అనకాపల్లి జిల్లా టీడీపీలో ముసలం మొదలైంది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై జిల్లా నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. సీనియర్ నాయకుడై ఉండి ఒక పార్టీలో వర్గాలను సృష్టించడం పట్ల మండిపడుతున్నారు. ప్రస్తుతం అనకాపల్లి తెలుగుదేశంలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారింది. ఎప్పుడైనా మంటలు రేగవచ్చంటున్నారు. ఇంతకీ అనకాపల్లిలో అయ్యన్న ఏం చేశారు?
చింతకాయల మంత్రాంగం
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన చింతకాయల అయ్యన్నపాత్రుడు అనకాపల్లి జిల్లాలో వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఒక వర్గానికి కొమ్ము కాస్తూ మరొక వర్గాన్ని తొక్కి పెట్టడంపై ఇతర నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తన అనుచరులుగా ముద్రపడిన వారికి వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి జిల్లాలో సీట్లు ఇప్పించుకునే ప్రయత్నం చేస్తుండడంపై మిగిలిన నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో కాపు వర్గం నేతలను తొక్కిపెట్టి తన వర్గం వారికి సీట్లు ఇప్పించుకునే ప్రయత్నం చేయడంపై టీడీపీలోని కాపు వర్గం నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చోడవరం నియోజకవర్గంలో ఇన్చార్జిగా కాపు సామాజిక వర్గానికి చెందిన బత్తుల తాతయ్య బాబు కొనసాగుతున్నారు. చోడవరంలో బత్తుల తాతయ్య బాబు స్థానంలో తన శిష్యుడైన కేఎస్‌ఎన్ రాజుకు సీటు ఇప్పించాలని పార్టీ నాయకత్వం వద్ద పావులు కదుపుతున్నారని అయ్యన్నపై విరుచుకుపడుతున్నారు కాపువర్గం నాయకులు..
డబ్బులుంటేనే టికెట్
ఎలమంచిలి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జిగా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రగడ నాగేశ్వరరావు ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ.. ఆయన స్థానంలో వేరొక వ్యక్తిని పోటీకి దించాలంటూ అయ్యన్నపాత్రుడు చంద్రబాబుకు సిఫార్సు చేశారు. అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయడానికి చాలామంది కాపు నాయకులు ఉత్సాహం చూపిస్తున్నారు. గతంలో ఇక్కడి నుంచి కాపు వర్గం నేతలే పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఎంపీ స్థానంలో కూడా కాపులు పోటీ చేయకుండా అడ్డుకోవాలని అయ్యన్నపాత్రుడు ప్రయత్నిస్తున్నారు. అనకాపల్లి ఎంపీ సీటులో తన కుమారుడిని పోటీ చేయించాలనే ఉద్దేశంతోనే అయ్యన్న ఇలా వ్యవహరిస్తున్నారని టీడీపీ కాపువర్గం నేతలు భావిస్తున్నారు.
చదవండి: (టీ గ్లాస్‌లో తుఫాన్?.. ఉన్నదే గుప్పెడు మంది.. అందులో ముఠాలు)
కలిసిన వాళ్లందరికీ హామీలు
జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో కూడా తన వర్గానికి చెందిన వారికే సీట్లు ఇప్పించడానికి అయ్యన్న పావులు కదుపుతున్నారు. చోడవరం సీటు కెఎస్ఎన్ రాజుకు, మాడుగుల సీటు గరివిరెడ్డి రామానాయుడుకు ఇప్పించే బాధ్యత తనదే అంటూ తిరుపతిలో అయ్యన్నపాత్రుడు వారిద్దరికీ మాట ఇచ్చినట్లు తెలుగుదేశం పార్టీలోనే విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇక అనకాపల్లి ఎమ్మెల్యే సీటు కోసం మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత అనకాపల్లి జిల్లా టిడిపి అధ్యక్షుడు బుద్ధా నాగ జగదీశ్వరరావు పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో అయ్యన్నపాత్రుడు పీల గోవిందకు మద్దతునిస్తున్నారు.
మన కుర్చీకింద తడి, పక్క కుర్చీ కోసం ప్లాన్
పెందుర్తి నుంచి మాజీ మంత్రి బండారు నారాయణమూర్తి పోటీ చేయాలని భావిస్తున్నారు. బండారుకు వ్యతిరేకంగా విశాఖ సౌత్ ఇన్చార్జిగా ఉన్న గండి బాబ్జిని పెందుర్తిలో పోటీ చేయించే ఆలోచన చేస్తున్నారు అయ్యన్నపాత్రుడు. తన నియోజకవర్గ పరిస్థితిని చక్క బెట్టుకోలేని అయ్యన్న జిల్లా అంతటా పెత్తనం చేయాలని భావిస్తుండటంతో ఆయా నియోజకవర్గాల్లోని నేతలు మండిపడుతున్నారు. ముందు తన నియోజకవర్గాన్ని చక్కదిద్దుకుంటే బాగుంటుందని సలహా ఇస్తున్నారు. ఇతరుల సలహాలు పాటిస్తే ఆయన అయ్యన్న ఎందుకవుతారనే సెటైర్లు వినిపిస్తున్నాయి.
- పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment