నీ వ్యాపారం పచ్చగుండా!
నా వద్దే కంకర కొనాలి!
– సిమెంట్ కంపెనీలకు, కాంట్రాక్టర్లకు బెదిరింపులు
– అధికార పార్టీ ఎమ్మెల్యే దాదాగిరి
– రెండో ప్లాంట్ ఏర్పాటుకూ సన్నాహాలు
– ఓర్వకల్లు వద్ద ఇప్పటికే పనులు
మంచి పనులు చేయాలి. ప్రజల హృదయాల్లో నిలిచిపోవాలి. చరిత్రలో తనకంటూ ఒక పేజీ ఉండాలి. ఇదీ ఒకప్పటి రాజకీయ నేతల మదిలోని మాట. ఇప్పుడు ఇలాంటి నేతలు నూటికో.. కోటికో ఒక్కరు. నాయకుడు కావడమే తరువాయి.. ఏడు తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తిపాస్తులు వెనకేసుకోవడంపైనే దృష్టి. తాజాగా ఓ అధికార పార్టీ నేత తన వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు రాజకీయాలను వేదికగా చేసుకున్న తీరు చర్చనీయాంశంగా మారింది.
సాక్షి ప్రతినిధి, కర్నూలు: దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకునేందుకు అధికార పార్టీ నేతలు తాపత్రయపడుతున్నారు. వీరిలో కొందరు మరో అడుగు ముందుకేసి ఎదుటివాళ్ల ఇళ్లనూ సర్దేసే పనిలో పడ్డారు. ఈ కోవలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు ఎవరు ఏ పనిచేయాలన్నా.. ఎవరికి కంకర కావాలన్నా తన నుంచే కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే నేపథ్యంలో సదరు అధికార పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలోని ఒక సిమెంటు కంపెనీ రైల్వే సైడింగ్ పనులు చేపడుతోంది. ఈ పనులకూ సదరు ఎమ్మెల్యేకు చెందిన కంకర మిషన్ నుంచే సిమెంటు కంపెనీ కాస్తా కంకర కొనుగోలు చేయాల్సి వచ్చింది. లేనిపక్షంలో తిప్పలు తప్పవంటూ హెచ్చరించడంతో సిమెంటు కంపెనీ యాజమాన్యం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా తన నియోజకవర్గ పరిధిలో ఏ కాంట్రాక్టర్ పనిచేయాలన్నా.. అవసరమైన కంకరను తన వద్దే కొనుగోలు చేయాలని హుకుం జారీచేశారు.
భలేగా ఉంది బిజినెస్..
ఏదైనా వ్యాపారం చేయాలంటే అందుకు మార్కెటింగ్ ఎంతో కీలకం. అయితే, ఇక్కడ అధికారం ఉండటమే మార్కెటింగ్‌గా మారింది. అందుకే ఏ మాత్రం కష్టపడకుండా నియోజకవర్గంలో ఏ కాంట్రాక్టర్ పనిచేసినా.. ఏ సిమెంటు కంపెనీ పనులు చేసినా ఈయనకు చెందిన ప్లాంటు నుంచే కంకరను కొనుగోలు చేయాల్సి వస్తోంది. త్వరలో ఇదే నియోజకవర్గంలోని మిగిలిన సిమెంటు కంపెనీలు కూడా రైల్వే సైడింగ్ పనులు చేసుకోవాల్సి ఉంది. దీంతో ఈ కంపెనీలు కూడా తప్పనిసరిగా సదరు ఎమ్మెల్యే నుంచే కంకరను కొనుగోలు చేయాల్సి రానుంది. ఇక రోడ్ల పనులు చేపట్టే కాంట్రాక్టర్లు సైతం ఈయన ప్లాంటు నుంచే కంకర కొనాల్సిన పరిస్థితి. ఫలితంగా ప్లాంటులో తయారైన కంకరకు డిమాండ్ పరంగా ఇబ్బందులేమీ లేవు. ఈ నేపథ్యంలో తన వ్యాపారాన్ని విస్తరించేందుకు సదరు అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రణాళిక వేసుకున్నారు.
ఓర్వకల్లులో రెండో ప్లాంటు
ఇప్పటికే తన నియోజకవర్గంలో ఉన్న కంకర తయారీ ప్లాంటుకు గిరాకీ ఉండటంతో వ్యాపారాన్ని విస్తరించేందుకు ఎమ్మెల్యే సమాయత్తమవుతున్నారు. ఇందులో భాగంగా ఓర్వకల్లులో రెండో ప్లాంటును ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఇప్పటికే పనులు కూడా మొదలుపెట్టినట్టు సమాచారం. ఓర్వకల్లును పారిశ్రామిక హబ్‌గా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఇప్పటివరకు ఒక్క కంపెనీ కూడా పనులు ప్రారంభించకపోయినా రానున్న రోజుల్లో ఒకటో, రెండో పరిశ్రమలు పనులు చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే ఇక్కడ ఉర్దూ యూనివర్సిటీకి స్థలం కేటాయించింది. అదేవిధంగా ట్రిపుల్ ఐటీకి కూడా జగన్నాథగట్టు వద్ద స్థలాన్ని కేటాయించింది. వచ్చే విద్యా సంవత్సరంలో అటు ఉర్దూ యూనివర్సిటీ, ఇటు ట్రిపుల్ ఐటీ క్లాసులను సొంత క్యాంపస్‌లలో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో త్వరలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కంకర ప్లాంటును ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా తన ప్లాంటు నుంచే కంకరను కొనుగోలు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని అధికార పార్టీ ఎమ్మెల్యే ఆలోచనగా ఉంది. మొత్తం మీద అటు రాజకీయం.. ఇటు వ్యాపారం మేళవింపుతో మిగిలిన ఎమ్మెల్యేల కంటే ఈయన కాస్త దూసుకుపోతున్నారనే ప్రచారం జరుగుతోంది.