మత్స్యకారుల సంక్షేమం వైఎస్సార్ సీపీ లక్ష్యం
వైఎస్సార్ సీపీ నేత జక్కంపూడి విజయలక్ష్మి
ఘనంగా ప్రపంచ మత్స్యకార దినోత్సవం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం) : మత్స్యకారుల అభ్యున్నతి, సంక్షేమం వైఎస్సార్ సీపీ లక్ష్యమని ఆ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి తెలిపారు. స్థానిక వాటర్ వర్క్సు ఇసుక ర్యాంపు వద్ద వివిధ మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రపంచ మత్స్యకార దినోత్సవంలో ముఖ్య అతిథిగా ఆమె మాట్లాడారు. కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో గతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారులకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి రూ.40 లక్షల విలువైన వస్తువులను అందజేశారని తెలిపారు. కోరుకొండ మండలంలో మత్స్యకారులు మృతి చెందినప్పుడు రూ.7 లక్షల ఆర్థిక సాయం అందించారని గుర్తు చేశారు.
మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నగర కో-ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ జాంపేట మార్కెట్‌లో దళారుల వ్యవస్థ లేకుండా మత్స్యకారులకు అవకాశం కల్పించాలని సూచించారు. ఇతర ఇసుక ర్యాంపులలో కూడా మత్స్యకారులకు అవకాశం కల్పించాలని కోరారు. నగర మేయర్ పంతం రజనిశేషసాయి మాట్లాడుతూ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కల్లుగీత, చేనేత కార్మికుల మాదిరిగా మత్స్యకారులకు కూడా 55 ఏళ్లకే ఫించను మంజూరు చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ చంద్రన్న బీమా పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మత్స్యకారులు మద్యం వ్యసనానికి దూరంగా ఉండాలని క్రైం డీఎస్పీ త్రినాథరావు సూచించారు. మత్స్యకార సంఘాల అధ్యక్షులు వెలమ లక్ష్మణరావు, లక్ష్మీ ,ప్రభాకరరావు మత్స్యకారులు సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ ప్రజాప్రతినిధులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోదావరిలో లక్ష చేప, రొయ్య పిల్లలను వదిలారు. అనంతరం మత్స్యకారులకు వస్త్రదానం చేశారు. గోదావరి మాత ఫిషర్ మెన్ సంఘం, శ్రీ గోదావరి బెస్త సేండ్ అండ్ క్వారీ బోట్స్ మెన్ కో-ఆపరేటివ్ సొసైటీ, గోదావరి మాత సేండ్ అండ్ క్వారీ మహిళామత్స్య సహకారం సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఇన్నమూరి రాంబాబు, పొలసానపల్లి హనుమంతరావు, యజ్జరపు మరిడయ్య, మన కోసం సమాచార హక్కుచట్టం అధ్యక్షుడు తొంటెపు హరికృష్ణ, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ శ్రీనివాస్, న్యాయవాది వల్లూరి సురేష్, మత్స్యశాఖాధికారులు రామకృష్ణ, రమేష్, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ గోపి, బండారు కోదండం తదితరులు పాల్గొన్నారు.