- సర్ధార్, ఓర్‌మెన్లపై వేధింపులు
- సూపర్‌వైజర్ పర్యవేక్షణ లేక ప్రమాదం
అధికారుల తీరుపై కార్మికుల ఆగ్రహం
Published Wed, Aug 17 2016 11:16 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
కాసిపేట : అధికారుల తప్పిదం, సూపర్‌వైజర్ల పర్యవేక్షణ లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు సర్ధార్, ఓర్‌మెన్‌లను బాధ్యులను చేయాలని అధికారులు కుట్రలు పన్నుతూ విచారణ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారు. మందమర్రి ఏరియా కాసిపేటగనిలో ఆదివారం రాత్రి షిప్టులో సోమవారం తెల్లవారు జామున కోట శ్రీనివాస్ అనే ఎలక్ట్రీషియన్ కార్మికుడిపై స్టార్టర్ పడి తీవ్రగాయాలైన విషయం పాఠకులకు విదితమే... ఇద్దరు సర్ధార్‌లు పనిచేయాల్సిన చోట ఒక్కరిని పనిచేయించి ప్రమాదం జరిగితే వారినే బాధ్యులను చేస్తున్న ఘటనపై నాయకులు స్పందించక పోవడం పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం ప్లేడే విధి నిర్వహణ ఇద్దరు సర్ధార్‌లకు అప్పగించారు. ఇందులో ఒక్కరికి వారంలో మూడు మస్టర్లు మాత్రమే ఉన్నాయని తీసుకోకపోవడంతో అతడి స్థానంలో మరో సర్ధార్ విధులకు వచ్చిన ప్లేడే ఇతరుల పేరుమీద ఉన్నందున పేరు మార్చడం తమ చేతిలో లేదని చెప్పడంతో తిరిగి వెళ్లాడు. దీంతో ఒక్క సర్ధార్‌ను మాత్రమే విధినిర్వహణకు కేటాయించి 3సీం, 4సీం, పంపులు, ఎలక్ట్రీషియన్ పనుల పరిశీలన బాధ్యతలు అప్పగించారు. అన్నిప్రదేశాల్లో చూసుకోవడం కష్టం అవుతున్నా వీరికి ఇబ్బందులు తప్పడం లేదు.
సూపర్‌వైజర్ పర్యవేక్షణలో జరగాలి
కాగా శ్రీనివాస్ మీద పడిన స్టార్టర్‌కు సంబంధించి హైటెన్షన్(హెచ్‌టీ)పవర్ అయినందున ఆపనులు సూపర్‌వైజర్ పర్యవేక్షణలో సీనియర్ ఎలక్ట్రీషియన్ నిర్వహించాల్సి ఉండగా 4వ కెటగిరీకి చెందిన జూనియర్ ఎలక్ట్రీషియన్‌కు ఇంజినీరింగ్ అధికారులు అప్పగించారు. ఇలాంటి పనులు మొదటిషిప్టులో చేపట్టాల్సి ఉండగా తమకు అనుకూలమైన వ్యక్తికి ప్లేడే రావాలనే ఉద్దేశ్యంతో మూడోషిప్టులో కేటాయించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సూపర్‌వైజర్, ఇంజినీర్లు రక్షణ, ఇతర నియమాలు మరిచి ఇష్టం ఉన్నవారిని అందలం ఎక్కించి ఇష్టం లేని కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తునట్లు కార్మికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత సూపర్‌వైజర్ ఈవిషయంలో హెల్పర్ సీనియర్ ఉన్నాడని జూనియర్ ఎలక్ట్రీషియన్‌కు పని అప్పగించినట్లు బాహటంగా ఒప్పుకోవడం వారి తీరును తెలియజేస్తోంది.
ప్రమాదం జరిగిన తరువాత మూడుగంటలకు పైకి..
కాగా ప్రమాదం జరిగిన అనంతరం బాధితుడిని మూడు గంటల అనంతరం గనిపైకి తీసుకురావడం పట్ల అధికారులు, సూపర్‌వైజర్ల నిర్లక్ష్యం తెలుస్తోంది. తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రమాదం జరగడంతో అతని వెంట ఉన్న కార్మికులు గని పైకి ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ ఫోన్ లేపకపోవడం గమనర్హం. దీంతో చేసేదేమీ లేక వేరె పనిస్థలంలో పనిచేసిన పంపు అపరేటర్ విధులు ముగించుకుని గని పైకి వెళ్లి విషయం చెప్పడంతో ఉదయం7గంటల విధులు ముగించుకోని పైకి వచ్చిన ఇతర కార్మికులు కలిసి లోనికి వెళ్లి ప్రమాదానికి గురైన శ్రీనివాస్‌ను 8గంటల వరకు పైకి తీసుకువచ్చి ఆస్పత్రికి తరలించారు. ఇవన్నీ లోపాలు పట్టించుకోని అధికారులు కేవలం సర్ధార్‌లు, ఓర్‌మెన్‌లను బాధ్యులను చేసెందుకు ప్రయత్నాలు చేయడం దారుణం.
పర్యవేక్షణ లోపంతో..
ప్రమాదానికి కారణం పర్యవేక్షణలోపం, రక్షణ పాటించకపోవడమేనని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టార్టర్ ఎనిమిది మంది కార్మికులు పట్టి లాగితే ఒక్కచోట కూర్చోపెట్టడం సాధ్యం అవుతుంది. అలాంటిది డోర్ తీయగానే మీద పడింది అంటే దాని లెగ్స్ వంగిపోయి ఉన్నాయని, వీటిని సరిచేయడంలో పరిశీలనలో ఇంజినీరింగ్ అధికారుల తప్పులేదా అనే ప్రశ్నాలు ఉత్పన్నం అవుతున్నాయి. ఏదైనా సమస్య, మరమ్మతులున్నప్పటికి పర్యవేక్షించాల్సిన అధికారులు పైకి తీసుకురాకుండ లోపల పాతవాటినె నామమాత్రపు మరమ్మత్తులు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అధికారులు నియమాలు పక్కనపెట్టి ఈవిధంగా వ్యవహరించడం సరికాదని వేదింపులు మానుకోని సర్ధార్‌లకు మానసిక ఒత్తిడి తగ్గించాలని కోరుతున్నారు.
Advertisement
Advertisement