మద్యం.. యుద్ధం
గుత్తిలో ఉద్రిక్తత
జనావాసాల మధ్య మద్యం దుకాణాలు తొలగించాలి
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మహిళల రాస్తారోకో
పోలీసుల సమక్షంలోనే వైన్‌షాపు యజమానుల దాడి
వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ దంపతులు, మహిళలకు గాయాలు
పోలీస్‌స్టేషన్ ఆవరణలో బాధితుల ధర్నా
ఇళ్ల మధ్యలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడంపై జనం తిరగబడ్డారు. తక్షణమే దుకాణాలు అక్కడి నుంచి తొలగించాలంటూ ఉద్యమించారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గుత్తిలో రాస్తారోకో చేశారు. ఇష్టారాజ్యంగా దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారంటూ ప్రశ్నించిన మహిళలు, నాయకులపై మద్యం షాపుల యజమానులు, సిబ్బంది దాడికి దిగారు. ఈ దాడిలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ దంపతులతోపాటు పలువురు మహిళలకు గాయాలయ్యాయి. దాదాపు రెండు గంటలపాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
గుత్తి (గుంతకల్లు) : గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్డులో నాలుగు రోజుల క్రితం ఒకే చోట ఐదు మద్యం దుకాణాల ఏర్పాటుకు ఎక్సైజ్ పోలీసులు అనుమతి ఇచ్చారు. ఇందులో భాగంగా మొదట రెండు షాపులు ప్రారంభించారు. మరో మూడు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. జనావాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల మహిళలకు రక్షణ లేకుండా పోతుందని బీసీ కాలనీ మహిళలు రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. మద్యం దుకాణాలను తొలగించాలని సివిల్, ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా దుకాణాలు యథావి«ధిగా నిర్వహిస్తూనే ఉన్నారు.
దీంతో ఆగ్రహించిన మహిళలు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బుధవారం మద్యం దుకాణాలకు ఎదురుగా రాస్తారోకో చేశారు. వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్ పీరా, బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లయ్యయాదవ్, జిల్లా కార్యదర్శులు సుభాష్‌రెడ్డి, గురుప్రసాద్ యాదవ్, కౌన్సిలర్లు కళ్యాణి, రాజేశ్వరి, నజీర్, కమలాక్షమ్మ మాట్లాడుతూ టీడీపీ సర్కార్ బడులు మూసివేసి బార్‌లు, బ్రాందీషాపులు ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల మధ్యనే మద్యం తాగుతున్నారని, మహిళలకు, విద్యార్థినులకు రక్షణ లేకుండా పోతోందని మహిళలు వరలక్ష్మి, లక్ష్మీదేవి, గౌరమ్మ, పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. షాపులు ఎత్తేసే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు.
మహిళలపై మద్యం షాపు నిర్వాహకుల దాడి
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై మద్యం దుకాణం నిర్వాహకులు శ్రీనివాసులు, వలి, నారాయణస్వామిలు తమ అనుచరులతో కలిసి పోలీసుల సమక్షంలోనే రాళ్లతో దాడి చేశారు. అంతటితో ఆగకుండా మహిళలను అని చూడకుండా వరలక్ష్మి, కళ్యాణి, రాజేశ్వరిలను కాళ్లతో తన్ని, ఇష్టానుసారం కొట్టారు. వైఎస్సార్ సీపీ నాయకులపై కూడా దాడికి పాల్పడ్డారు. బండరాయితో తలపై మోదడంతో వైఎస్సార్ సీపీ నాయకుడు జానప్ప తీవ్రంగా గాయపడ్డారు. ఈ తతంగమంతా పోలీసుల సమక్షంలోనే జరగడం గమనార్హం.
ఆందోళనకారుల అరెస్ట్
ఘర్షణ పూర్తయిన తర్వాత ఎస్‌ఐ సుధాకర్ సంఘటన స్థలానికి వచ్చారు. వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షులు పీరా, బీసీ సెల్ రాష్ట్ర నాయకులు మల్లయ్యయాదవ్, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డి, జిల్లా కార్యదర్శులు సుభాష్‌రెడ్డి, గురుప్రసాద్ యాదవ్, రంగస్వామి, జిల్లా అధికార ప్రతినిధి పాశం రంగస్వామి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున, శివ, రాజశేఖర్ రెడ్డి, ఆనందరెడ్డి, నిర్మల, రంగప్రసాద్ రాయల్, ప్రసాద్ గౌడ్, బేల్దారి చంద్రలను బలవంతంగా అరెస్టు చేసి జీపులో తరలిస్తుండగా మహిళలు అడ్డుపడ్డారు. పోలీసులు వారికి నచ్చజెప్పి, ఆందోళనకారులను స్టేషన్‌కు తరలించారు. అక్రమ అరెస్టుకు నిరసనగా పోలీసు స్టేషన్‌లోనే ఆందోళనకారులు ధర్నా చేపట్టారు. అనంతరం మహిళలు పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా, మండల నాయకులు నారాయణస్వామి, జీపు రమణ,కొత్తపల్లి రంగయ్య, బసినేపల్లి భాస్కరరెడ్డి, గోపాల్, అబ్బేదొడ్డి కాంతారెడ్డి, రమాకాంత్‌రెడ్డి, భీమలింగ తదితరులు పాల్గొన్నారు.