సీఎంకు ఫిర్యాదు చేస్తా
- సీఎంకు ఫిర్యాదు చేస్తా
– జల వనరుల శాఖ ఇంజినీర్లపై కలెక్టర్ ఆగ్రహం
కర్నూలు సిటీ: సాగు నీటి ప్రాజెక్టుల పనులు మీ నిర్లక్ష్యం వల్లే పూర్తి కావడం లేదని ఇలాగైతే సీఎంకు ఫిర్యాదు చేస్తానని కలెక్టర్ చల్లా విజయ మోహన్ జల వనరుల శాఖ ఇంజినీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ భవనంలో సాగు నీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై ఆయా సర్కిళ్ల ఇంజినీర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయని, కాంట్రాక్టర్లు పనులు చేయడంలో నిర్లక్ష్యం చేస్తుంటే ఇంజినీర్లు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. పనులు సక్రమంగా చేయని కాంట్రాక్టర్లపై ఎందుకు ఇన్ని రోజులు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. గత సమావేశంలో నవంబర్ 15 లోపు పనులు పూర్తి చేస్తామని చెప్పి ఇంత వరకు పనులు మొదలే పెట్టలేదంటే శాఖ పనితీరు ఎలాంటిదో తెలిసిపోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాలేరు పనుల్లో రోజుకు 8500 క్యూబిక్ మీటర్ల మట్టి పనులకు గాను, కేవలం 3500 క్యూబిక్ మీటర్ల మట్టి పనులు మాత్రమే జరిగితే ఎప్పటికి పూర్తి కావాలని ఈఈ, డీఈఈలపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హంద్రీనీవా 25, 26, 28, 29 ప్యాకేజీలలో పెండింగ్ పనులు పూర్తయినప్పటికీ పనులు పూర్తి కాలేదన్నారు. పత్తికొండ, దేవనకొండ ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులను భాగస్వాములను చేసినా ఎందుకు పనులు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు. పనులు విభజించుకొని వచ్చే నెల 31లోపు పూర్తి చేయాలని ఇంజినీర్లును ఆదేశించారు. సిద్ధాపురం ఎత్తిపోతల పథకం 2007లో ప్రారంభించినా ఇప్పటీకి పనులు పూర్తి కాలేదన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి పనులు నిలిచిపోయినా తన దృష్టికి ఎందుకు తీసుకరాలేదని ఈఈని ప్రశ్నించారు. ఆయన సమాధానం చెప్పకపోవడంతో మీ మౌనం చూస్తేనే పని తీరు ఏంటో అర్థమవుతుందని చురుకలంటించారు. ఈ నెల 29న మరో సారి సమీక్షిస్తానని, ఆలోపు మెరుగైన పురోగతితో రావాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఎస్‌ఈలు చంద్రశేఖర్ రావు, నారాయణ స్వామి, ఈఈ, డీఈఈ, ఏఈఈలు పాల్గొన్నారు.