
అక్క పెళ్లి.. అంతలోనే చెల్లి..
♦ ఇంటిని శుభ్రం చేస్తుండగా కరెంట్ షాక్
♦ అక్కడికక్కడే యువతి దుర్మరణం
యాచారం: ఇటీవల అక్క పెళ్లి జరిగింది.. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. అంతలోనే ఆ ఆనందం ఆవిరైపోయింది. ఇంటిని నీటితో శుభ్రం చేస్తుండగా విద్యుదాఘాతానికి గురైన చెల్లెలు దుర్మరణం పాలైంది. ఈ ఘటన మండలకేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబీకులు, సీఐ మదన్‌మోహన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాస్, మల్లేశ్వరి దంపతులు నాలుగేళ్లుగా యాచారం మండల కేంద్రానికి చెందిన విమలమ్మ పౌల్ట్రీఫాంలో పనిచేస్తున్నారు. వీరికి కూతుళ్లు పూజ, శైలు(17), పవిత్ర ఉన్నారు. పెద్ద కుమార్తె పూజ పెళ్లి జరిపించడానికి నాలుగు రోజుల క్రితం దంపతులు స్వస్థలమైన గుంటూరుకు వెళ్లారు. రెండో కుమార్తె శైలు తన మేనత్త దుర్గతో కలిసి యాచారంలోనే ఉంది.
పెళ్లి జరిగిన అనంతరం మంగళవారం కుటుం బీకులంతా యాచారానికి బయలుదేరా రు. మంగళవారం శైలుకు తల్లితండ్రులు ఫోన్ చేసి కొద్దిసేపట్లో ఇంటికి వస్తున్నాం.. ఇల్లంతా శుభ్రం చేసి పెట్టమని చెప్పారు. దీంతో మధ్యాహ్నం సమయంలో శైలు పౌల్ట్రీఫాం పక్కనే ఉన్న ఇంటిని నీటితో కడుగుతుండగా.. ఇనుప తలుపులకు ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్ తగిలి విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితికి చేరుకుంది. విషయం తెలుసుకున్న పౌల్ట్రీఫాం యజమాని విమలమ్మ కుటుం బసభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని ఆస్పత్రికి తరలించేందుకు యత్నించారు.
అప్పటికే శైలు మృతిచెందింది. శుభకార్యం జరగడంతో సంతోషంగా ఉండాల్సిన కుటుంబీకులు శైలు మృతితో కన్నీటిపర్యంతమయ్యారు. అంతలోనే నీకు నూరేళ్లు నిండాయా తల్లీ.. అంటూ శ్రీనివా స్ దంపతుల రోదనలకు స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. ఈమేరకు సీఐ మదన్‌మోహన్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.