
ఆసరా ఉంటావనుకుంటే..
- ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య
- మృతుడు ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు కారు అద్దాల ధ్వంసం చేసిన కేసులో నిందితుడు
వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటావని కూలి, నాలీ చేసి చదివించాం.. హైదరాబాద్‌కు వెళ్లి పెద్దోళ్లతో గొడవ పెట్టుకుంటివి..పెద్దోళ్లతో తగవు వద్ద నాయనా.. ఎంత ఖర్చయినా, ఎలాగోలా నిన్ను బయటకు తెచ్చుకుంటాం.. నువ్వేం బాధపడొద్దు అని చెప్పాం.. ఇంతలోనే ఇలా చేసుకుంటివా తండ్రీ.. అంటూ రవీంద్ర తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఒక్కగానొక్క కొడుకువు.. నువ్వూ లేకపోతే మేం ఎవరి కోసం బతకాలి అంటూ వారు గుండెలవిసేలా రోదించడం చూపరులను కలచివేసింది.
- నల్లమాడ
నల్లమాడ మండలంలోని ఎద్దులవాండ్లపల్లికి చెందిన వల్లిపి రవీంద్ర (32) ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రముఖ సినీ దర్శకుడు కే.రాఘవేంద్ర రావు కారు అద్దాలు ధ్వంసం చేసిన కేసులో మృతుడు నిందితుడు. 2016 జూలై 9న జరిగిన ఈ సంఘటన అప్పట్లో సంచలనం రేకిత్తించింది. కేసులో శిక్ష పడితే బీఎడ్ పూర్తిచేసిన తన భవిష్యత్తు నాశనం అవుతుందన్న భయంతో తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని మృతుని తల్లిదండ్రులు చెబుతున్నారు.
వివరాలు ఎద్దులవాండ్లపల్లికి చెందిన వల్లిపి వెంకటప్ప, అంజనమ్మ దంపతులకు రవీంద్ర, సుకన్య సంతానం. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు రవీంద్ర బీఎడ్ పూర్తిచేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. ఆదివారం తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా అవ్వ నాగమ్మ ఇంట్లో ఉండేది. అవ్వ బయటకు వెళ్లగానే తలుపుకు లోపల గడియపెట్టి ఫ్యాన్‌కు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అరగంట తర్వాత ఇంటికి వచ్చిన అవ్వ మనవడిని ఎన్నిసార్లు పిలిచినా పలకకపోవడంతో కిటికీలో నుంచి తొంగిచూసింది. మనవడు రవీంద్ర ఫ్యాన్‌కు వేలాడుతూ కన్పించాడు. ఇరుగుపొరుగు వారు తలుపు గడియ పగులగొట్టి మృతదేహాన్ని బయటకు తెచ్చారు.
అసలేం జరిగింది..
గత ఏడాది జూన్ 9న హైదరాబాద్‌లో ప్రముఖ సినీ దర్శకుడు కే.రాఘవేంద్ర రావు ఇంటి వద్ద రవీంద్ర దాడికి దిగి రెండు కార్ల అద్దాలు ధ్వంసం చేసిన ఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన శ్రీరామదాసు సినిమా కథ తనే రాశానని, ఆ డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టడంతో కారు అద్దాలు ధ్వంసం చేసినట్లు పోలీసులకు వివరించారు. ఈ సంఘటనపై అప్పట్లో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అనంతరం 2017లో సైతం మరో కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసుల్లో అతడిని రిమాండ్‌కు తరలించగా తల్లిదండ్రులు బెయిల్‌పై బయటకు తెచ్చారు. అయితే వాయిదా ఉందంటూ రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు వెళ్లి శనివారం ఇంటికి తిరిగి వచ్చిన రవీంద్ర ఆదివారం ఉరి వేసుకుని మృతిచెందాడు. ఎస్‌ఐ కె.గోపీ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అతడి తండ్రి వెంకటప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.