ఉద్యమాల్లో ఉన్నవారికి టికెట్లు వద్దా?
పార్టీలో గుర్తింపు లేదని టీఆర్‌ఎస్ నేత చెరుకు సుధాకర్ ఆవేదన
హైదరాబాద్: ‘ఉద్యమాల్లో పనికొచ్చిన నేతలు.. అసెంబ్లీ టికెట్లు ఇవ్వడానికి పనికిరారా?’ అని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ప్రశ్నించారు. గెలుపు గుర్రాల పేరుతో ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి జరుగుతున్న వలసల పట్ల పార్టీలో చాలా మంది బాధ పడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణవాదులపై దాడులు చేసిన కొండా సురేఖ, పి.మహేందర్ రెడ్డి వంటి వారిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం మంచిది కాదన్నారు.
ఆదివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. విమలక్క, మంద కృష్ణ మాదిగ వంటి వారితో సంబంధాలున్నాయని పార్టీ అధినేత కేసీఆర్ నుంచి తనను కొందరు దూరం చేశారని సుధాకర్ ఆరోపించారు. తాను టీడీపీలో చేరేది లేదని, టీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఉద్యమకారుడిగా తనను గుర్తించడం లేదని... ఈ తీరు పార్టీకి నష్టం చేస్తుందని సుధాకర్ హెచ్చరించారు.
గెలుపు గుర్రాలు కావాలి కదా!: కేసీఆర్
చెరుకు సుధాకర్ వ్యాఖ్యలపై కేసీఆర్ కూడా స్పందించారు. ‘సుధాకర్ ఉద్యమకారుడే. 2004లో అవకాశమిచ్చినా డిపాజిట్ రాలేదు. ఈసారి మరో వ్యక్తికి అవకాశమిచ్చాం. ఎన్నికల్లో గెలుపు గుర్రాలు కావాలి కదా! ఎన్నికల రాజకీయాల్లో ఇవన్నీ చూసుకోవాలి కదా? అయినా సుధాకర్ వంటివారు ఓపిక పడితే ఏవైనా అవకాశాలు వస్తాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.