– సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనుల్లో బినామీలుగా అవతారం
– నాణ్యతకు పాతర.. ప్రేక్షక పాత్రలో పంచాయతీరాజ్ ఇంజినీర్లు
గాలి ఉన్నప్పుడే తూర్పు పట్టాలనుకున్నారేమో. ప్రగతి పనుల్లో టీడీపీ తమ్ముళ్లు జాతర చేసుకుంటున్నారు. బినామీ కాంట్రాక్టర్లుగా మారి అభివృద్ధి పనుల ఖజానాను కొల్లగొడుతున్నారు. ప్రమాణాలకు పాతర వేసి పదికాలాల పనులను మూన్నాళ్ల ముచ్చట చేస్తున్నారు. పట్టించుకోవాల్సిన ఇంజినీర్లు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. కమీషన్లతో సరిపెట్టుకుని నాణ్యతను గాలికి వదిలేస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగాన్ని పట్టించుకునే నాథుడు లేకపోవడంతో గ్రామీణుల్లో ఆందోళనలు నెలకొంది. - మంత్రాలయం
పనుల వివరాలు :
మంత్రాలయం నియోజకవర్గంలో 72 పంచాయతీలు ఉండగా రూ.8.27 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మాణం చేపట్టారు. 14వ ఆర్థిక ప్రణాళిక నిధులు, ఉపాధి హామీ పథకం నిధులతో కలిపి రూ.4 కోట్లు, ఎస్‌డీపీ, ఎస్‌డీఎఫ్, జెడ్పీ నిధులు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో రూ.4.27 కోట్ల పనులు చేశారు. మంత్రాలయం మండలంలో రూ.2 కోట్లు, కోసిగిలో 2.21 కోట్లు, పెద్దకడబూరులో 1.52 కోట్లు, కౌతాళంలో రూ.2.54 కోట్లతో పనులు కానిస్తున్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ 50 శాతం, ఇతర నిధులు 50 శాతంతో పనులు జరుగుతున్నాయి.
నాణ్యతకు పాతర
ప్రగతి పనులకు అధికార పార్టీ నాయకులు చీడపురుగుల్లా తయారయ్యారు. బినామీలుగా మారి గ్రామాల్లో జరిగే ప్రతి పనిలో తమ మార్క్ చాటుకుంటున్నారు. ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రెయినేజీల పనులు బినామీలుగా చేసేసుకుంటున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ మద్దతు సర్పంచుల గ్రామాల్లోని పనుల్లోనూ వారు అధికారం చెలాయిస్తున్నారు. గుడికంబాళి, మంత్రాలయం, కౌతాళం, చిలకలడోణ, డి.బెళగల్, కోసిగి గ్రామాల్లో చేసిన పనులను పరిశీలించగా నాణ్యత ప్రమాణాలు మచ్చుకైనా కానరావడంలేదు. మంత్రాలయం మండల కేంద్రంలో గ్రామీణ అభివృద్ధి నిధి రూ.5.10 కోట్లతో అండర్‌గ్రౌండ్ నిర్మాణం పనులు చేపట్టారు. రామచంద్ర నగర్‌లో సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులు అధికారపార్టీ నాయకులు బినామీలుగా చేసేశారు. నెలలోపే 20 అడుగులకో చోట రోడ్డు అడ్డుగా బీటలు వారింది. గుడికంబాళిలో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం సర్పంచు బినామీగా చేస్తున్నారు. నిర్మాణం దశలోనే ఎక్కడపడితే అక్కడ సీసీ రోడ్డు రాలి పడిపోయింది. కౌతాళం, డి.బెళగల్, చిలకలడోణ ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి.
ప్రేక్షక పాత్రలో ఇంజినీర్లు
పవర్‌కు తలొగ్గారో.. కమీషన్లతో కక్కుర్తిపడ్డారో తెలియదుగానీ పంచాయతీరాజ్ ఇంజినీర్లు పనులు పర్యవేక్షించడం మానేశారు. పనులు వైపు కన్నెత్తి చూడకుండానే బిల్లులు చేసేస్తున్నారు. పదికాలాల పాటు మన్నిక ఉండాల్సిన రోడ్లు మూన్నాళ్ల ముచ్చటగా మారుతున్నా చలించని వైనం. రోడ్ల నిర్మాణాల్లో ఇష్టారాజ్యంగా ప్రమాణాలు పాటిస్తున్నా పట్టించుకోవడం లేదు. టీడీపీ ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు కనుసన్నల్లోనే పనులు సాగిపోతున్నాయి. ఇంజినీర్ల నిర్లక్ష్యంపై సర్వత్రా గ్రామాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నాణ్యత ప్రమాణాలు పాటించాలి: బొగ్గుల తిక్కన్న, వైఎస్‌ఆర్‌సీపీ ఎస్సీ సేవాదళ్ జిల్లా కార్యదర్శి
ప్రగతి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి. ప్రజాధనం వృథా కాకుండా అధికారులు చూడాలి. నాణ్యత పాటించని పనులకు బిల్లులు చేయకుండా చర్యలు తీసుకోవాలి. టీడీపీ నాయకులు బినామీ కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి నాణ్యతకు నీళ్లొదలడం సరికాదు. పనుల నాణ్యతపై ప్రత్యేక కమిటీలు వేసి విచారణ చేపట్టాలి.
పనులు పర్యవేక్షిస్తున్నాం: మోహన్, పంచాయతీరాజ్ ఏఈ, కౌతాళం
ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తున్నాం. నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం. నాణ్యత పాటించకపోతే బిల్లులు నిలిపేస్తామని హెచ్చరిస్తున్నాం.