ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
గొలగమూడి (వెంకటాచలం): చెట్టుకు ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని గొలగమూడిలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. బాలాయపల్లి మండలం కడగుంట గ్రామానికి చెందిన ఎన్.శ్రీను అలియాస్ జీవా నెల్లూరు నగరంలోని నారాయణ హాస్పిటల్ ప్రాంగణంలోని కిచెన్‌లో సప్లయిర్‌గా పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితం అక్కడ విధుల నుంచి యాజమాన్యం తొలగించింది. ఆదివారం గొలగమూడికి వచ్చిన శ్రీను ఆశ్రమ అన్నదాన కేంద్రంలో ఆదివారం రాత్రి భోజనం చేసి కోనేరు కట్టపై నిద్రించాడు. సోమవారం మధ్యాహ్నం సమయంలో మద్యం తాగి కట్టపై ఉన్న చింతచెట్టుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని స్వీపర్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలంలో మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, బంధువులకు సమాచారం అందించారు.
అనారోగ్యంతో ఆత్మహత్య
అనారోగ్య సమస్యతోనే శ్రీను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. శ్రీనుకు ఇటీవల వైద్య పరీక్షలు చేయగా హె^Œ ఐవీ పాజిటివ్ అని నిర్ధారణ అయిందని తెలియడంతో విధుల నుంచి తప్పించారు. అప్పటి నుంచి ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న శ్రీను గొలగమూడికి చేరుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తుంది.