సాక్షిప్రతినిధి, కరీంనగర్ : కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ నేతల్లో కలకలం రేపుతున్నాయి. 2019లో అధికారం లక్ష్యం అంటూ ముందుకు సాగుతున్న పార్టీ నాయకత్వం చేపడుతున్న సంస్కరణలు టికెట్ ఆశించే వారికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే.. ఒక్కో స్థానం నుంచి ముగ్గురి నుంచి ఎనిమిది మంది వరకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు.
ఇప్పటికే కరీంనగర్ నుంచి వయా హైదరాబాద్, ఢిల్లీ వరకు ఎవరి దారిలో వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే.. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండటం.. తెలంగాణపై కూడా ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో కీలకమైన కరీంనగర్ జిల్లాలో ఈసారి టిక్కెట్ల కేటాయింపు అంత ఆషామాషీగా ఉండదన్న ప్రచారం తెరమీదకు వచ్చింది.
ఇదే సమయంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రామచంద్ర కుంతియాతో రాహుల్‌గాంధీ భేటీ అయిన అనంతరం తెలంగాణలోనూ ‘రాజస్థాన్ ఫార్ములా’ను అమలు చేయాలన్న నిర్ణయాన్ని జిల్లా కమిటీలకు సమాచారం అందించారు. ‘జననేత’లుగా ఉన్నవారికే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు కూడా ప్రకటించిన నేపథ్యంలో ఏ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తారన్న సరికొత్త ఆందోళన కాంగ్రెస్ పార్టీ ఆశావహుల్లో మొదలైంది.
కాంగ్రెస్‌లో పెరుగుతున్న ఆశావహులు.. పోటాపోటీగా ప్రయత్నాలు..
జగిత్యాల, మంథని, ధర్మపురి, మానకొండూరు మినహా మిగతా స్థానాల్లో అశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆ నాలుగు స్థానాల నుంచి టి.జీవన్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, లక్ష్మణ్‌కుమార్, ఆరెపల్లి మోహన్‌లే మళ్లీ పోటీ చేయనున్నారని చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో చల్మెడ లక్ష్మీనర్సింహారావు కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోగా, ఆ స్థానం కోసం ఆయనతోపాటు ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం, నేరేళ్ల శారద తదితరులు ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా కొత్త జైపాల్‌రెడ్డి పేరు వినిపిస్తోంది. కోరుట్ల నుంచి కొమిరెడ్డి రాములుతో పాటు డాక్టర్ జేఎన్ వెంకట్, బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన డాక్టర్ రఘు ప్రయత్నం చేస్తున్నారు.
రామగుండం నుంచి టికెట్ రేసులో మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ పేరు వినిపిస్తోంది. సిరిసిల్ల నుంచి అధిష్టానంతో సన్నిహితంగా ఉండే కేకే మహేందర్‌రెడ్డి పేరు వినిపిస్తుండగా, ఇక్కడి నుంచి కటకం మృత్యుంజయం, కేసీఆర్ మేనల్లుడు చీటి ఉమేష్‌రావు, దరువు ఎల్లయ్య కూడా ఆశిస్తున్నారు. వేములవాడ నుంచి బొమ్మ వెంకటేశ్వర్‌తోపాటు ఏనుగు రవీందర్‌రెడ్డి టికెట్ ఆశిస్తుండగా, ఇటీవలే పార్టీలో చేరిన ఆది శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
హుజూరా బాద్ నియోజకవర్గం నుంచి పార్టీ సీనియర్ నేతలు పరిపాటి రవీందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, స్వర్గం రవి పేర్లు ఉన్నాయి. అదేవిధంగా చొప్పదండి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సుద్దాల దేవయ్య, గజ్జెల కాంతంతో పాటు మేడిపల్లి సత్యం ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. మేడిపల్లి సత్యం పేరు ప్రముఖం గా వినిపిస్తోంది. పెద్దపల్లి నుంచి గొట్టి్టముక్కుల సురేష్‌రెడ్డి, సీహెచ్ విజయరమణారావు, మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి కోడలు డాక్టర్ గీట్ల సవిత టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హుస్నాబాద్ అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పేరే ప్రధానంగా ఉం డగా, బొమ్మ వెంకటేశ్వర్, ఆయన కుమారుడు బొమ్మ శ్రీరాం కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
జూన్, జూలైలలో దరఖాస్తుల స్వీకరణ.. ఆశావహులకు అధిష్టానం సంకేతాలు..
వచ్చే నెల నుంచి టిక్కెట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆశావహులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సంకేతాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాది గడువున్నప్పటికీ రోజురోజుకూ మారుతున్న సమీకరణలు ఇప్పుడే ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అయితే.. ఈసారి రాజస్థాన్‌లో చేపడుతున్న ప్రక్రియను తెలంగాణలో అనుసరించనుండడం పలువురికి సంకటంగా మారనుందన్న చర్చ మొదలైంది. ఆ ఫార్ములా ప్రకారం ఒక నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించే అభ్యర్థి.. తెల్ల కాగితంపై తన పేరు, బయోడేటాతోపాటు సదరు నియోజకవర్గంలోని ప్రతీ బూత్ నుంచి 10 మంది ఓటర్ల పేర్లు, ఓటరు జాబితాలో వారి సంఖ్య, వారి ల్యాండ్ లేదా మొబైల్ నంబర్లను జతపరచాల్సి ఉంటుంది.
ఆ నియోజకవర్గంలో ఎన్ని బూత్‌లు ఉంటే అన్ని బూత్‌ల నుంచి విధిగా ఈ వివరాలు జతపరచాలి. దీని ద్వారా సదరు ఔత్సాహికునికి తన నియోజకవర్గంపై ఎంత పట్టు ఉందో అంచనా వేస్తారు. ఇచ్చిన వివరాలు సరైనవో, కాదో పరిశీలిస్తారు. అనంతరం అభ్యర్థులతో కూడిన జాబితాతో ఒక ప్యానల్‌ను నియమిస్తారు. ఈ ప్యానెల్ అభ్యర్థుల విజయావకాశాలపై సర్వే నిర్వహించి.. వచ్చిన అభిప్రాయాల ఆధారంగా మొదటిదశ వడపోతతో తొలి జాబితాను తయారు చేస్తుంది.
అనంతరం జాబితా టీపీసీసీ, ఏఐసీసీ పరిశీలనకు వెళ్తుంది. ఈ ప్రక్రియ ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేయాలన్న నిర్ణయానికి వచ్చిన పార్టీ హైకమాండ్ జూన్, జూలై మాసాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆశావహులకు సూచించింది. అయితే.. ఏళ్ల తరబడిగా పార్టీ జెండా, ఎజెండాతో పనిచేస్తున్న పార్టీ నాయకులకు కొత్త నిబంధనలు కొంత సంకటమేనన్న చర్చ నేతల్లో మొదలైంది. సీనియర్‌లంతా ఇప్పటికే తాము పోటీ చేయాలనుకున్న స్థానాల కోసం ‘గాడ్‌ఫాదర్’లతో ప్రయత్నాలు చేస్తుండగా, హఠాత్తుగా రాజస్థాన్ ఫార్ములా తెరపైకి తేవడం పార్టీలో పెద్ద చర్చకే దారితీసింది.
Comments
Please login to add a commentAdd a comment