కోరమాండల్‌లో జట్టు కూలీ మృతి
-
మృతదేహంతో బంధువుల ఆందోళన
-
రూ.8 లక్షలు చెల్లించేందుకు యాజమాన్యం అంగీకారం
-
సద్దుమణిగిన వివాదం
కాకినాడ రూరల్ :
రూరల్ మండలం వాకలపూడిలోని కోరమాండల్ ఫ్యాక్టరీలో జట్టు కూలీగా పనిచేస్తున్న ఓ వ్యక్తి శనివారం రాత్రి మృతి చెందాడు. దీంతో మృతుని బంధువులు, సీపీఎం, సీపీఐ నాయకులు ఆదివారం ఆందోళనకు దిగారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా చనిపోవడానికి కారణాలు ఫ్యాక్టరీ యాజమాన్యం తెలపాలని, మృతుని బంధువులకు నష్టపరిహారం చెల్లించాలని మృతదేహంతో ఫ్యాక్టరీ గేటు ముందు ధర్నాకు దిగారు. ఒకానొకదశలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో రూరల్ తహసీల్దార్ జె.సింహాద్రి, సర్పవరం సీఐ మురళీకృష్ణారెడ్డి వచ్చి ఆందోళనకారులు, ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చించారు. చివరకు చర్చలు సఫలం కావడంతో మధ్యాహ్నం రెండు గంటలకు ఆందోళన విరమించారు. మృతదేహాన్ని అతడి స్వగ్రామమైన యండమూరు తీసుకువెళ్లారు. వివరాలివి...
కరప మండలం యండమూరుకు చెందిన మారెళ్ల వెంకటరావు (54) కాకినాడలోని కోరమాండల్ ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీలో చాలా కాలం నుంచి జట్టుకూలీగా పని చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే శనివారం రాత్రి 10 గంటల సమయంలో విధులకు హాజరయ్యాడు. తరువాత ఏం జరిగిందో తెలీదుగానీ వెంకట్రావు చనిపోయాడు. కూలీలు వెంటనే యాజమాన్యానికి సమాచారం అందించడంతో సర్పవరం జంక్షన్‌లోని ట్రస్ట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. వెంకట్రావు బంధువులు ఆస్పత్రి వద్దకు రావడంతో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి. మృతదేహాన్ని కోరమాండల్ ఫ్యాక్టరీకి చేర్చి ఆందోళనకు దిగారు. పోలీసులు, తహసీల్దార్ ఎంత నచ్చజెప్పినా వినలేదు. చివరకు యాజమాన్యంతో అధికారులు, పోలీసులు, కుటుంబ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు సమావేశమై చర్చించారు. మృతుని కుటుంబానికి రూ.7 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు యాజమాన్యం ఒప్పుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ఆందోళనలో సీపీఎం నాయకులు సిహెచ్.అజయ్‌కుమార్, పలివెల వీరబాబు, యండమూరు మాజీ సర్పంచ్ మారెళ్ల వెంకటరమణ, మండవ సమాధానం, సీపీఐ నాయకుడు తోకల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.