
వివాహితను మింగిన ఇంకుడుగుంత
దుస్తులు ఉతుకుతుండగా ప్రమాదం
ధారూరు: ఓ వివాహిత దుస్తులు ఉతుకుతూ ప్రమాదవశాత్తు ఇంకుడు గుంతలో పడి దుర్మరణం చెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని దోర్నాల్ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. ప్రత్యక్షసాక్షి, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దోర్నాల్ గ్రామానికి చెందిన తానెం సాయిలు తన పెద్దకూతురు దేవమ్మ (24)కు వివాహం చేసి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నాడు. ఇదిలా ఉండగా, ఆమె ఆదివారం తన పొలంలో కలుపు తీసేందుకు అదే గ్రామానికి చెందిన కూలీ జోగు అంజమ్మతో కలిసి వెళ్లింది. వీళ్లు తమతో పాటు ఉతికేందుకు దుస్తులు తీసుకెళ్లారు. ముందుగా, పొలం పక్కనే ఇటీవల తవ్విన ఇంకుడు గుంతలో ఇద్దరూ కలిసి దుస్తులు ఉతుకుతున్నారు. దేవమ్మ కూర్చున్న బండరాయి పట్టుతప్పి గుంతలో పడిపోయింది. దేవమ్మ నీటిలో పడడంతో పక్కనే ఉన్న అంజమ్మ బిగ్గరగా కేకలు వేసింది. సమీప పొలంలో పనిచేస్తున్న ఇద్దరు యువకులు వెంటనే అక్కడికి వచ్చి దేవమ్మను బయటకు తీయగానే కొద్దిసేపటికి ఆమె ప్రాణం విడిచింది. విషయం తెలుసుకున్న సర్పంచ్ కావలి రాములు ఎస్‌ఐ షంషొద్దీన్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతురాలి తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.