జైలు పాలైన యువజన కాంగ్రెస్ నేత
-
బెదిరించిన కేసులో రమాకాంత్‌రెడ్డి అరెస్టు
వరంగల్ : ఇచ్చిన డబ్బులు అడిగినందుకు దూషించంతో పాటు దాడి చే సిన ఘటనలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గొట్టిముక్కుల రమాకాంత్‌రెడ్డి జైలు పాలయ్యారు. బాధితుల ఫిర్యాదు, ఆధారాల మేరకు ఆయనను అరెస్టు చేసి శనివారం రిమాండ్ చేసినట్లు సుబేదారి సీఐ వాసాల సతీష్ తెలిపారు. హన్మకొండకు చెందిన మలియాల సుమిత్‌కుమార్ దగ్గర ఉద్యోగం ఇప్పిస్తానని, ఇతరత్రా ఖర్చుల కోసం రమాకాంత్‌రెడ్డి రూ.2లక్షలు తీసుకున్నాడు. ఈ డబ్బుల విషయమై ఫోన్‌లో డబ్బులు అడిగితే నానా దుర్భాషలాడిన రమాకాంత్.. డబ్బులు పదే పదే అడుగుతున్నందుకు సుమిత్‌కుమార్ ఇంటికి వెళ్లి దాడి చేశారు. ఇదే క్రమంలో రోడ్డుపై అతని సోదరుడు రోడ్డుపై కనిపిస్తే డబ్బులు ఎక్కడివిరా... అంటూ చేయి చేసుకున్నట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో పాటు సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన ఆధారాలతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా రమాకాంత్‌రెడ్డిని రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు.
వరస ఘటనలతో నాయకుల్లో ఆందోళన
కాంగ్రెస్‌కు పునర్వైభవం తీసుకురావాలని పార్టీ నాయకులు అష్టకష్టాలు పడుతుంటే యువజన కాంగ్రెస్ నాయకుల వైఖరితో ఉన్న కాస్తా పరువు పోయే పరిస్థితులు నెలకొన్నాయి. మేడారం పాస్‌ల దొంగతనంలో యువజన కాంగ్రెస్‌కు చెందిన శ్రీనివాసరెడ్డి జైలు పాలుకాగా, దబ్బులు తీసుకొని భౌతికదాడులు చేసిన కేసులు యువజన కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ రమాకాంత్‌రెడ్డి జైలు పాలు కావడాన్ని పార్టీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇటీవల జిల్లా నాయకత్వంపై ఆరోపణలు చేయడం, పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం లేదన్న కారణంతో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రమాకాంత్‌రెడ్డిని రాష్ట్ర నాయకత్వం సస్పెండ్ చేసింది. ఈ విభాగాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని రాష్ట్ర, జాతీయ నాయత్వాన్ని కోరుతామని సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు.