బీబీగూడెం(చివ్వెంల): అనుమానాస్పద స్థితిలో హమాలీ మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని బీబీగూడెం గ్రామ శివారులోని విష్ణువందన ఫార్‌బాయిల్డ్ రైస్ మిల్లులో గురువారం జరిగింది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మున్యానాయక్‌తండాకు చెందిన ధరావత్ రాజు(45) 20 సంవత్సరాలుగా విష్ణు వందన రైస్ మిల్లులో హమాలీగా పని చేస్తున్నాడు.
ఈ క్రమంలో రోజు మాదిరిగానే మిల్లులో పని నిమిత్తం వచ్చాడు. కాగా పని కొంచెం ఆలస్యంగా మొదలవుతుందని తెలుసుకుని వెంట తెచ్చుకున్న ఆహారాన్ని మిల్లులోనే అతడితో పాటు మరికొంత మంది హమాలీలు చెట్టు కింద కూర్చొని భోజనం చేశారు. కొద్ది సేపటికే రాజు కుప్పకూలి కింద పడిపోయాడు. గమనించిన తొటి హమాలీలు వెంటనే చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలించగా అప్పటికే మృతిచెం దినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గుండెపోటుతో మృతిచెందినట్టు భావిస్తున్నారు.
మృతదేహాన్ని తిరిగి ట్రాక్టర్లలో మిల్లు వద్దకు తీసుకువచ్చారు. మృతుడి కుటుంబానికి యాజమాన్యం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బంధువులు మృతదేహంతో మిల్లు ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో మిల్లు యాజమాన్యం రూ.1.20 లక్షలు ఇస్తామని అంగికరించడంతో ఆందోళన విరమించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
అనుమానాస్పదంగా హమాలీ మృతి
Published Fri, Jun 3 2016 8:53 AM | Last Updated on Mon, Sep 4 2017 1:35 AM
Advertisement
Advertisement