
ఆదివారం వరంగల్ జిల్లా ఏటూరునాగారం ఆస్పత్రిలో నిందితుడి వివరాలు రాసి చూపిస్తున్న లక్ష్మి
ప్రేమించాడు.. పెళ్లి చేసుకోవాలని నిలదీస్తే ప్రాణాలు తీయడానికి తెగబడ్డాడు ఓ ప్రేమోన్మాది. శనివారం రాత్రి వరంగల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది.
- వరంగల్ జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం
- గాయంతో మూగబోయిన యువతి గొంతు..
- మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలింపు
ఏటూరునాగారం: ప్రేమించాడు.. పెళ్లి చేసుకోవాలని నిలదీస్తే ప్రాణాలు తీయడానికి తెగబడ్డాడు ఓ ప్రేమోన్మాది. శనివారం రాత్రి వరంగల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. ఏటూరునాగారం మండలంలోని బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన సునారికాని రాజబాబు (22) అదే గ్రామానికి చెందిన జనగాం లక్ష్మి అలియాస్ ఉపేంద్ర (19)ను ప్రేమించాడు. ఆమెకు వచ్చిన పెళ్లి సంబంధాలను సైతం చెడగొట్టాడు. ఆమె కాయకష్టం చేసి సంపాదించిన రూ. 80 వేలు కాజేశాడు. ఈ క్రమంలో ఇటీవలే రాజబాబుకు మేనత్త కూతురితో పెళ్లి కుదిరింది. దీంతో లక్ష్మి ‘నన్ను ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంటావా?’ అని రాజబాబును నిలదీసింది.
ఆగ్రహించిన రాజబాబు, బావమరిదితో కలసి ఆమెను అంతమొందించడానికి పథకం రచించాడు. శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో లక్ష్మి ఇంట్లో నిద్రిస్తుండగా, మాట్లాడే పని ఉందంటూ సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లాడు. వెంట తెచ్చుకున్న బ్లేడుతో లక్ష్మి గొంతు కోసి పరారయ్యూడు. స్పృహ కోల్పోయిన లక్ష్మి రాత్రంతా అడవిలోనే ఉంది. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో మెలకువ రావడంతో ఎలాగోలా ఏటూరు గ్రామానికి చేరుకుంది. లక్ష్మిని గమనించిన గ్రామస్తులు ఏం జరిగిందని ఆరా తీసినా.. ఆమె గొంతు మూగబోవడంతో ఏమీ చెప్పలేకపోయింది. దీంతో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆమెకు ఆశ్రయమిచ్చారు.
వీఆర్‌వో గంపల నర్సయ్య పోలీసులకు సమాచారమిచ్చారు. ఈమేరకు కేసు నమోదుచేసి, నిందితుల కోసం గాలిస్తున్నామని ఎస్సై వర్స వినయ్‌కుమార్ తెలిపారు. అనంతరం లక్ష్మిని 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా ఆ వాహనం కంతనపల్లి సమీపంలో దిగబడింది. దీంతో బొలెరో వాహనంలో ఏటూరు నుంచి కంతనపల్లి వరకు లక్ష్మిని తరలించి అక్కడినుంచి మరో 108లో ఏటూరునాగారం ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఆరా తీసిన రాజబాబు
రాత్రివేళ గొంతుకోసి అడవిలో వదిలేసిన లక్ష్మి చనిపోయిందా.. లేక బతికే ఉందా..? అనే సమాచారం కోసం రాజబాబు ఏటూరులో తిరుగుతూ వాకబు చేశాడు. ఎవరైనా ఓ అమ్మాయి ఇటు వచ్చిందా? అని వాకబు కూడా చేశాడు.
చంపుతానని బెదిరించాడు
బ్లేడుతో రెండంగుళాల లోతులో గొంతు కోయడంతో లక్ష్మి మాట మూగబోయింది. అడవిలో జరిగిన ఘటన గురించి చెప్పలేకపోతోంది. తల్లి మల్లక్కను చూసి భోరున విలపించింది. ఏం జరిగిందని పోలీసులు అడిగితే.. తనకు జరిగిన అన్యాయాన్ని పెన్నుతో పేపర్‌పై రాసి చూపించింది. ‘నన్ను ప్రేమిస్తున్నానని రాజబాబు వెంటబడ్డాడు. నేనూ నమ్మాను. నేను కష్టపడి వెనకేసిన రూ. 80 వేలను.. మళ్లీ ఇస్తానని నమ్మబలికి కాజేశాడు. నా ఒంటిపై ఉన్న కమ్మలు, పట్టా గొలుసులు కూడా లాక్కున్నాడు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. నాన్న చిన్నప్పుడే చనిపోయిండు. అమ్మకు నేనొక్కదాన్నే ఆధారం’ అని రాసి చూపిస్తూ.. లక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపించింది.