
బస్సులోకి దూసుకొచ్చిన మృత్యువు
- పక్క బస్సు రాడ్ గొంతులో దిగడంతో యువకుడి మృతి
- రవీంద్రభారతి చౌరస్తా వద్ద దారుణం
హైదరాబాద్: ఆర్టీసీ బస్సులో కూర్చొని ప్రయాణిస్తున్న ఓ యువకుడికి ఊహించని విధంగా పక్క బస్సు రాడ్ కిటికీలోంచి దూసుకొచ్చి గొంతులో గుచ్చుకుంది. దీంతో యువకుడు బస్సులోనే గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలొదిలాడు. సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో రవీంద్రభారతి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన వి.ఈశ్వర్‌రావు(23) కొండాపూర్‌లోని కిమ్స్ హాస్పిటల్ క్యాంటీన్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. స్నేహితులతో కలిసి అంబర్‌పేట్‌లో నివాసం ఉంటున్నాడు. సోమవారం విధులు ముగించుకొని లింగంపల్లి నుంచి కోఠి వెళ్తున్న 127కే (ఏపీ28జెడ్0547) బస్సులో బయల్దేరాడు. రవీంద్రభారతి సిగ్నల్ వద్ద.. పక్కన ఉన్న మరో మెట్రో బస్సును ఓవర్‌టేక్ చేస్తూ బస్సు ముందుకు వెళ్లింది.
ఈ క్రమంలో మెట్రో బస్సు అద్దాల వద్ద ఉన్న ఇనుప రాడ్డు 127కే బస్సు చివర అద్దానికి తగిలి.. నేరుగా లోపలికి దూసుకొచ్చింది. బస్సు వెనుక సీట్లో కిటికీ వద్ద కూర్చున్న ఈశ్వర్‌రావు గొంతులోకి దిగింది. దీంతో ఈశ్వర్‌రావు అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటన అనంతరం బస్సు డ్రైవర్ శ్రీనివాసులు అక్కడ్నుంచి పరారయ్యాడు.