ఉద్యోగాల ఆశచూపి వేశ్యలుగా మార్చేస్తున్నారు
డబ్బులు కడితేనే అక్కడ్నించి విముక్తి
మలేషియాలో 150 మంది రాష్ట్ర మహిళలు
తూ.గో, ప.గో, చిత్తూరు, శ్రీకాకుళం, అనంతపురం..
జిల్లాల నుంచి పొట్టకూటి కోసం వెళ్లి చిక్కుకున్న వైనం
చిత్తూరు (అర్బన్): విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపించి మహిⶠలను వ్యభిచార గృహాలకు తరలిస్తున్నారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి దాదాపు 150 మంది వేశ్య గృహాల్లో అమ్మేశారు. చిత్తూరు పోలీసుల దర్యాప్తులో ఈ వాస్తవాలు వెలుగు చూశాయి.
చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వివాహిత రెండు రోజుల కిందట సత్యవేడు పోలీసులకు ఓ ఫిర్యాదు ఇచ్చింది. మలేషియాలో హౌస్ కీపింగ్ కోసం మనుషులు కావాలని తెలిసిన వాళ్లు చెప్పడంతో ఓ మధ్యవర్తి ద్వారా ఎనిమిది నెలల క్రితం పాస్‌పోర్టు, వీసా తీసుకుని వెళ్లాలని పేర్కొంది. తీరా అక్కడకు వెళ్లిన తరువాత ఓ వేశ్య గృహానికి తనను తీసుకెళ్లి, వ్యభిచారం చేయమని చెప్పి శారీరకంగా, మానసికంగా హింసించారని తెలిపింది. తినడాకి తిండి లేకుండా చావు బతుకుల మధ్య వ్యభిచారం చేస్తూ నెలల పాటు ఇక్కడే ఉన్నానని, తనను రూ.1.30 లక్షలకు మలేషియాలోని వేశ్య గృహంలో అమ్మేసినట్లు తెలుసుకున్నట్లు పోలీసులకు తెలియచేసింది. తీరా ఏడు నెలల కాలంలో వ్యభిచారం చేసి వేశ్య గృహం నిర్వాహకురాలికి రూ.1.80 లక్షలు చెల్లించి స్వదేశానికి తిరిగొచ్చినట్లు పేర్కొంది. తనలాంటి వాళ్లు ఇక్కడ వందలాది మంది ఉన్నారని దీనిపై కేసు పెట్టాలని ఆ మహిళ పోలీసుల్ని ఆశ్రయించింది. దీనిపై ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓఎస్డీ రత్న, డీఎస్పీ గిరిధర్‌ల నేతృత్వంలోని ఓ బృందం దర్యాప్తు ప్రారంభించింది.
దర్యాప్తులో తేలిన అంశాలు...
పోలీసుల దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. చెన్నైకు చెందిన ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేసిన చిత్తూరు పోలీసులు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో 30 మందిని విచారించారు. చిత్తూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన దాదాపు 150 మందిని మలేషియాకు పంపినట్లు నిందితులు అంగీకరించారు. తమిళనాడులోని చెన్నై, మధురై, మన రాష్ట్రంలోని నెల్లూరు, విజయవాడ, వైజాగ్ ప్రాంతాల్లో మధ్యవర్తుల ద్వారా మహిళల్ని విదేశీ వేశ్య గృహాల్లో అమ్మేసినట్లు ఒప్పుకున్నారు. ఇందులో ప్రధానంగా భర్తకు దూరమైన వాళ్లు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మలేషియాలో చిన్న పిల్లల్ని చూసుకోవడానికి, ఇంటిపని చేయడానికి మనుషులు కావాలన్నట్లు పత్రికల్లో ప్రకటనలు జారీ చేసి, మహిళలకు టూరిస్ట్ వీసా తీసుకుని అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులకు లంచాలు ఇచ్చి వేశ్య గృహాలకు తరలిస్తున్నట్లు నిందితులు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు.
డీజీపీతో మాట్లాడాం
మహిళల తరలింపు ఓ చైన్‌లింక్‌లా ఉంది. విచారిస్తూ వెళుతుంటే చాలా విషయాలు తెలుస్తున్నాయి. దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై మా ఎస్పీ.. రాష్ట్ర డీజీపీతో మాట్లాడాం. మలేషియాలోని వేశ్య గృహాల్లో చిక్కుకున్న మహిళల్ని అక్కడి నుంచి బయటపడేయడమే ఇప్పుడు మా ముందున్న కర్తవ్యం.
– రత్న, ఓఎస్డీ, చిత్తూరు