విద్యుదాఘాతానికి యువకుడి బలి
కావలిరూరల్ : ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన బుధవారం పట్టణంలో సంకులవారితోట సాయిబాబా మందిరం వీధిలో జరిగింది. ఒకటో పట్టణ ఎస్‌ఐ జి.అంకమ్మ కథనం మేరకు.. జౌళి రాజశేఖర్ అరుణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. ఇద్దరూ చదువు మధ్యలోనే ఆపేసి స్థానికంగా కరెంటు, ప్లంబింగ్ పనులకు వెళ్తుంటారు. బుధవారం ఓ కుమారుడు మీరయ్య (20) స్థానిక పాతూరు అరటి తోటలో కరెంటు మరమ్మతుల కోసం తన బాబాయ్ భద్రయ్యతో కలిసి వెళ్లాడు. కనెక‌్షన్ సరి చేస్తుండగా అతను విద్యుదాఘాతానికి గురయ్యాడు. గమనించిన తోటి పనివారు వెంటనే మెయిన్ ఆఫ్ చేసి హుటాహుటి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో ఏరియా వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. యువకుడి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. చేతికెక్కొచ్చిన కుమారుడు ఇలా అర్ధాంతరంగా మృతి చెందడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.