మోడల్ ప్రైమరీ స్కూల్స్‌కు ఒక రోజు వర్క్‌షాపులో మాట్లాడుతున్న కలెక్టర్
పాత శ్రీకాకుళం: ఉపాధ్యాయులంతా నిత్య విద్యార్థుల్లా పని చేయాలని కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం కోరారు. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం జిల్లాలో పనిచేస్తున్న మోడల్స్ స్కూల్‌కు ఒక రోజు వర్క్‌షాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. అన్ని మోడల్ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందించాలని కోరారు. ఇచ్ఛాపురం మండలాల్లో టీచర్ల కొరత ఉన్నప్పటికీ మిగులు టీచర్లతో సర్దుబాటు చేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో 1నుంచి 8వతరగతి వరకూ మోడల్ పాఠశాలలుగా పెట్టాల్సి ఉంటుందని చెప్పారు.
డీఈఓ దేవానంద్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్స్‌కు దీటుగా మోడల్ స్కూల్స్ పనిచేయాలన్నారు. ప్రతి విద్యార్థి సొంతంగా ఆలోచించినపుడే ఆ మోడల్ స్కూల్‌పై తల్లిదండ్రులకు నమ్మకం కలుగుతుందని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రతి మోడల్ స్కూల్లో ఒక కంప్యూటర్, డిజిటల్ లేబ్‌ను తెప్పిస్తామన్నారు. 3, 4, 5 తరగతులకు ఒక్కో సబ్జెక్టు చొప్పున ఉపాధ్యాయుడు బోధించాలని పేర్కొన్నారు. సీఆర్పీలు ప్రతి వారం ఆ క్లస్టర్ పరిధిలో ఉన్న మోడల్ స్కూళ్లను సందర్శించాలని తెలిపారు. ఎంఈఓలు కూడా నెలకు రెండు మార్లు విజిట్ చేయాలని సూచించారు. మోడల్ స్కూల్ స్టేట్ కోఆర్డినేటర్ ప్రసాదరావు మాట్లాడుతూ ఒక్కో సబ్జెక్టును ఒక్కో ఉపాధ్యాయుడు మాత్రమే చెప్పాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ ప్రభాకర్ రావు, పాలకొండ డిప్యూటీ డీఈఓ వెంకట్రావు ఎంఈవోలు, హెచ్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.