే అన్ని బూత్‌ల నుంచి విధిగా ఈ వివరాలు జతపరచాలి. దీని ద్వారా సదరు ఔత్సాహికునికి తన నియోజకవర్గంపై ఎంత పట్టు ఉందో అంచనా వేస్తారు. ఇచ్చిన వివరాలు సరైనవో, కాదో పరిశీలిస్తారు. అనంతరం అభ్యర్థులతో కూడిన జాబితాతో ఒక ప్యానల్‌ను నియమిస్తారు. ఈ ప్యానెల్ అభ్యర్థుల విజయావకాశాలపై సర్వే నిర్వహించి.. వచ్చిన అభిప్రాయాల ఆధారంగా మొదటిదశ వడపోతతో తొలి జాబితాను తయారు చేస్తుంది. అనంతరం జాబితా టీపీసీసీ, ఏఐసీసీ పరిశీలనకు వెళ్తుంది. ఈ ప్రక్రియ ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేయాలన్న నిర్ణయానికి వచ్చిన పార్టీ హైకమాండ్ జూన్, జూలై మాసాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆశావహులకు సూచించింది. అయితే.. ఏళ్ల తరబడిగా పార్టీ జెండా, ఎజెండాతో పనిచేస్తున్న పార్టీ నాయకులకు కొత్త నిబంధనలు కొంత సంకటమేనన్న చర్చ నేతల్లో మొదలైంది. సీనియర్లంతా ఇప్పటికే తాము పోటీ చేయాలనుకున్న స్థానాల కోసం ‘గాడ్‌ఫాదర్’లతో ప్రయత్నాలు చేస్తుండగా, హఠాత్తుగా రాజస్థాన్ ఫార్ములా తెరపైకి తేవడం పార్టీలో పెద్ద చర్చకే దారితీసింది. -
త్వరగా పూర్తిచేయండి
సాక్షి, సిరిసిల్ల : రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు బుధవారం జిల్లాలో ఆకస్మికంగా పర్యటించారు. ఇల్లంతకుంట, కోనరావుపేట మండలాల్లో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజీ–9 టన్నెల్, మల్కంపేట రిజర్వాయర్ నిర్మాణాలను ఆయన పరిశీలించి పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఇల్లంతకుంట మండలం తెస్లాపూర్‌లోని ప్యాకేజీ – 10 కింద చేపడుతున్న సర్జ్‌పూల్ టన్నెల్‌ను కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్‌హెగ్డే, ఇరిగేషన్ అధికారులతో కలసి పరిశీలించారు. ప్యాకేజీ – 9 లోని రగుడు నుంచి మల్కంపేట, కొలనూరు, పాతిరెడ్డిపల్లె వద్ద కొనసాగుతున్న పనులు పరిశీలించారు. రగుడు నుంచి మల్కంపేట రిజర్వాయర్ వరకు నిర్మిస్తున్న 12 కి.మీ సొరంగ మార్గం పనుల్లో 9 కి.మీ మేర పూర్తి కాగా మరో 3 కి.మీ పనులు మిగిలి ఉన్నాయని మంత్రి తెలిపారు. మల్కంపేట రిజర్వాయర్ పనులు పూర్తి నాణ్యతతో త్వరగా పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. కొలనూరు రిజర్వాయర్‌ను మల్కంపేట రిజర్వాయర్‌కు అనుసందానించే విషయంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మంత్రి ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. మల్కంపేటలో 200 డబుల్ బెడ్రూం ఇళ్లు.. మల్కంపేట రిజర్వాయర్ చుట్టూ ఉన్న గ్రామాల పేదలకు, భూములు కోల్పోయిన వారికి 200 డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు కాంట్రాక్టర్లను ఆదేశించారు. త్రి వెంట డీఆర్వో శ్యాంప్రసాద్‌లాల్, ఈఈ బుచ్చిరెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. -
రెపరెపలాడిన ఎర్రజెండాలు
సిరిసిల్లటౌన్ : ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం మే డే వేడుకలు ఘనంగా నిర్వహించా రు. వివిధ కార్మిక, శ్రామిక, రాజకీయ తదితర పార్టీల ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిపారు. కార్మిక క్షేత్రమైన సిరిసిల్లలో వాడవాడనా ఎర్రజెండాల రెపరెపలాడాయి. స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు టీఆర్ఎస్కేవీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కరీంనగర్ పార్లమెంటుసభ్యుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పాల్గొని జెండా ఎగురవేశారు. ఈకార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, ఏఎంసీ చైర్మన్ జిందం చక్రపాణి, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు వెంగల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక భవన్లో జరిగిన వేడుకల్లో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామల మల్లేశం, సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, కార్మిక నాయకులు ఎలిగేటి రాజశేఖర్, బూర శ్రీనివాస్, నల్ల చంద్రమౌళి పాల్గొన్నారు. గాంధీనగర్ లేబర్ అడ్డా వద్ద జరిగిన వేడులు మిన్నంటాయి. ‘సెస్’ ఆఫీస్ ముందు వేడుకలు జరిగాయి. 104 యూనియన్ నాయకులు మహేందర్, వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం ముందు సీఐటీయూ జెండా ఎగురవేశారు. జిల్లా ఆస్పత్రిలో కార్మికులు ఎర్ర జెండాలను ఎగురవేశారు. చేనేత వస్త్రవ్యాపార సంఘ భవనంలో డైయింగ్ కార్మిక సంఘం వేడుకలు నిర్వహించింది. సంఘం జిల్లా అధ్యక్షుడు జెగ్గాని మల్లేశం తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కార్మికులను సన్మానించారు. నాయకులు మూషం రమేశ్, పంతం రవి, మోర అజయ్ పాల్గొన్నారు. ఏఐఎఫ్టీయూ ఆధ్వర్యంలోనూ వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో నాయకులు భూతం వీరన్న, సోమిశెట్టి దశరథం పాల్గొన్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో నాయకులు ఆవునూరి రమాకాంత్‌రావు, డిపో అధ్యక్షుడు ఎల్పీ రాం, ప్రధాన కార్యదర్శి సీహెచ్ బాణయ్య పాల్గొన్నారు. నవోదయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నాయకులు శ్రీనివాస్ పాల్గొన్నారు. సిరిసిల్లరూరల్ : తంగళ్లపల్లి, సిరిసిల్ల అర్బన్ మండలాలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల అర్బన్ మండలం పెద్దూర్, రాజీవ్‌నగర్, చంద్రంపేటలో హమాలీ సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. జెండావిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించగా ముఖ్య అతిథిగా సింగిల్ విండో డైరెక్టర్ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పూర్మాణి లింగారెడ్డి జెండా ఆవిష్కరించారు. టెక్స్‌టైల్‌పార్క్‌లో సీఐటీయూ, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. కార్మికులతో ర్యాలీ నిర్వహించారు. తంగళ్లపల్లి, మండెపల్లి, జిల్లెల్ల, బద్దెనపల్లి, చీర్లవంచ గ్రామాల్లో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బండి దేవదాసు, రాములు, అంజయ్య, మధు, రాకం రమేశ్, పెద్దూర్ సింగిల్ విండో చైర్మన్ ఉలిసె తిరుపతి, రెడ్డి నా యక్, వెంకటరమణారావ్, అలీ పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట : కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కానపురం లక్ష్మణ్ అన్నారు. రాచర్ల గొల్లపల్లి, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, రంగంపేటలో మంగళవారం మేడే వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. జెండాను ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్నారు. సీఐటీయూ అధ్యక్షుడు సాన ప్రతాప్, కోనేటి ఎల్లయ్య, మల్లయ్య, మేగి లచ్చయ్య, మేగి శ్రీనివాస్, నర్సయ్య, కనకరాజు, పి. శంకరయ్య, కర్తిలాల్, దేవరాజు, దేవ్‌సింగ్, మోహన్ పాల్గొన్నారు. ముస్తాబాద్ : కార్మికుల దినోత్సం నిర్వహించారు. తాపీ మేస్త్రీలు, హమాలీలు, భవన నిర్మాణ కార్మికులు ముస్తాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. మొర్రాయిపల్లి, నామాపూర్, పోత్గల్, గూడెం గ్రామాల్లో మేడే ఉత్సవాలను నిర్వహించారు. అరుణ పతాకాన్ని ఎగురవేశారు. మొర్రాయిపల్లిలో జరిగిన వేడుకల్లో ఎస్సై రాజశేఖర్ పాల్గొని మాట్లాడారు. సర్పంచులు నల్ల నర్సయ్య, సందుపట్ల పద్మ, కొమ్ము పద్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమ్ము బాల య్య, వైస్ ఎంపీపీ శ్రీనివాస్‌రావు. కార్మిక సంఘాల నాయకులు నర్సయ్య, ఎల్లం, రంగ య్య, అంజిరెడ్డి, రాజు, చంద్రం పాల్గొన్నారు. గంభీరావుపేట : మండలంలో కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం, హమాలీ కార్మిక సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో జెండావిష్కరణలు నిర్వహించారు. కార్మిక సంఘాల నాయకులు బాలమల్లయ్య, ముద్రకోల ఆంజనేయులు, మాజీ జెడ్పీటీసీ మల్లుగారి నర్సాగౌడ్, సర్పంచ్ పాపగారి భూలక్ష్మి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎగదండి స్వామి, ఎంపీటీసీ హమీదోద్దీన్, అడ్వయ్య పాల్గొన్నారు. సిరిసిల్లలో మున్సిపల్ కార్మికుల ర్యాలీ జెండా ఎగురవేస్తున్న ఈయూ గౌరవ అధ్యక్షుడు రమాకాంత్‌రావు -
పగడ్బందీగా చెక్కుల పంపిణీ
సాక్షి, పెద్దపల్లి : జిల్లాలో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీదేవసేన అధికారులను ఆదేశించారు. రైతుబంధు పథకంలో భాగంగా చెక్కుల పంపిణీ, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీపై గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులు, రైతు సమన్వయ సమితి సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అత్యంత పారదర్శకంగా ‘రైతుబంధు’ నిర్వహించాలన్నారు. జిల్లాలోని 208 గ్రామాల్లో 1,27,733 మంది రైతుల వద్ద ఉన్న 2,56,730 ఎకరాలకు రూ. 100కోట్లకు పైగా విలువ గల 1,28,280 చెక్కులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు మే 10న చెక్కుల పంపిణీ, పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించి 17వ తేదీకల్లా వారంరోజుల్లో పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం ముద్రించిన పాస్ పుస్తకాలు అత్యంత భద్రత ప్రమాణాలతో ఉన్నాయన్నారు. చెక్కుల పంపిణీలో రైతు సమన్వయ సమితి సభ్యుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందించే పెట్టుబడి పథకం ప్రతి రైతుకి అందుతుందని, ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తూ వారిలో విశ్వాసం పెంచాలన్నారు. పంపిణీ సమయంలో వచ్చే సమస్యలను అధిగమించాలన్నారు. పంపిణీ కేంద్రం వద్ద హెల్ప్‌డెస్క్, గ్రీవియెన్స్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. రైతులు తమ సందేహాలను, సమస్యలను గ్రీవియెన్స్ సెల్లో అందిస్తే రెండురోజుల్లో వారి సమస్య పరిష్కారమవుతుందన్నారు. అధికారులు వారికి వెంటనే సమాధానాలు అందించాలని, గ్రీవియెన్స్ సెల్లో విధులు నిర్వర్తించే వారికి ఉన్నతాధికారులు శిక్షణ ఇవ్వాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని, టెంట్లు, కుర్చీలు వేయాలని, తాగునీరు, మజ్జిగ పాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేలు, అధికార ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండేలా సమన్వయం చేసుకోవాలన్నారు. ఆర్డీవోలు వ్యక్తిగతంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని, గ్రామాల్లో చెక్కుల పంపిణీ కోసం అనువైన వేదికలను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి గుర్తించాలన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమ తేదీ, సమయం, వేదిక, తదితర అంశాలతో కూడిన కరపత్రాలు ముద్రించి రైతులకు పంపిణీ చేయాలని, ఏ గ్రామంలో చెక్కులు పంపిణీ చేసేది వారికి ముందస్తుగా తెలియజేయాలన్నారు. సుదీర్ఘ అనుభవమున్న అధికారుల సేవలు వినియోగించుకోవాలన్నారు. 300 మంది రైతులకు చెక్కులు పంపిణీ చేసేందుకు ఒక బృందం ఏర్పాటు చేసుకున్నామని, ఆ బృందాల్లోని సభ్యులకు బాధ్యతలు అప్పగించి ఒక నమూనా తయారు చేయాలన్నారు. దాని ప్రకారం అంతా సవ్యంగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకం నంబరు చెక్కుపై ఉంటుందని, ఆ వివరాలు, రైతుల ఆధార్ వివరాలు సరిచూసుకోవాలన్నారు. అధికారులు చెక్కు, పాస్ పుస్తకం పంపిణీ చేసేటపుడు లబ్ధిదారుని వద్ద నుంచి రెండు ప్రింటెడ్ రశీదులపై సంతకాలు తీసుకోవాలని, రూ. 50వేలలోపు వరకు ఒక్క చెక్కు, ఆపై పెట్టుబడి సాయానికి రెండు చెక్కులు అందిస్తామన్నారు. ప్రభుత్వం అందించే సహాయం వదులుకునే వారి చెక్కులను రైతు సమన్వయ సమితుల అకౌంట్‌కు అందజేయాలన్నారు. రైతుబంధు పథకం అమలుకోసం రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా బ్యాంకులకు రూ. 6వేల కోట్లు విడుదల చేసిందన్నారు. చెక్కుల అకౌంట్ బుక్‌ను బ్యాంకులు నిర్వహించాలన్నారు. చెక్కులపై ఉన్న పేర్లలో పొరపాట్లను పాస్‌పుస్తకం పరిశీలించి నగదు అందించాలని, లోన్, క్యాష్ కటింగ్ వంటివి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని బ్యాంకర్లను హెచ్చరించారు. తహసీల్దార్లు ఆధార్ సీడింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని, సాదా బైనామా దరఖాస్తులు ఈనెల 28లోగా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జేసీ వనజాదేవి, రెతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు కోట రాంరెడ్డి, ఇన్చార్జి డీఆర్వో బైరం పద్మయ్య, ఆర్డీవో అశోక్‌కుమార్, డీఏవో తిరుమల్‌ప్రసాద్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, బ్యాంకు ప్రతినిధులు, ప్రత్యేక అధికారులు, సభ్యులు పాల్గొన్నారు. -
‘భగీరథ’ పనులు పూర్తి చేయాలి
హుజూరాబాద్ : తెలంగాణ మున్సిపల్ డెవలప్మెంట్ ప్లాన్(టీఎండీపీ) నిధులతో హుజూరాబాద్ పట్టణంలో చేపట్టిన మిషన్ భగీరథ పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో గురువారం మున్సిపల్, పబ్లిక్ హెల్త్, ఆర్అండ్బీ, ఐబీ శాఖల అధికా రులతో సమీక్ష నిర్వహించారు. పనుల ప్రగతిపై అధికారులనడిగి తెలుసుకున్నారు. పైప్ లైన్ పనులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ట్ర యల్ రన్ చేయడానికి అవసరమైనవిధంగా పనుల్లో మరింత వేగం పెంచాలని సూచించా రు. మరో 4 నెలల్లో పైప్‌లైన్ పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు సంబంధిత శాఖ అధికారులు వివరించారు. హుజూరాబాద్ పట్టణంలో టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.15కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనుల ప్రతిపాదనలపై మున్సిపల్ కమిషనర్ స్వరూపరాణిని అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా చేపట్టనున్న జంక్షన్ల ఏర్పాటు, పనుల నిర్వహణలో చేర్పులుమార్పులపై పలు సూచనలు చేశారు. రూ.కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. హుజూ రాబాద్–జమ్మికుంట రోడ్డు వెడల్పు పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని అడిగారు. రోడ్డు వెడల్పులో భాగంగా ఇళ్లు కోల్పోతున్న యజమానులు నష్టపరిహారం అడుగుతున్నారని, దీంతో కొంత ఆలస్యమవుతున్నట్లు అధికారులు వివరించారు. పట్టణ సమీపంలోని మోడల్ చెరువు వద్ద చేపట్టిన మినీ ట్యాంక్‌బండ్ పనుల ప్రగతి వివరాలడిగి తెలుసుకున్నారు. ఆర్డీవో బోయపాటి చెన్నయ్య, మున్సిపల్ కమిషనర్ స్వరూపరాణి, పబ్లిక్ హెల్త్ ఈఈ భద్రయ్య, ఆర్అండ్బీ ఈఈ రాఘవాచార్యులు, డీఈ కృష్ణారెడ్డి, ఏఈ రాజునాయక్, మున్సిపల్ ఇంజినీర్ చంద్రమౌళి, తహసీల్దార్ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. -
పారాణి ఆరకముందే ప్రాణాలు తీసుకుంది
- పెళ్లైన 17 రోజులకే ఉరేసుకుని మెడికో ఆత్మహత్య - కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్ కాలేజీలో చదువుతున్న సౌమ్య - తన చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోట్ - గతనెల 27నే డాక్టర్‌తో వివాహం - పెళ్లయ్యాక కాలేజీ హాస్టల్‌కు వచ్చిన రోజే బలవన్మరణం - కూతురి అంత్యక్రియలు నిర్వహించిన కన్నతల్లి సాక్షి, ఖమ్మం క్రైం/కరీంనగర్ రూరల్: ఒక్కగానొక్క కూతురు. మెడిసిన్ చదువుతోంది. వైద్యుడైన కుర్రాడితో పెళ్లి జరిపించారు తల్లిదండ్రులు. వివాహం జరిగి సరిగ్గా 17 రోజులు! ఏమైందోగానీ కాళ్ల పారాణైనా ఆరకముందే తన నిండు జీవితాన్ని బలి తీసుకుంది. ఖమ్మం నగరంలోని మామిళ్లగూడేనికి చెందిన మెడికో సూదమళ్ల సౌమ్య కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్ కాలేజీ హాస్టల్లో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. భోజనానికి పిలిచినా వెళ్లకుండా.. మామిళ్లగూడేనికి చెందిన డాక్టర్ కొమరయ్య, మాలతి దంపతుల ఏకైక కుమార్తె సౌమ్య(25) ఖమ్మంలో ఇంటర్మీడియట్(బైపీసీ) పూర్తి చేసింది. మెడిసిన్ సీటు రావటంతో విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రస్తుతం కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్ కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. సౌమ్యకు గతనెల 27న నల్లగొండ జిల్లా మోతెకు చెందిన డాక్టర్ పవన్‌కుమార్‌తో వివాహమైంది. సౌమ్యను తీసుకుని మంగళవారం కళాశాలకు వచ్చిన పవన్ ఆమెను హాస్టల్లో వదిలిపెట్టి వె ళ్లాడు. మంగళవారం రాత్రి 9 గంటలకు స్నేహితురాలు భోజనానికి పిలిచినా సౌమ్య వెళ్లకుండా భర్తతో సెల్ఫోన్లో మాట్లాడింది. స్నేహితురాలు తిరిగి గదిలోకి వచ్చేసరికే సౌమ్య ఉరేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న కరీంనగర్ డీఎస్పీ రామారావు, రూరల్ సీఐ కృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ సౌమ్య రాసిన సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో సౌమ్య మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కట్నం వేధింపులే కారణమా? సౌమ్య ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆత్మహత్యకు ముందు సౌమ్య రెండు గంటలపాటు భర్తతో మాట్లాడినట్లు సెల్‌ఫోన్ కాల్‌డేటా ద్వారా తెలుస్తోంది. సౌమ్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఏవో బలమైన కారణాలుంటాయని ఆమె స్నేహితులు అభిప్రాయపడుతున్నారు. సౌమ్య సమీప బంధువు సందీప్ మాత్రం ఆత్మహత్యకు అత్తింటివారి కట్న వేధింపులే కారణమని ఆరోపించాడు. రూ.16 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేశామని, పెళ్లిరోజున ఆడబిడ్డ కట్నం రూ.10 లక్షలు కావాలని గొడవ చేసి అలిగి అత్తింటివాళ్లు వెళ్లిపోయారని చెప్పాడు. భర్తతో కలిసి హాస్టల్‌కు వచ్చిన రోజునే ఆత్యహత్య చేసుకోవడానికి అత్తింటి వేధింపులే కారణమని ఆరోపించాడు. ఆ ఇంట ఏడాది నుంచి విషాదాలే... గతేడాది కొమరయ్య కొడుకు ప్రియతమ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆ షాక్ నుంచి కోలుకోకముందే సౌమ్య ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబీకులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. అటు కొడుకు.. ఇటు కూతురు అర్ధంతరంగా తనువు చాలించడంతో ‘మాకెవరు దిక్కు.. మేమెందుకు బతకాలి..’ అంటూ ఆ దంపతులు విలపించడం అందరినీ కలచివేసింది. తండ్రి అనారోగ్యంతో బాధ పడుతుండటంతో తల్లి మాలతి కూతురుకు అంత్యక్రియలు నిర్వహించింది. సౌమ్య, పవన్‌కుమార్‌రెడ్డిల పెళ్లినాటి ఫొటో (ఫైల్) -
ఆస్తి వివాదం: అత్తపై అల్లుడి దాడి
వెల్గటూరు: ఆస్తి విషయంలో తలెత్తిన వివాదం చివరికి గొడ్డలితో దాడిచేసేదాకా వెళ్లింది. గొడ్డలితో అత్తను తీవ్రంగా గాయపర్చిన ఓ అల్లుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే సంఘటన కరీంనగర్ జిల్లా వెల్గటూరు మండలం రాజారాంపల్లికి చెందిన శంకరమ్మ(50)పై అల్లుడు అంజయ్య మంగళవారం గొడ్డలితో దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రురాలుని ఆస్పత్రికి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. -
వైద్యుడు పొలిమేర దాటొద్దన్నాడని..
కోరుట్ల/కథలాపూర్ : మూఢనమ్మకం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. పాముకాటుకు మందు వేసిన నాటువైద్యుడు చేసిన హెచ్చరిక మేరకు ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడంతో ఓ మహిళ మృత్యువాత పడిన ఉదంతమిది. కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండల కేంద్రానికి చెందిన తెడ్డు శిరీష(30) బుధవారం రాత్రి పాముకాటుకు గురైంది. భర్త అంజయ్య వెంటనే దుంపెట గ్రామానికి చెందిన ఓ నాటువైద్యుడి వద్దకు శిరీషను తీసుకెళ్లాడు. ఆమెకు చికిత్స చేసిన నాటువైద్యుడు.. మూడు రోజులపాటు ఊరి పొలిమేర దాటొద్దని.. దాటితే మందు పనిచేయదని చెప్పాడు. దానినే గుడ్డిగా నమ్మిన శిరీష కుటుంబసభ్యులు నాటువైద్యుని ఇంటి సమీపంలో ఉన్న ఓ కొట్టంలోనే ఉన్నారు. పాము కాటు వేసిన కాలు వాపు వచ్చి.. పరిస్థితి విషమించిందినా.. ఆస్పత్రికి తీసుకెళ్లకుండా అక్కడే ఉంచారు. చివరికి శనివారం శిరీష పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో మెట్‌పల్లిలోని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే శిరీష చనిపోయింది.