Tickets Assembly
-
అనకాపల్లి.. ఇదేం లొల్లి..?
అనకాపల్లి జిల్లా టీడీపీలో ముసలం మొదలైంది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై జిల్లా నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. సీనియర్ నాయకుడై ఉండి ఒక పార్టీలో వర్గాలను సృష్టించడం పట్ల మండిపడుతున్నారు. ప్రస్తుతం అనకాపల్లి తెలుగుదేశంలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారింది. ఎప్పుడైనా మంటలు రేగవచ్చంటున్నారు. ఇంతకీ అనకాపల్లిలో అయ్యన్న ఏం చేశారు? చింతకాయల మంత్రాంగం తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన చింతకాయల అయ్యన్నపాత్రుడు అనకాపల్లి జిల్లాలో వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఒక వర్గానికి కొమ్ము కాస్తూ మరొక వర్గాన్ని తొక్కి పెట్టడంపై ఇతర నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తన అనుచరులుగా ముద్రపడిన వారికి వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి జిల్లాలో సీట్లు ఇప్పించుకునే ప్రయత్నం చేస్తుండడంపై మిగిలిన నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో కాపు వర్గం నేతలను తొక్కిపెట్టి తన వర్గం వారికి సీట్లు ఇప్పించుకునే ప్రయత్నం చేయడంపై టీడీపీలోని కాపు వర్గం నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చోడవరం నియోజకవర్గంలో ఇన్చార్జిగా కాపు సామాజిక వర్గానికి చెందిన బత్తుల తాతయ్య బాబు కొనసాగుతున్నారు. చోడవరంలో బత్తుల తాతయ్య బాబు స్థానంలో తన శిష్యుడైన కేఎస్ఎన్ రాజుకు సీటు ఇప్పించాలని పార్టీ నాయకత్వం వద్ద పావులు కదుపుతున్నారని అయ్యన్నపై విరుచుకుపడుతున్నారు కాపువర్గం నాయకులు.. డబ్బులుంటేనే టికెట్ ఎలమంచిలి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జిగా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రగడ నాగేశ్వరరావు ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ.. ఆయన స్థానంలో వేరొక వ్యక్తిని పోటీకి దించాలంటూ అయ్యన్నపాత్రుడు చంద్రబాబుకు సిఫార్సు చేశారు. అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయడానికి చాలామంది కాపు నాయకులు ఉత్సాహం చూపిస్తున్నారు. గతంలో ఇక్కడి నుంచి కాపు వర్గం నేతలే పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఎంపీ స్థానంలో కూడా కాపులు పోటీ చేయకుండా అడ్డుకోవాలని అయ్యన్నపాత్రుడు ప్రయత్నిస్తున్నారు. అనకాపల్లి ఎంపీ సీటులో తన కుమారుడిని పోటీ చేయించాలనే ఉద్దేశంతోనే అయ్యన్న ఇలా వ్యవహరిస్తున్నారని టీడీపీ కాపువర్గం నేతలు భావిస్తున్నారు. చదవండి: (టీ గ్లాస్లో తుఫాన్?.. ఉన్నదే గుప్పెడు మంది.. అందులో ముఠాలు) కలిసిన వాళ్లందరికీ హామీలు జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో కూడా తన వర్గానికి చెందిన వారికే సీట్లు ఇప్పించడానికి అయ్యన్న పావులు కదుపుతున్నారు. చోడవరం సీటు కెఎస్ఎన్ రాజుకు, మాడుగుల సీటు గరివిరెడ్డి రామానాయుడుకు ఇప్పించే బాధ్యత తనదే అంటూ తిరుపతిలో అయ్యన్నపాత్రుడు వారిద్దరికీ మాట ఇచ్చినట్లు తెలుగుదేశం పార్టీలోనే విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇక అనకాపల్లి ఎమ్మెల్యే సీటు కోసం మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత అనకాపల్లి జిల్లా టిడిపి అధ్యక్షుడు బుద్ధా నాగ జగదీశ్వరరావు పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో అయ్యన్నపాత్రుడు పీల గోవిందకు మద్దతునిస్తున్నారు. మన కుర్చీకింద తడి, పక్క కుర్చీ కోసం ప్లాన్ పెందుర్తి నుంచి మాజీ మంత్రి బండారు నారాయణమూర్తి పోటీ చేయాలని భావిస్తున్నారు. బండారుకు వ్యతిరేకంగా విశాఖ సౌత్ ఇన్చార్జిగా ఉన్న గండి బాబ్జిని పెందుర్తిలో పోటీ చేయించే ఆలోచన చేస్తున్నారు అయ్యన్నపాత్రుడు. తన నియోజకవర్గ పరిస్థితిని చక్క బెట్టుకోలేని అయ్యన్న జిల్లా అంతటా పెత్తనం చేయాలని భావిస్తుండటంతో ఆయా నియోజకవర్గాల్లోని నేతలు మండిపడుతున్నారు. ముందు తన నియోజకవర్గాన్ని చక్కదిద్దుకుంటే బాగుంటుందని సలహా ఇస్తున్నారు. ఇతరుల సలహాలు పాటిస్తే ఆయన అయ్యన్న ఎందుకవుతారనే సెటైర్లు వినిపిస్తున్నాయి. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీఎం ప్రాధాన్యం
సాక్షి, నాగర్‌కర్నూల్: గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీచేసి విజయం సాధించిన ఎమ్మెల్యేలకే ఈసారీ కూడా టికెట్లు ఇస్తానని స్వయంగా ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించడంతో జిల్లా లోని ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఆత్మస్థైర్యం పెరిగింది. దీంతో వారు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. నాలుగేళ్లపాటు వివిధ పనులతో, వ్యక్తిగత వ్యాపకాలతో బిజీగా ఉన్న ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో పూర్తి సమయా న్ని గెలుపు కోసం కేటాయించేలా రాజకీయ అనుభవం ఉన్న సహచరులతో ప్రస్తావిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తమకు మరోసారి అవకాశం ఇస్తామని ఇటీవల ప్రకటించడం వీరికి కొండంత ధైర్యాన్ని తెచ్చిపెట్టింది. ఆ మూడు నియోజకవర్గాల్లో.. జిల్లాలోని నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేటలలో టీఆర్ఎస్ పార్టీ 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. వీరిలో కొల్లాపూర్ ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు రాజకీయంగా అనుభవం ఉండటంతో ఆయన కొల్లాపూర్‌లో మొదటిసారి సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. పార్టీ తరఫున తొలిసారి బరిలోకి దిగిన నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు అసెంబ్లీలో పాదం మోపారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జైపాల్ యాదవ్ మాత్రం అంతర్గత కుమ్ములాటల కారణంగా అప్పట్లో పరాజయం పాలయ్యారు. జిల్లాల విభజన తర్వాత టీఆర్ఎస్ మూడు స్థానాల్లో విజయం సాధించి జిల్లాలో బలమైన పార్టీగా ఉంది. ఈ పట్టును ఇదేవిధంగా కొనసాగించుకునేందుకు ప్రస్తుతం అధిష్టాన వర్గం, స్థానిక నేతలకు స్పష్టమైన ఆదేశాలను ఎప్పటికప్పుడు అందిస్తోంది. అసంతృప్తులకు తాయిలాలు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో టీఆర్ఎస్ పార్టీ ఓట్లు చీలకుండా ఉండేందుకు అసంతృప్తులను గుర్తించి వారిని నయానో, భయానో తమవైపు తిప్పుకునేందుకు ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా కల్వకుర్తి నియోజకవర్గంలో టీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి ముఖ్య నాయకులు వచ్చి చేరుకుంటుండంతో వర్గాలు ఏర్పడ్డాయి. జైపాల్‌యాదవ్ గత ఎన్నికల్లో పోటీ చేసినా నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆయన చురుకుగా వ్యవహరించడం లేదన్న అసంతృప్తి ఆ పార్టీ కార్యకర్తలలో ఉంది. మరోపక్క కసిరెడ్డి నారాయణరెడ్డి, బాలాజీసింగ్, ఎడ్మ కిష్టారెడ్డిలు ఇక్కడ పార్టీ కోసం శ్రమిస్తున్నారు. వీరిలో ఎవరికి టికెట్ వచ్చినా పార్టీ విజయం కోసం పనిచేయాలని, వీరందరినీ ఒక్క తాటిపైకి తెచ్చేందుకు అధిష్టానం వీరితో మంతనాలు జరుపుతోంది. గత ఎన్నికల్లో పరాజయం పాలైన బీసీ వర్గానికి చెందిన జైపాల్‌యాదవ్‌కు టికెట్ ప్రకటిస్తే ఆయన విజయం కోసం పనిచేయాలని పార్టీ శ్రేణులు పిలుపునిస్తున్నారు. మరోపక్క ఆయనకు కాకుండా మరెవరికి టికెట్ వచ్చినా అన్ని వర్గాలు సహకరించాలని కోరుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మిగతా శ్రేణులు సహకరించాలని పార్టీ సమన్వయకర్తలు కార్యకర్తలకు సూచిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌లో బీసీ ఓటర్లకు గాలం నాగర్‌కర్నూల్ జిల్లాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీ ఓటర్లను ఆకట్టుకునేందుకు టీఆర్ఎస్ అధిష్టానం చురుకుగా పావులు కదుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంతోపాటు స్వచ్ఛంద సేవల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్న మర్రి జనార్దన్‌రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకే టికెట్ వస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ సీనియర్ నేత, బీసీ వర్గాలకు చెందిన బైకని శ్రీనివాస్‌యాదవ్‌ను ఆయన ఇటీవల తెరపైకి తీసుకొచ్చారు. బీసీలలో అధిక శాతం ఉన్న కురుమ యాదవుల ఓట్లను ఆకట్టుకునేందుకు కృషిచేస్తున్నారు. మరోపక్క ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డికి నియోజకవర్గంలో ఉన్న పట్టును టీఆర్ఎస్ విజయం కోసం మళ్లిస్తున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు అందుతున్న సాగునీటి ద్వారా అధికార పార్టీకి ఓట్ల పంట పండుతుందని ఎమ్మెల్యే భావిస్తున్నారు. ఇటు క్షేత్ర స్థాయిలో పర్యటనలు పెంచడంతోపాటు ప్రతి గ్రామంలో 10మంది చొప్పున సోషల్ మీడియా ప్రచారకులను నియమించుకుని ప్రతిపక్షాలపై విరుచుకు పడుతున్నారు. రాములును బుజ్జగిస్తున్న బాల్‌రాజు అచ్చంపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి రాములుతో ఇన్నాళ్లూ దూరంగా ఉంచిన ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు ఇటీవల ఆయనకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలకు ఆహ్వానం పలుకుతున్నారు. రాష్ట్ర పార్టీలో రాములుకు ప్రధాన కార్యదర్శి పదవి రావడంతో ప్రోటోకాల్ ప్రకారం ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈసారి అధిష్టానం తనకు మరోసారి అవకాశం ఇస్తుందని గువ్వల బాల్‌రాజు గట్టిగా నమ్ముతున్నారు. మాజీ మంత్రి రాములు ప్రస్తావన తెస్తే మాత్రం ఆయన ఒకింత అసహనం వ్యక్తంచేస్తున్నారంటూ మాజీ మంత్రి పి. రాములు అభిమానులు లోలోపల ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మంత్రి ఇలాఖాలో.. కొల్లాపూర్ నియోజకవర్గంలో ముందెన్నడూ జరగనంత అభివృద్ధిని చేసి చూపేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఉధృతంగా ప్రయత్నిస్తున్నారు. ఇక్కడి నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మంత్రి జూపల్లి ఈసారి అదే ఒరవడిని కొనసాగించాలని రేయింబవళ్లు కష్టపడుతున్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో కొల్లాపూర్‌ను అభివృద్ధి పథంలో నిలిపేందుకు పెద్ద ఎత్తున నిధులను తన నియోజకవర్గానికి మళ్లించి పక్కా భవనాలు, సిమెంట్ రోడ్ల నిర్మాణం, డ్రైన్ల కల్పన వంటివి చేపట్టారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను మంత్రి కలియదిరుగుతూ ఒక్కో గ్రామంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వస్తున్నారు. పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల, వ్యతిరేకత ఉన్న చోట దృష్టి సారించారు. ఎట్టి పరిస్థితిలో 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ జిల్లాలోని నాలుగు స్థానాలను కైవసం చేసుకుంటుందని జిల్లా నేతలు దీమా వ్యక్తం చేస్తున్నారు. -
కాంగ్రెస్ టికెట్లకు కొత్త మెలిక
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ నేతల్లో కలకలం రేపుతున్నాయి. 2019లో అధికారం లక్ష్యం అంటూ ముందుకు సాగుతున్న పార్టీ నాయకత్వం చేపడుతున్న సంస్కరణలు టికెట్ ఆశించే వారికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే.. ఒక్కో స్థానం నుంచి ముగ్గురి నుంచి ఎనిమిది మంది వరకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటికే కరీంనగర్ నుంచి వయా హైదరాబాద్, ఢిల్లీ వరకు ఎవరి దారిలో వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే.. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండటం.. తెలంగాణపై కూడా ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో కీలకమైన కరీంనగర్ జిల్లాలో ఈసారి టిక్కెట్ల కేటాయింపు అంత ఆషామాషీగా ఉండదన్న ప్రచారం తెరమీదకు వచ్చింది. ఇదే సమయంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రామచంద్ర కుంతియాతో రాహుల్‌గాంధీ భేటీ అయిన అనంతరం తెలంగాణలోనూ ‘రాజస్థాన్ ఫార్ములా’ను అమలు చేయాలన్న నిర్ణయాన్ని జిల్లా కమిటీలకు సమాచారం అందించారు. ‘జననేత’లుగా ఉన్నవారికే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు కూడా ప్రకటించిన నేపథ్యంలో ఏ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తారన్న సరికొత్త ఆందోళన కాంగ్రెస్ పార్టీ ఆశావహుల్లో మొదలైంది. కాంగ్రెస్‌లో పెరుగుతున్న ఆశావహులు.. పోటాపోటీగా ప్రయత్నాలు.. జగిత్యాల, మంథని, ధర్మపురి, మానకొండూరు మినహా మిగతా స్థానాల్లో అశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆ నాలుగు స్థానాల నుంచి టి.జీవన్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, లక్ష్మణ్‌కుమార్, ఆరెపల్లి మోహన్‌లే మళ్లీ పోటీ చేయనున్నారని చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో చల్మెడ లక్ష్మీనర్సింహారావు కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోగా, ఆ స్థానం కోసం ఆయనతోపాటు ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం, నేరేళ్ల శారద తదితరులు ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా కొత్త జైపాల్‌రెడ్డి పేరు వినిపిస్తోంది. కోరుట్ల నుంచి కొమిరెడ్డి రాములుతో పాటు డాక్టర్ జేఎన్ వెంకట్, బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన డాక్టర్ రఘు ప్రయత్నం చేస్తున్నారు. రామగుండం నుంచి టికెట్ రేసులో మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ పేరు వినిపిస్తోంది. సిరిసిల్ల నుంచి అధిష్టానంతో సన్నిహితంగా ఉండే కేకే మహేందర్‌రెడ్డి పేరు వినిపిస్తుండగా, ఇక్కడి నుంచి కటకం మృత్యుంజయం, కేసీఆర్ మేనల్లుడు చీటి ఉమేష్‌రావు, దరువు ఎల్లయ్య కూడా ఆశిస్తున్నారు. వేములవాడ నుంచి బొమ్మ వెంకటేశ్వర్‌తోపాటు ఏనుగు రవీందర్‌రెడ్డి టికెట్ ఆశిస్తుండగా, ఇటీవలే పార్టీలో చేరిన ఆది శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. హుజూరా బాద్ నియోజకవర్గం నుంచి పార్టీ సీనియర్ నేతలు పరిపాటి రవీందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, స్వర్గం రవి పేర్లు ఉన్నాయి. అదేవిధంగా చొప్పదండి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సుద్దాల దేవయ్య, గజ్జెల కాంతంతో పాటు మేడిపల్లి సత్యం ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. మేడిపల్లి సత్యం పేరు ప్రముఖం గా వినిపిస్తోంది. పెద్దపల్లి నుంచి గొట్టి్టముక్కుల సురేష్‌రెడ్డి, సీహెచ్ విజయరమణారావు, మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి కోడలు డాక్టర్ గీట్ల సవిత టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హుస్నాబాద్ అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పేరే ప్రధానంగా ఉం డగా, బొమ్మ వెంకటేశ్వర్, ఆయన కుమారుడు బొమ్మ శ్రీరాం కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. జూన్, జూలైలలో దరఖాస్తుల స్వీకరణ.. ఆశావహులకు అధిష్టానం సంకేతాలు.. వచ్చే నెల నుంచి టిక్కెట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆశావహులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సంకేతాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాది గడువున్నప్పటికీ రోజురోజుకూ మారుతున్న సమీకరణలు ఇప్పుడే ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అయితే.. ఈసారి రాజస్థాన్‌లో చేపడుతున్న ప్రక్రియను తెలంగాణలో అనుసరించనుండడం పలువురికి సంకటంగా మారనుందన్న చర్చ మొదలైంది. ఆ ఫార్ములా ప్రకారం ఒక నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించే అభ్యర్థి.. తెల్ల కాగితంపై తన పేరు, బయోడేటాతోపాటు సదరు నియోజకవర్గంలోని ప్రతీ బూత్ నుంచి 10 మంది ఓటర్ల పేర్లు, ఓటరు జాబితాలో వారి సంఖ్య, వారి ల్యాండ్ లేదా మొబైల్ నంబర్లను జతపరచాల్సి ఉంటుంది. ఆ నియోజకవర్గంలో ఎన్ని బూత్‌లు ఉంటే అన్ని బూత్‌ల నుంచి విధిగా ఈ వివరాలు జతపరచాలి. దీని ద్వారా సదరు ఔత్సాహికునికి తన నియోజకవర్గంపై ఎంత పట్టు ఉందో అంచనా వేస్తారు. ఇచ్చిన వివరాలు సరైనవో, కాదో పరిశీలిస్తారు. అనంతరం అభ్యర్థులతో కూడిన జాబితాతో ఒక ప్యానల్‌ను నియమిస్తారు. ఈ ప్యానెల్ అభ్యర్థుల విజయావకాశాలపై సర్వే నిర్వహించి.. వచ్చిన అభిప్రాయాల ఆధారంగా మొదటిదశ వడపోతతో తొలి జాబితాను తయారు చేస్తుంది. అనంతరం జాబితా టీపీసీసీ, ఏఐసీసీ పరిశీలనకు వెళ్తుంది. ఈ ప్రక్రియ ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేయాలన్న నిర్ణయానికి వచ్చిన పార్టీ హైకమాండ్ జూన్, జూలై మాసాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆశావహులకు సూచించింది. అయితే.. ఏళ్ల తరబడిగా పార్టీ జెండా, ఎజెండాతో పనిచేస్తున్న పార్టీ నాయకులకు కొత్త నిబంధనలు కొంత సంకటమేనన్న చర్చ నేతల్లో మొదలైంది. సీనియర్లంతా ఇప్పటికే తాము పోటీ చేయాలనుకున్న స్థానాల కోసం ‘గాడ్‌ఫాదర్’లతో ప్రయత్నాలు చేస్తుండగా, హఠాత్తుగా రాజస్థాన్ ఫార్ములా తెరపైకి తేవడం పార్టీలో పెద్ద చర్చకే దారితీసింది. -
ఉద్యమాల్లో ఉన్నవారికి టికెట్లు వద్దా?
పార్టీలో గుర్తింపు లేదని టీఆర్ఎస్ నేత చెరుకు సుధాకర్ ఆవేదన హైదరాబాద్: ‘ఉద్యమాల్లో పనికొచ్చిన నేతలు.. అసెంబ్లీ టికెట్లు ఇవ్వడానికి పనికిరారా?’ అని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ప్రశ్నించారు. గెలుపు గుర్రాల పేరుతో ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి జరుగుతున్న వలసల పట్ల పార్టీలో చాలా మంది బాధ పడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణవాదులపై దాడులు చేసిన కొండా సురేఖ, పి.మహేందర్ రెడ్డి వంటి వారిని టీఆర్ఎస్లో చేర్చుకోవడం మంచిది కాదన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. విమలక్క, మంద కృష్ణ మాదిగ వంటి వారితో సంబంధాలున్నాయని పార్టీ అధినేత కేసీఆర్ నుంచి తనను కొందరు దూరం చేశారని సుధాకర్ ఆరోపించారు. తాను టీడీపీలో చేరేది లేదని, టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఉద్యమకారుడిగా తనను గుర్తించడం లేదని... ఈ తీరు పార్టీకి నష్టం చేస్తుందని సుధాకర్ హెచ్చరించారు. గెలుపు గుర్రాలు కావాలి కదా!: కేసీఆర్ చెరుకు సుధాకర్ వ్యాఖ్యలపై కేసీఆర్ కూడా స్పందించారు. ‘సుధాకర్ ఉద్యమకారుడే. 2004లో అవకాశమిచ్చినా డిపాజిట్ రాలేదు. ఈసారి మరో వ్యక్తికి అవకాశమిచ్చాం. ఎన్నికల్లో గెలుపు గుర్రాలు కావాలి కదా! ఎన్నికల రాజకీయాల్లో ఇవన్నీ చూసుకోవాలి కదా? అయినా సుధాకర్ వంటివారు ఓపిక పడితే ఏవైనా అవకాశాలు వస్తాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.