
పోలీస్‌స్టేషన్‌లో యువతి ఆత్మహత్యాయత్నం
ఫేస్‌బుక్‌లో ప్రేమ వ్యవహారమే కారణం!
పెనమలూరు: కృష్ణాజిల్లా, పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో ఓ యువతి (23) బుధవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడితో ప్రేమ వ్యవహారం వికటించడంతో ఈ ఘటన జరిగిందని సమాచారం. పోలీసులు ఈ కేసు వివరాలు చెప్పడానికి నిరాకరించారు. సేకరించిన వివరాల ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన యువతి బీటెక్ చదివింది. విజయవాడ కృష్ణలంక నెహ్రూనగర్‌కు చెందిన పోస్టల్ ఉద్యోగి కుమారుడు (25) సీఏ చదువుతున్నాడు. వారిద్దరికీ ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. ఇద్దరు పెళ్లి చేసుకుందామని అనుకున్నారు.
యువతి, తన తల్లిదండ్రులతో మూడునెలల క్రితం కానూరులో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటోంది. ఆ తరువాత సింగ్‌నగర్‌కు మకాం మార్చారు. ఈ నేపథ్యంలో ఇద్దరికీ మనస్పర్ధలు వచ్చాయి. యువకుడు తనను మోసం చేశాడని యువతి బుధవారం ఉదయం పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు స్పందించలేదని సమాచారం. యువతి బుధవారం రాత్రి పోలీస్‌స్టేషన్‌కు స్కూటర్‌పై వచ్చి బాత్రూమ్‌లు శుభ్రంచేసే యాసిడ్ తాగి వాంతులు చేసుకుని పడిపోయింది. దీంతో పోలీసులు ఆమెను హుటాహుటిగా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడటంలేదు.