సీఎం, మంత్రుల కూతుళ్లు, కోడళ్లకేనా సాధికారత ?
సీఎం, మంత్రుల కూతుళ్లు, కోడళ్లకేనా సాధికారత ?
Published Sun, Feb 12 2017 9:17 PM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM
గుంటూరు ఎడ్యుకేషన్ : మహిళా పార్లమెంట్ సదస్సు పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా మినహా మహిళకు ఒనగూరిందేమీ లేదని ఐద్వా జిల్లా కార్యదర్శి డి. రమాదేవి అన్నారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ హాల్లో ఆదివారం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా విద్యార్థినుల విభాగం – ఐద్వా మహిళా సంఘ ఆధ్వర్యంలో ‘‘మహిళా పార్లమెంట్ సదస్సుతో మహిళా సాధికారత వస్తుందా’’ అనే అంశంపై చర్చా గోష్టి నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా విద్యార్థినుల విభాగ కన్వీనర్ వి. జ్యోతి అధ్యక్షతన జరిగిన చర్చా గోష్టిలో రమాదేవి మాట్లాడుతూ సదస్సులో ఉపన్యసించిన నాయకులు మహిళల్ని దేవతామూర్తులుగా పొగిడారని, అయితే ఆచరణలో వారందరూ మహిళా ద్రోహులేనని ఆరోపించారు. సీఎం, మంత్రులు కూతుళ్లు, కోడళ్లకు మినహా సాధారణ మహిళలకు సాధికారత లేదని అన్నారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదింపజేసేందుకు బీజేపీ ఎంపీలు కృషి చేయాలన్నారు. మెజార్టీ ఉంటేనే బిల్లు తెస్తామన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తీరు మార్చుకోవాలని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ నాయకురాలు జి. ఝాన్సీరాణి మాట్లాడుతూ కోడలిని దారుణంగా హింసించిన స్పీకర్ కోడెల మహిళా సాధికారత అంటూ సదస్సులు నిర్వహించడం సిగ్గు చేటని విమర్శించారు. పీవోడబ్ల్యూ నాయకురాలు పార్వతి మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్యకర్తల్ని గుర్రాలతో తొక్కించిన వారుమహిళా సదస్సు నిర్వహించడం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజాపై పోలీసులు వ్యవహరించిన తీరును చర్చా గోష్టిలో పాల్గొన్న మహిళలు ముక్తకంఠంతో ఖండించారు. సంఘటనపై సీఎం చంద్రబాబు మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా నగర కార్యదర్శి అరుణ, వైఎస్సార్ సీపీ మహిళా విభాగ నాయకులు విజయమాధవి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వి. భగవాన్‌దాస్, సురేఖ, తిరుపతిరెడ్డి, డీవైఎఫ్‌ఐ నాయకులు హరి వెంకట్ పాల్గొన్నారు.
Advertisement