భగ్గుమంటున్న మహిళాలోకం
– జనావాసాల్లో మద్యం షాపుల ఏర్పాటుపై ఆగ్రహం
– జిల్లా వ్యాప్తంగా నిరసనలు
అనంతపురం సెంట్రల్ : జనావాసాల మధ్య మద్యం షాపుల ఏర్పాటు చేస్తుండటంపై మహిళాలోకం భగ్గుమంటోంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు, రాస్తారోకోలు కొనసాగుతున్నాయి. అనంతపురంలో గుత్తిరోడ్డులో నివాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించకపోతే ధ్వంసం చేస్తామంటూ మహిళల సీపీఐ నేతలతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి చింతకుంట మధు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ఎక్సైజ్ డిప్యూటీ సూపరింటెండెంట్ మల్లారెడ్డిని కలిసి నివాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న మద్యుం దుకాణాలను తొలగించాలని ఫిర్యాదు చేశారు.
గుత్తిలో మద్యంషాపుపై మహిళలు దాడికి యత్నించారు. గోడలను ధ్వంసం చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కళ్యాణదుర్గంలో మహిళలకు ఇబందులు కలిగించేలా ప్రభుత్వం మద్యం షాపులను ఏర్పాటు చేస్తోందని అనంత మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు విజయలక్ష్మి విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. తనకల్లు, రాయదుర్గం, ఉరవకొండలో మద్యం షాపుల ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉరవకొండలో రంగావీధి ప్రజలు చేపట్టిన ఆందోళనలకు వైఎస్సార్‌సీపీ నేతలు మద్దతు తెలిపారు.