మనం పాలకులం కాదు ప్రజా సేవకులం. అధికారం చలాయించడం కోసం కాదు మనం ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉండేది.. నేను సీఎంగా ఉండేది.. ఎదిగే కొద్దీ ఒదగాలి. అధికారంలో ఉండేకొద్దీ ఇంకా ఎక్కువ ఒదగాలి. అప్పుడే ప్రజల నుంచి ఇంకా మంచి స్పందన లభిస్తుంది. ఈ వాస్తవాన్ని గుర్తించకపోతే నష్టపోతాం. ప్రతి గ్రామానికి వెళ్లండి. ప్రతి ఇంటినీ సందర్శించండి. ఏ ఇంటికైనా వెళ్లకపోతే.. మీరు తమ ఇంటికి రాలేదని, వారు మనకు వ్యతిరేకం అయ్యే అవకాశం ఉంది. వారు మనకు ఓటేయరని తెలిసినా వెళ్లండి. ఎందుకంటే వారికి ఎంతగా మంచి చేశామనే రికార్డులు మన దగ్గర ఉన్నాయి. వాటిని చిరునవ్వుతో వివరిస్తే, వారి మనసు మారొచ్చు.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో ఇవాళ కులాల మధ్య కాదు.. క్లాస్‌ల మధ్య.. అంటే పేదలు, పెత్తందార్ల మధ్య యుద్ధం జరుగుతోంది. మనం పొరపాటున అధికారంలోకి రాకపోతే, రాష్ట్రంలో ఉన్న ఏ పేదవాడికీ న్యాయం జరగదు. పేదవాడి ప్రతినిధి మనమే. మనం నష్టపోతే పేదలు నష్టపోతారు. వారికి న్యాయం జరగాలంటే మళ్లీ మనం తప్పకుండా అధికారంలోకి రావాలి.
ఇందుకోసం ప్రతి గడపనా కనీసం ఐదు నిమిషాల పాటు గడపాలి. మూడున్నరేళ్లలో మనం చేసిన మంచి గురించి చెప్పాలి’ అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలకు ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్బోధించారు. ‘దయచేసి అందరూ గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై ధ్యాస పెట్టండి.. మూడున్నరేళ్లుగా మనం చేస్తున్న మంచిని.. రానున్న రోజుల్లో చేయబోయే మేలును వివరించండి. మంచి చేసిన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరండి. మీరు ఆ ఇంటికి కేటాయించే సమయం మీకు ఎంతో మేలు చేస్తుంది.
మీ నియోజకవర్గంలో ప్రతి ఇంటిని మీకు చేరువ చేస్తుంది. మీ గెలుపునకు బాటలు వేస్తుంది’ అంటూ దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమం కొనసాగుతున్న తీరుపై సమీక్షించారు. ఇకపై మరింత మెరుగ్గా నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలకు మార్గ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
గడప గడపకు మన ప్రభుత్వంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు
సమర్థులనే పార్టీ కన్వీనర్లుగా నియమించండి
► నాయకత్వం వహించే సామర్థ్యం ఉన్న ముగ్గురు కార్యకర్తలనే సచివాలయ కన్వీనర్లుగా నియమించాలి. అందులో తప్పనిసరిగా ఒక మహిళ ఉండాలి. ఎమ్మెల్యేలకు ఇష్టం వచ్చిన వారిని నియమించుకోవచ్చు. వారికి తప్పనిసరిగా స్మార్ట్ ఫోన్ ఉండి తీరాలి. ఆ తర్వాత ప్రతి 50 ఇళ్లకు ఒక తమ్ముడు, ఒక చెల్లిని గృహ సారథులుగా నియమించాలి. వారు ఆ 50 ఇళ్లకు సంబంధించిన వారై ఉండాలి. ఎక్కడా వలంటీర్లు గృహ సారథులుగా ఉండకూడదు.
► పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు జనవరిలో ఆసరా మూడో దఫా రూ.6,500 కోట్లు చెల్లించబోతున్నాం. దానికి సంబంధించి ఇంటింటా ప్రచారం చేస్తూ, వారికి లేఖలు అందిస్తాం. ఆ తర్వాత గృహ సారథుల నియామకానికి సంబంధించి మరో దఫా వెరిఫికేషన్ ఉంటుంది.
ఎమ్మెల్యేల ద్వారా ట్యాబ్‌ల పంపిణీ
► రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యేల ద్వారా ట్యాబ్‌ల పంపిణీ మొదలవుతుంది. పగలు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని.. సాయంత్రం గడప గడపకూ కార్యక్రమాన్ని నిర్వహించాలి. జనవరి 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్ రూ.2,750 పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాం. పెన్షన్ పెంపుదలపై వారోత్సవాలను నిర్వహిస్తున్నాం. ఈ వారోత్సవాలలో రోజూ ఏదో ఒక మండలంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలి. సాయంత్రం గడప గడపకూ కార్యక్రమాన్ని నిర్వహించాలి.
► గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్దేశించిన విధంగా జరగాలి. ప్రతి సచివాలయ పరిధిలో కనీసం రెండు రోజులు.. రోజుకు కనీసం 6 గంటల పాటు తిరగాలి. అలా తిరగని ఎమ్మెల్యేలు.. మరోసారి ఆయా సచివాలయాలు సందర్శించాలి. ప్రతి ఇంటికి వెళ్లాలి. ప్రతి ఇంట్లో కనీసం 5 నిమిషాలు గడిపి, వారికి ప్రభుత్వం వల్ల కలిగిన ప్రయోజనాలు వివరించాలి. ఒక వేళ ఒక గ్రామంలో రెండు రోజుల్లో మొత్తం తిరగలేమనుకుంటే.. మూడు, నాలుగు రోజుల సమయం తీసుకోండి. ఎక్కడా తొందర పడకూడదు. మొక్కుబడిగా పని చేయొద్దు.
ప్రభావం చూపే పనుల్లో రాజీ వద్దు
► గ్రామాల్లో అత్యధిక ప్రభావం చూపే (హై ఇంప్యాక్ట్ వర్క్) పనులనే గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించండి. ఎక్కడా స్వ ప్రయోజనాలు ఆశించకండి. ఎవరినో సంతోష పరచాలని కూడా ఆలోచించొద్దు. ఆ పనుల కోసం ప్రతి సచివాలయానికి కేటాయిస్తున్న నిధుల్లో ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. అందువల్ల మీరు పనుల ప్రాధాన్యతను గుర్తించి, అక్కడికక్కడే ప్రతిపాదనలతో అప్‌లోడ్ చేస్తే, వెంటనే ఆమోదం లభిస్తుంది.
► అత్యంత ప్రాధాన్యత కలిగిన 23,808 పనులకు సంబంధించి రూ.930.28 కోట్లతో ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు రాగా, వాటిలో 21,275 పనులకు అనుమతి ఇచ్చాం. ఆ పనుల విలువ రూ.828.45 కోట్లు. వాటిలో 17,905 పనులు మొదలయ్యాయి. ఈ పనుల విలువ రూ.662.14 కోట్లు.
మీరంతా మళ్లీ గెలవాలి
మీ మీద నాకు ప్రేమ ఎక్కువ. మీలో ఎవరినీ పోగొట్టుకోవడం నాకిష్టం లేదు. మీ అందరినీ మళ్లీ చట్టసభలో చూడాలి. అదే నా కోరిక. మనం మన బాధ్యత సక్రమంగా నెరవేర్చకపోతే, కోట్ల మంది నష్టపోతారు. మోసంతో కూడిన రాజకీయాలు.. ప్రజలను ఉపయోగించుకుని వదిలేసే రాజకీయాలు.. వెన్నుపోటు రాజకీయాలు.. అబద్ధాల రాజకీయాలు.. ప్రజల మీద, పేదవాడి మీద ప్రేమ లేని రాజకీయాలు రాజ్యమేలుతాయి.
మనకు ఎన్నికలకు ఇంకా 16 నెలల సమయం ఉంది. గడప గడపకూ.. కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం? అని ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఇంట్లో కనీసం 5 నిమిషాలు గడిపి, ఆ ఇంటికి చేసిన మంచిని వివరించి, వారి ఆశీర్వాదం కోరండి. అప్పుడే వారి నుంచి మనకు సానుకూలత లభిస్తుంది. ఎన్నికల ముందు మీకు అంత సమయం ఉండదు కాబట్టి ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరితో మమేకం అవ్వండి. అదే మన గెలుపునకు బాటలు వేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment