యువ ఓటర్ల శాతం పెరగాలి | youth voter hike says jc ramamani | Sakshi
Sakshi News home page

యువ ఓటర్ల శాతం పెరగాలి

Published Thu, Jun 15 2017 11:52 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

యువ ఓటర్ల శాతం పెరగాలి - Sakshi

యువ ఓటర్ల శాతం పెరగాలి

– రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి
– జాయింట్‌ కలెక్టర్‌ టి.కె.రమామణి సూచన

అనంతపురం అర్బన్‌ : జిల్లాలో యువ ఓటర్ల శాతం పెరగాలని, ఇందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు జిల్లా యంత్రాగానికి సహకరించాలని జాయింట్‌ కలెక్టర్‌ టి.కె.రమామణి కోరారు. ఓటర్ల నమోదుపై ఆమె గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవితో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లా జనాభా ప్రకారం 18 నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్న యువత ఓటర్లుగా 4 శాతం నమోదై ఉండాలన్నారు. అయితే ఇప్పటి వరకు 0.85 శాతం మాత్రమే యువ ఓటర్లుగా నమోదయ్యారన్నారు. ఈ వ్యాత్యాసాన్ని పూరించేందుకు జిల్లా యంత్రాంగంతో పాటు వివిధ రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టామని పార్టీ ప్రతినిధులు ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఒక బూత్‌ లెవల్‌ ఏజెంట్‌ని నియమించి యువ ఓటర్ల నమోదుకు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

కేంద్ర ఎన్నికల సంఘం యువతను (18–21 ఏళ్లు) ఓటర్లుగా నమోదుకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసిందన్నారు. జూలై 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు బూత్‌ స్థాయి      అధికారులతో ఇంటింటి సర్వే నిర్వహిస్తామన్నారు. అలాగే ప్రతి నియోజకవర్గంలోని ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల్లో అర్హులైన వారిని ఓటర్లుగా చేర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బూత్‌ స్థాయి అధికారులు జూలై 9వ తేదీ నుంచి 23వ తేదీ వరకు సంబంధిత పోలింగ్‌ కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటారని, ఆ సమయంలో కూడా యువత ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చన్నారు.  ఇందుకు సంబంధించి కలెక్టరేట్‌లో జిల్లా సంప్రదింపు కేంద్రాన్ని  ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కేంద్రం పని చేస్తుందన్నారు. ప్రజలు ఎవరైనా 08554– 247494, 247495 నెంబర్లకు ఫోన్‌ చేసి ఓటరు నమోదు, ఓటరు గుర్తింపు కార్డు, ఎనికల విషయాలను తెలుసుకోవచ్చన్నారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పెన్నోబుళేసు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, బీజేపీ నగర అధ్యక్షుడు శ్రీనివాసులు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బి.హెచ్‌.రాయుడు, ఇతర పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

బోగస్‌ ఓట్లు తొలగించాలి
నగరంలో అధిక సంఖ్యలో బోగస్‌ ఓట్లు ఉన్నాయని వాటి తొలగింపునకు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కొందరు రాజకీయ నాయకులు, కార్పొరేటర్లు బూత్‌ స్థాయి అధికారులపై అజమాయిషీ చేసి బోగస్‌ ఓట్లను నమోదు చేశారన్నారు. ఒక స్థాయి అధికారితో విచారణ చేయించి బోగస్‌ ఓటర్ల తొలగింపునకు చర్యలు తీసుకోవాలన్నారు. అంశాన్ని పరిశీలిస్తామని జాయింట్‌ కలెక్టర్‌ అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement