హంద్రీనీవా కాలువలో యువకుడు గల్లంతు
Published Sat, Sep 10 2016 12:52 AM | Last Updated on Wed, Sep 26 2018 6:21 PM
ఓర్వకల్లు /కల్లూరు: ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన ఓ యువకుడు హంద్రీనీవా కాలువలో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన బోయ శ్రీరాములు, చిట్టెమ్మ దంపతుల కుమారుడు రమేష్(16) తన స్నేహితులైన శివ, హనుమంతు, నగేష్, ఆనంద్‌లతో కలసి శుక్రవారం మధ్యాహ్నం సరదాగా ఈతకు వెళ్లాడు. కల్లూరు మండలం తడకనపల్లె గ్రామ సమీపంలో గల హంద్రీనీవా కాలువలో రమేష్ రెండుసార్లు ఈత కొట్టి పైకి వచ్చాడు. మూడోసారి గట్టుపైనుంచి కాలువలోకి దూకిన అనంతరం వెలుపలికి రాలేదు. దీంతో తోటి మిత్రుడు అతని కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. వెంటనే నన్నూరు గ్రామానికి చేరుకుని స్థానికులకు సమాచారం అందజేశారు. ఆ మేరకు గ్రామానికి చెందిన కొందరు ప్రజలు హంద్రీనీవా కాలువ గట్టుకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. తడకనపల్లె గ్రామం నుంచి వెల్దుర్తి మండలం వద్దనున్న మల్లేపల్లి వరకు గాలించారు. ఈ విషయాన్ని ఉలిందకొండ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం చేరవేసినప్పటికీ తమ పరిధిలోకి పోలీసులు చెప్పడంతో కర్నూలు తాలూకా రూరల్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందజేశారు. సాయంత్రం చీకటి పడటంతో ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదని, మల్లేపల్లి వద్దనున్న ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద అధికారులకు గ్రామస్తులు వివరాలను అందజేసి వెనుదిరిగివచ్చారు. రమేష్ ఆచూకీ కోసం శనివారం ప్రయత్నం చేస్తామని పోలీసులు, సంబంధిత అధికారులు తెలిపినట్లు సమాచారం.
Advertisement
Advertisement