సాక్షి, నాగర్‌కర్నూల్: గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీచేసి విజయం సాధించిన ఎమ్మెల్యేలకే ఈసారీ కూడా టికెట్లు ఇస్తానని స్వయంగా ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించడంతో జిల్లా లోని ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఆత్మస్థైర్యం పెరిగింది. దీంతో వారు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. నాలుగేళ్లపాటు వివిధ పనులతో, వ్యక్తిగత వ్యాపకాలతో బిజీగా ఉన్న ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో పూర్తి సమయా న్ని గెలుపు కోసం కేటాయించేలా రాజకీయ అనుభవం ఉన్న సహచరులతో ప్రస్తావిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తమకు మరోసారి అవకాశం ఇస్తామని ఇటీవల ప్రకటించడం వీరికి కొండంత ధైర్యాన్ని తెచ్చిపెట్టింది.
ఆ మూడు నియోజకవర్గాల్లో..
జిల్లాలోని నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేటలలో టీఆర్‌ఎస్ పార్టీ 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. వీరిలో కొల్లాపూర్ ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు రాజకీయంగా అనుభవం ఉండటంతో ఆయన కొల్లాపూర్‌లో మొదటిసారి సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. పార్టీ తరఫున తొలిసారి బరిలోకి దిగిన నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు అసెంబ్లీలో పాదం మోపారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జైపాల్ యాదవ్ మాత్రం అంతర్గత కుమ్ములాటల కారణంగా అప్పట్లో పరాజయం పాలయ్యారు. జిల్లాల విభజన తర్వాత టీఆర్‌ఎస్ మూడు స్థానాల్లో విజయం సాధించి జిల్లాలో బలమైన పార్టీగా ఉంది. ఈ పట్టును ఇదేవిధంగా కొనసాగించుకునేందుకు ప్రస్తుతం అధిష్టాన వర్గం, స్థానిక నేతలకు స్పష్టమైన ఆదేశాలను ఎప్పటికప్పుడు అందిస్తోంది.
అసంతృప్తులకు తాయిలాలు
జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో టీఆర్‌ఎస్ పార్టీ ఓట్లు చీలకుండా ఉండేందుకు అసంతృప్తులను గుర్తించి వారిని నయానో, భయానో తమవైపు తిప్పుకునేందుకు ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా కల్వకుర్తి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌లోకి ఇతర పార్టీల నుంచి ముఖ్య నాయకులు వచ్చి చేరుకుంటుండంతో వర్గాలు ఏర్పడ్డాయి. జైపాల్‌యాదవ్ గత ఎన్నికల్లో పోటీ చేసినా నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆయన చురుకుగా వ్యవహరించడం లేదన్న అసంతృప్తి ఆ పార్టీ కార్యకర్తలలో ఉంది. మరోపక్క కసిరెడ్డి నారాయణరెడ్డి, బాలాజీసింగ్, ఎడ్మ కిష్టారెడ్డిలు ఇక్కడ పార్టీ కోసం శ్రమిస్తున్నారు. వీరిలో ఎవరికి టికెట్ వచ్చినా పార్టీ విజయం కోసం పనిచేయాలని, వీరందరినీ ఒక్క తాటిపైకి తెచ్చేందుకు అధిష్టానం వీరితో మంతనాలు జరుపుతోంది. గత ఎన్నికల్లో పరాజయం పాలైన బీసీ వర్గానికి చెందిన జైపాల్‌యాదవ్‌కు టికెట్ ప్రకటిస్తే ఆయన విజయం కోసం పనిచేయాలని పార్టీ శ్రేణులు పిలుపునిస్తున్నారు. మరోపక్క ఆయనకు కాకుండా మరెవరికి టికెట్ వచ్చినా అన్ని వర్గాలు సహకరించాలని కోరుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మిగతా శ్రేణులు సహకరించాలని పార్టీ సమన్వయకర్తలు కార్యకర్తలకు సూచిస్తున్నారు.
నాగర్‌కర్నూల్‌లో బీసీ ఓటర్లకు గాలం
నాగర్‌కర్నూల్ జిల్లాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీ ఓటర్లను ఆకట్టుకునేందుకు టీఆర్‌ఎస్ అధిష్టానం చురుకుగా పావులు కదుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంతోపాటు స్వచ్ఛంద సేవల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్న మర్రి జనార్దన్‌రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకే టికెట్ వస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ సీనియర్ నేత, బీసీ వర్గాలకు చెందిన బైకని శ్రీనివాస్‌యాదవ్‌ను ఆయన ఇటీవల తెరపైకి తీసుకొచ్చారు. బీసీలలో అధిక శాతం ఉన్న కురుమ యాదవుల ఓట్లను ఆకట్టుకునేందుకు కృషిచేస్తున్నారు. మరోపక్క ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డికి నియోజకవర్గంలో ఉన్న పట్టును టీఆర్‌ఎస్ విజయం కోసం మళ్లిస్తున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు అందుతున్న సాగునీటి ద్వారా అధికార పార్టీకి ఓట్ల పంట పండుతుందని ఎమ్మెల్యే భావిస్తున్నారు. ఇటు క్షేత్ర స్థాయిలో పర్యటనలు పెంచడంతోపాటు ప్రతి గ్రామంలో 10మంది చొప్పున సోషల్ మీడియా ప్రచారకులను నియమించుకుని ప్రతిపక్షాలపై విరుచుకు పడుతున్నారు.
రాములును బుజ్జగిస్తున్న బాల్‌రాజు
అచ్చంపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి రాములుతో ఇన్నాళ్లూ దూరంగా ఉంచిన ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు ఇటీవల ఆయనకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలకు ఆహ్వానం పలుకుతున్నారు. రాష్ట్ర పార్టీలో రాములుకు ప్రధాన కార్యదర్శి పదవి రావడంతో ప్రోటోకాల్ ప్రకారం ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈసారి అధిష్టానం తనకు మరోసారి అవకాశం ఇస్తుందని గువ్వల బాల్‌రాజు గట్టిగా నమ్ముతున్నారు. మాజీ మంత్రి రాములు ప్రస్తావన తెస్తే మాత్రం ఆయన ఒకింత అసహనం వ్యక్తంచేస్తున్నారంటూ మాజీ మంత్రి పి. రాములు అభిమానులు లోలోపల ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
మంత్రి ఇలాఖాలో..
కొల్లాపూర్ నియోజకవర్గంలో ముందెన్నడూ జరగనంత అభివృద్ధిని చేసి చూపేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఉధృతంగా ప్రయత్నిస్తున్నారు. ఇక్కడి నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మంత్రి జూపల్లి ఈసారి అదే ఒరవడిని కొనసాగించాలని రేయింబవళ్లు కష్టపడుతున్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో కొల్లాపూర్‌ను అభివృద్ధి పథంలో నిలిపేందుకు పెద్ద ఎత్తున నిధులను తన నియోజకవర్గానికి మళ్లించి పక్కా భవనాలు, సిమెంట్ రోడ్ల నిర్మాణం, డ్రైన్ల కల్పన వంటివి చేపట్టారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను మంత్రి కలియదిరుగుతూ ఒక్కో గ్రామంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వస్తున్నారు. పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల, వ్యతిరేకత ఉన్న చోట దృష్టి సారించారు. ఎట్టి పరిస్థితిలో 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జిల్లాలోని నాలుగు స్థానాలను కైవసం చేసుకుంటుందని జిల్లా నేతలు దీమా వ్యక్తం చేస్తున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీఎం ప్రాధాన్యం
Published Sun, Aug 5 2018 9:50 AM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment