విద్యుత్ షాక్‌కు యువకుడి బలి
-
మరో ఇద్దరికి తీవ్రగాయాలు
బెజ్జూర్ : మండలంలోని అందుగులగూడ గ్రామంలో మంగళవారం జరిగిన విద్యుత్ ప్రమాదంలో షాక్‌కు గురై కొరెత చంద్రశేఖర్(18) దుర్మరణం చెందాడు. ఇదే ఘటనలో మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
ఇదీ జరిగింది...
అందుగులగూడలో నాలుగు రోజులుగా కరెంట్ లేదు. దీంతో విద్యుత్ శాఖ అందజేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ను బిగించడానికి సంబంధిత లేబర్ గ్రామ యువకుల సాయం తీసుకున్నాడు. కొరెత చంద్రశేఖర్, నైతం సంజీవ్, సడ్మేక సుగుణాకర్ అనే యువకులు ఎడ్లబండి ద్వారా ఆ ట్రాన్స్‌ఫార్మర్‌ను సమీప చేను వద్దకు తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆ గ్రామంలో కరెంట్ లేకపోవడంతో ట్రాన్స్‌ఫార్మర్ బిగించే వరకు తమ ఇంటి వద్ద ఉన్న కరెంట్ వైర్లను సవరించడానికి సంజీవ్, సుగుణాకర్ ఊర్లోలోకి వెళ్లారు. వారి ఇంటి వద్ద ఉన్న స్తంభాలను ఎక్కి వైర్లు సవరిస్తున్నారు. ఇదే సమయంలో చేను వద్ద ఉన్న చంద్రశేఖర్ కరెంట్ లేదనే ఉద్దేశంతో కరెంట్ ఫోల్ ఎక్కాడు. పైన ఉన్న 11 కేవీ విద్యుత్ వైరుకు కరెంట్ ఉన్న విషయాన్ని గమనించక గ్రామానికి వెళ్తున్న కరెంట్ వైరుపై నిల్చొని దాన్ని పట్టుకున్నాడు. దీంతో ఒకేసారి కరెంట్ షాక్ రావడంతో గిలగిల కొట్టుకున్న చంద్రశేఖర్ కింద పడ్డాడు. ఇటు ఎల్‌టీ లైనుకు ఎర్త్ కావడంతో గ్రామంలోకి విద్యుత్ ప్రవహించింది. దీంతో గ్రామంలోని కరెంట్ స్తంభాలు ఎక్కి వైర్లు సవరిస్తున్న సంజీవ్, సుగుణాకర్‌కు విద్యుత్ షాక్ తగిలి వారు కూడా స్తంభాల పైనుంచి కింద పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ వారిని సిర్పూర్(టి) ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కొన ఊపిరితో కొట్టుకుంటున్న చంద్రశేఖర్‌ను గ్రామస్తులు ఇంటికి తీసుకురాగా.. అక్కడ ప్రాణాలు వదిలాడు. మృతుడి తండ్రి లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఎస్సై సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.
ట్రిప్ కాకపోవడంతో...
చిన్న పిట్ట వాలితే కరెంట్ ట్రిప్ అయ్యేలా సబ్‌స్టేషన్‌లో వ్యవస్థ ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా అందుగులగూడలో 11 కేవీ లైన్‌ను యువకుడు ముట్టుకున్నా రెబ్బెన సబ్‌స్టేషన్‌లోని ఫీడర్ ట్రిప్ కాకపోవడంతో చంద్రశేఖర్ ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ సబ్‌స్టేషన్‌లో లోపాల కారణంగానే ఒకరి ప్రాణాలు పోయాయని, వ్యవస్థను బాగుపర్చాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.